– అభినందించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: హన్మకొండలోని సమ్మయ్యనగర్, అమరావతినగర్, టీవీ టవర్ ప్రాంతాలు ఇటీవల వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల నుండి రక్షించిన చిన్నారుల ఆకలి తీర్చడానికి అంగన్వాడీ సిబ్బంది విశేష సేవలు అందించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వేడిగా ఉన్న బాలమృతాన్ని చిన్నారులకు అందించారు. మంగళవారం అంగన్వాడి కేంద్రాలకు సెలవులు ప్రకటించినా అంగన్వాడి సిబ్బంది విధుల్లోనే ఉండి వరద ప్రభావిత ప్రాంతాల్లోని చిన్నారుల బాగోగులు చూసుకున్నారు. స్వయంగా బాలామృతం వండి వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని వేడివేడి బాలామృతాన్ని వడ్డించారు. మానవతా దృక్పథంతో కూడిన ఈ చొరవను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అభినందించారు. అవసర సమయంలో ప్రజల కోసం అంగన్వాడీలు నిలబడటం, చిన్నారుల ఆకలి తీర్చడం గొప్ప సేవ అని కొనియాడారు. అంగన్వాడీ వ్యవస్థ సామాజిక సేవలో ఒక కాంతి దీపంలా నిలుస్తుందని పేర్కొన్నారు. మొంథా తుఫాను నేపథ్యంలో కూడా అంగన్వాడీ సిబ్బంది చూపుతున్న నిబద్ధత, సేవా భావం పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా కూడా అభినందనలు తెలియజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





