దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడా..?

  • వాళ్ల‌ను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొట్టే స‌మ‌య‌మొచ్చింది
  • ప్రజలు సమస్యలతో తన వద్దకు రావడం లేదని కేసీఆర్ దుఃఖం
  • అచ్చంపేట బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క‌

మహబూబ్ న‌గర్ ప్రజాతంత్ర మే 26. దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka )  ప్రశ్నించారు. దెయ్యాలను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పలు విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించిన డిప్యూటీ సీఎం మరికొన్ని సబ్ స్టేషన్లుకు శంకుస్థాపన చేశారు.

అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆయన కూతురు కవిత చేసిన వ్యాఖ్యలను భట్టి గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రజలు ఎన్నికల ముందే ఈ దయ్యాలను వదిలించుకొని ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్న విషయాన్ని గమనించాలని చురకలంటించారు. మరో రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను ప్రజా ప్రభుత్వం సిద్ధం చేస్తుందన్నారు. వరుస సంక్షేమ పథకాలు, ఉద్యోగ, స్వయం ఉపాధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్నారని చెప్పారు. వందమంది కేసీఆర్లు అడ్డం వొచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఆగదన్నారు. ఏ సమస్యతో తన దగ్గరకు ప్రజలెవవరూ రావడం లేదని కేసీఆర్ దుఃఖపడుతున్నారని చురకలంటించారు.

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. 17 నెలల క్రితం అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాతతో పాటు కొత్త పథకాలతో, కార్యక్రమాలతో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. రాష్ట్రంలో తాము నిర్వహించిన కులగణనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. సవాళ్లతో కూడిన కులగణనను విజయవంతంగా ఎలా పూర్తి చేశారని దేశంలోని అన్ని రాష్ట్రాలు తమను అడుగుతున్నాయని చెప్పారు. పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఉద్యోగులకు రూ. పదివేల కోట్లు బకాయిలు పెడితే… తాము రాగానే అందులో రూ. ఎనిమిది వేల కోట్ల ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేశామన్నారు. ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయయులు, అన్ని వర్గాల సమస్యలన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా నిరుద్యోగంపై ఫోకస్ చేసినట్లు భట్టి వివరించారు. అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రెండొందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం లక్షలాది మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ఈ గృహజ్యోతి పథకంతో రాష్ట్రంలో 90 శాతం మంది కరెంటు బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా పోయిందన్నారు. భవిష్యత్తు తరాలకు మిగులు విద్యుత్తు అందించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్మే స్థాయికి ఎదుగుతామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో అంచనాలకు మించి 17,162 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేసినట్లు వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డు, మూసి పునరుజ్జీవంతో హైదరాబాద్ దశను మారుస్తామని చెప్పారు. కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశాం అన్నారు. 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న ఆయన మరో 30వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

అర్హత ఉండి ఉద్యోగం రాని యువత కోసం రూ.9వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకొని తమ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి కేసీఆర్ కు దుఃఖం ఎందుకు వస్తుందో అర్ధం కావడం లేదన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తున్నందుకు, సన్నధాన్యం రైతులకు రూ. 500 బోనస్ ఇస్తున్నందుకా అని ప్రశ్నించారు. రూ. లక్ష రైతు రుణమాఫీని పదేండ్లలో వాయిదాల పద్ధతిన మాఫీ చేస్తే అది ఆనాడు బ్యాంకు వడ్డీలకే సరిపోయిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరంభంలోనే ఒకేసారి రూ.22 వేల కోట్ల రైతు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రైతులే కాకుండా కాదు భూమిలేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏటా రూ. 12 వేలు అందిస్తున్నామన్నారు. రూ.2వేలు అదనంగా పెంచి రైతు భరోసా ఇస్తున్నందుకు చూడలేక ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ కన్నీరు పెడుతున్నారని చురకలంటించారు. ప్రజలు ఆర్థికంగా నిలబడేలా ప్రతి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇటీవల అచ్చంపేట సభలో రూ. 12,600 కోట్లతో నల్లమల డిక్లరేషన్ చేశామని భట్టి వివరించారు. ఈ దేశ చరిత్రలో ఎవరు ఇప్పటివరకు ఈ ఆలోచన చేయలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు భట్టి వివరించారు. ఈ ప్రాజెక్టు జీవో ఇచ్చిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. మూడు, ఆరు నెలలు, ఆ తర్వాత రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్టు అచ్చంపేట నియోజకవర్గం లో 45వేల పంపుసెట్ల కు సోలార్ పవర్ ఏర్పాటు చేయడంపై విద్యుత్ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 10 కాలాలపాటు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.ఈ సభలో జిల్లామంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి , అచ్చంపేట, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, తూడి మేఘా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్ల కోత్వాల్, డీసీసీబీ అధ్యక్షులు మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page