‘భారత్ మాతాకీ జయ్య్!’ పెద్దగా అరిచాడు. అలా అరిచినప్పుడు అతని కంఠనాళాలే కాదు, కంఠం కూడా వుబ్బింది. కళ్ళు యెర్రబడ్డాయి. కరుచుకున్న పల్లు టకటకలాడాయి. ముఖమయితే బాగా పిడిచి ఆరబెట్టిన బట్టలా యెక్కడికక్కడ వుగ్గులు పడిరది. రోడ్డుమీద గుడ్డలు చించుకున్న అతణ్ణి చూసి ‘దేశభక్తుడు’ అన్నారు కొందరు. ‘తెలంగాణ మాతాకీ జయ్య్!’ మళ్ళీ అరిచాడు. పిడికిలి బిగించాడు. అతణ్ణి చూసి ‘తెలంగాణ వాది’ అన్నారు కొందరు. అలా అన్నారో లేదో ‘ఆంధ్రా మాతాకీ జయ్య్!’ అన్నాడు. ‘ఆంధ్రావాదా? తెలంగాణ సెట్లరా? సమైక్యవాదా?’ యెవరికి తోచినట్టు వారు అనుమానించారు.
అంతలోనే ‘అమెరికా మాతాకీ జయ్య్!’ అన్నాడు. అలా అన్నప్పుడు చేతిలోని కర్రని అచ్చం లిబర్టీ ఆఫ్ స్టాచ్యూలా పట్టుకున్నాడు.
‘లేదు లేదు గ్లోబల్ వాది’ అని కొందరు. ‘అమెరికా వాది కావచ్చు’ అని మరికొందరు. ‘తెలివైనవాడు, అగ్రరాజ్యానికి జై కొట్టకపోతే అడ్రస్ వుండదని’ యింకొందరు. ‘వీడికి చైనావాడితో ప్రమాదం వుండదా?’ యెవరో గుట్టులాగిన గూఢచారిలా అనేలోపలే ‘చైనా మాతాకీ జయ్య్!’ అని అరిచాడు. ‘పోన్లెండి పాకిస్తాన్ మాతాకీ అనలేదు’ అని కొందరు తృప్తిపడేలోపే ‘…జయ్య్!’ అని ఆ మాటా అనేశాడు.
ఇంతలో ఆసుపత్రి సిబ్బంది వచ్చి అతణ్ణి పట్టుకు వేన్ యెక్కించారు. అందరూ ‘మమ్మీ యెవడీడూ?’ అన్నట్టు చూశారు, చుట్టూ గుమికూడినవాళ్ళు. ‘భారత్ మాతాకీ జయ్య్… అనమని నెత్తిమీద గట్టిగా కొట్టారు, అప్పటి నుండి యిలా’ నర్స్ చెప్పేసరికి దేశభక్తుడు కాస్త అప్పటికప్పుడు పిచ్చోడయిపోయాడు?!
బమ్మిడి జగదీశ్వరరావు