– రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చవద్దు
– జాప్యం పోలీసు శాఖకే అవమానం
– బాధితురాలి చిత్రాలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలకు డిమాండ్
– డీజీపీకి రాష్ట్ర మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల జేఏసీ వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో, భారతీయ న్యాయ సంహిత కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ మహిళా, ట్రాన్స్ జెండర్ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (డబ్ల్యూటీ -జేఏసీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం డీజీపీకి సంఘం ప్రతినిధులు ఒక లేఖను సమర్పించారు. ఇటీవల భగీరథ్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74 – 75 కింద, అలాగే పోక్సో చట్టం, 2012 లోని సెక్షన్లు 11 (సెక్షన్ 12 తో కలిపి), సెక్షన్ 5(1) (సెక్షన్ 6 తో కలిపి) కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ నెం. 684/2026 కు సంబంధించిన కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరా రు. 17 ఏళ్ల బాలికను లైంగికంగా వశపరచుకోవడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలు వచ్చాయని తెలిపారు. బాలిక మీద సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాలు మాకు తీవ్ర ఆందోళ నలను రేకెత్తిస్తున్నాయని వివరించారు. దీనికి తోడు, బాధితురాలైన మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలను ఆమె అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం / లీక్ చేయడం, బండి భగీరథ్ మద్దతుదారులచే ఆ బాలికపై ద్వేషపూరిత, కఠోరమైన సోషల్ మీడియా లో ప్రచారం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలు ఆమెపై మరిన్ని దాడులకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడైన బండి భగీరథ పోక్సో కేసు వివరాలు విస్తృతంగా వార్తలలో వచ్చినా, నిందితుడు పోలీసుల లుకౌట్ నోటీసులను పట్టించుకోకుండా లొంగిపోవడానికి రెండు రోజుల సమయం కోరుతూ ఈ-మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం పోలీసు శాఖకే అవమానం అని అన్నారు. ఈ కేసులో నిందితుడు రాజకీయ పలుకుబడి ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్ల పోలీసులు అతనిపై ఉదారత ప్రదర్శిస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే లుకౌట్ నోటీసు జారీ అయి, ఎలక్ట్రానిక్ పోలీసులతో ఈ-మెయిల్ ద్వారా మాట్లాడుతున్నప్పుడు నిందితుడిని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి అరెస్టు చేయడం పోలీసు శాఖ తక్షణ కర్తవ్యమని తెలిపారు. బండి భగీరథ్ పై రిజిస్టర్ అయిన అభియోగాలు నాన్ బెయిలబుల్ నేరాలుగా పోక్సో చట్టంలో ఉన్నప్పటికీ అతని అరెస్టులో పోలీసుల జాప్యం, న్యాయ వ్యవస్థ నిష్పక్షపాత, విశ్వసనీయతపై ఉన్న ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలపారు.
తక్షణం అరెస్టు చేయాలి
ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా బండి భగీరథ్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని, రాజకీయ నిందితుడి తండ్రి బండి సంజయ్ లేదా ఇతర పార్టీ నాయకుల ప్రభావం దర్యాప్తుపై లేకుండా చూడాలని కోరారు. అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు దర్యాప్తును జాప్యం చేయడా నికి లేదా సాక్ష్యాలను నాశనం చేయడానికి వీలు కల్పించకూడదని, మైనర్ బాధితురాలికి, ఆమె కుటుంబానికి పూర్తి రక్షణ, కౌన్సెలింగ్ అందించాలని కోరారు. బాలిక చిత్రాలను ప్రచారం చేసిన మీడియా సంస్థలు, వ్యక్తులపై బాలల రక్షణ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని కోరారు.



