ఆకర్షణీయంగా హెరిటేజ్ వాక్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలలో భాగంగా మంగళవారం 190 దేశాలకు చెందిన అందాల భామలు చార్మినార్ దగ్గర సందడి చేశారు. ఇక్కడి నుంచి వీరు హెరిటేజ్ వాక్ చేయనున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. రాత్రికి చౌమహల్లా ప్యాలెస్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు వీరు చుడీ బజార్‌లో ఎంపిక చేసిన కొన్ని షాపులలో గాజులు, ముత్యాలహారాలు, అలంకరణ వస్తువుల షాపింగ్ చేయనున్నారు.
అంతే కాకూండా వీరికి మెహందీ పెట్టడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చార్మినార్ వద్ద వీరికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. సంప్రదాయ అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం లభించింది. చార్మినార్ అందాలను, చుట్టుపక్కల ప్రాంతాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజిపై నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గ్రూప్ ఫోటో దిగారు. కొందరు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అరబ్బీ మర్ఫా వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేశారు.
ఫోటో సెషన్ తర్వాత మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు చార్మినార్ లోపలికి వెళ్లి సందర్శించారు. చార్మినార్ విశిష్టతను, చారిత్రక నేపథ్యాన్ని వివిధ దేశాల నుంచి వచ్చిన మిస్ వరల్డ్ ప్రతినిధులకు టూరిజం గైడ్లు వివరించారు. చారిత్రాత్మక లాడ్ బజార్ లో ఎంపిక చేసిన కొన్ని షాపుల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు షాపింగ్ చేశారు. ముత్యాలు, గాజులను ఆసక్తికరంగా పరిశీలిస్తూ వాటి వివరాలు తెలుసుకుంటూ కొనుగోలు చేశారు. స్థానిక వ్యాపారులతో ముచ్చటించి వారు అమ్మే వస్తువుల వివరాలు తెలుసుకున్నారు.