ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చివరి మూడు రోజుల పాటు ఘనంగా కార్యక్రమాలను నిర్వహించింది. చివరిరోజు అత్యంత వైభవంగా కనులు పండువగా వేడుకలు జరిగాయి. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఏమేరకు ప్రజారంజక పాలన సాగించిందన్న విషయాన్ని చెప్పుకోవడంలో మంత్రులు, నాయకులు పోటీ పడ్డారు. ఈ ప్రజాపాలన- విజయోత్సవాల్లో ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే మహిళాభ్యుదయమేంటో రాష్ట్ర మహిళలు చవిచూశారు. అదే రోజు ఒక విధంగా మహిళలపై అమానవీయ దాడి జరిగింది. తమగోడు వెళ్ళబోసుకోవడానికి వొచ్చిన మహిళలపట్ల ప్రభుత్వం ప్రదర్శించిన దాష్టీకాన్ని యావత్ రాష్ట్ర మహిళాలోకం తీవ్రంగా విమర్శిస్తున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమని అడగడానికి వొచ్చిన మహిళలపై పోలీసులు అతి దారుణంగా వ్యవహరించడాన్ని తెలంగాణ ప్రజలు తప్పుపడుతున్నారు. మహిళలన్న విచక్షణ జ్ఞానాన్ని మరిచి ఆశ వర్కర్లపై మగ పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. దానితో ఆశ వర్కర్ల ఆందోళన అదుపుతప్పింది. ఫలితంగా కొందరికి స్వల్ప గాయాలు కాగా, ఒకరి కాలు విరగడం, ఒకరిద్దరు సృహ కోల్పోవడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు దొరికినవారిని దొరికినట్లు లాక్కెళ్ళి పోలీస్‌వ్యాన్ ఎక్కించారు. గాయాలైన పలువురు హాస్పిటల్స్ ల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో విపక్షాలు రంగంలోకి దిగడంతో ఇప్పుడిది రాజకీయ రంగు పులుముకుంది.
కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాకముందు ఆశవర్కర్లకు ఆశ కల్పించింది. తాము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం ఇస్తున్న రెమ్యునరేషన్‌కన్నా ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చింది. తమ హామీని నిలబెట్టుకోవాలని గత సంవత్సరకాలంగా ఆశవర్కర్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు , ఇతర నాయకులకు పలుసార్లు విజ్ఞాపన పత్రాలను అందజేశారు. జిల్లాలవారీగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలుసార్లు సమావేశాలు, ధర్నాలు చేపట్టారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పెద్దగా పట్టించుకోలేదు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయల మేర అప్పులు చేసిందని, ఆ అప్పుకు సంబందించిన వడ్డీలను కట్టడంతోనే సరిపోతున్నందున ఓపిక పట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌లాంటి వార్లు చెప్పినప్పటికీ ఆశావర్కర్లు తమ ఆందోళనను మాత్రం కొనసాగిస్తూ వొస్తున్నారు. తాజగా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వొచ్చి ఏడాదికాలం పూర్తి అయిన సందర్భంగా ‘ప్రజాపాలన- విజయోత్సవ’ వేడుకలను నిర్వహిస్తున్న దరిమిలా తమకు న్యాయం చేయాల్సిందిగా ఆశవర్కర్స్ జాయింట్ కమిటి ఆందోళనను ఉధృతం చేసింది.
జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు విజయోత్సవాల ముగింపు రోజైన సోమవారం హైదరాబాద్ కోఠిలోని డిఎంహెచ్‌ఎస్ కార్యాలయానికి చేరుకోవడానికి బయలుదేరిన ఆశవర్కర్లు, జెఏసి నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. బస్సులు, కార్లు చివరకు ఆటోలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా ఏదోవిధంగా అక్కడి చేరుకున్న ఆశవర్కర్లను చెదరగొట్టే విషయంలో పోలీసుల దురుసు ప్రవర్తన పలువురు మహిళలను తీవ్రంగా గాయపర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30వేల మంది ఆశవర్కర్ల బతుకుపోరాటం పై ఉక్కుపాదం మోపినట్లు అయింది. ఉదయం ఏడు గంటలనుండి రాత్రి ఎనిమిది గంటలవరకు గొడ్డుచాకిరి చేస్తున్న తమ కనీస డిమాండ్లను పట్టించుకోకపోవడం పట్ల వారు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్న తమకు కనీస ఉద్యోగ భద్రత లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు అప్పగిస్తున్న పనుల్లో ఒక్కోదానికి పీస్‌రేటులా రెమ్యునరేషన్ ఇస్తున్నదన్నారు. ప్రజలు విసుక్కున్న, చీదరించుకున్నా తమకిచ్చిన టార్గెట్‌లను పూర్తిచేస్తున్నప్పటికీ తమపైన ప్రభుత్వం మరింత పనిభారాన్ని పెంచుతున్నదంటున్నారు.
తమ కుటుంబాల బాగోగులు చూసుకునే అవకాశంకూడా తమకు లేకుండా పోతున్నదని, ఇంతా చేస్తే తమకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు లేవు. అందుకే కనీసం 18 వేల నెల వేతనాన్ని స్థిరీకరించి, పిఎఫ్‌తోపాటు 50లక్షల ఇన్సూరెన్సు సదుపాయాన్ని కలిగించాలన్నదే తమ డిమాండ్‌గా వారుచెబుతున్నారు. ఈ విషయాన్ని శాంతియుతంగా చెప్పడానికి హైదరాబాద్ తరలిన తమపట్ల ఆమానవీయంగా వ్యవహరించడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ పెండింగ్ బిల్లును చెల్లించాలంటూ ఆందోళన చేపట్టిన గ్రామ మాజీసర్పంచ్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలం నుండి చేస్తున్న ఆందోళనను సోమవారం రాష్ట్ర విజయోత్సవాల సందర్భంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టినిక తీసుకువొచ్చేందుకు ఛలోఅసెంబ్లీ నినాదంతో హైదరాబాద్ బయలుదేరిన మాజీసర్పంచ్‌లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. తమ పదవికాలంలో గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో సర్పంచ్ కనీసం 30 నుండి 50 లక్షల వరకు వివిధ పథకాలపైన ఖర్చుచేశారు. కొందరు అప్పుచేస్తే, మరికొందరు వడ్డీకి, ఇంట్లో బంగారం తాకట్టుపెట్టి పనిచేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేనాటికి కనీసం 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తే తప్ప తాము బతికే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికే అప్పుల బాధపడలేక ముఖ్యమంత్రి సొంత ఊరి సర్పంచ్‌తోపాటు పలువురు ఆత్మహత్య చేసుకోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన నెల రోజుల్లోనే తమ పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని ఇచ్చిన హామీనికూడా వారు గుర్తుచేస్తున్నారు.
-మండువ రవీందర్‌రావు
-మండువ రవీందర్‌రావు