అమెరికా అధ్యక్ష పీఠం హుందాతనం కోల్పోయింది. ట్రంప్ చేష్టలతో అమెరికా ప్రతిష్ట మసకబారిపోతున్నది. అబ్రహం లింకన్, జార్జి వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్, జాన్ ఎఫ్. కెనడీ, ఒబామా వంటి నేతలు పాలించిన అమెరికా నేడు ఒక అహంకారి, తెంపరి చేతిలో పడి పూర్వవైభవాన్ని కోల్పోతున్నది. ట్రంప్ చేష్టలకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. వాణిజ్య సంబంధమైన విషయాల్లో కూడా ట్రంప్ కొర్రీలు పెడుతున్నాడు. యు.ఎస్ ఎగుమతులకు కెనడా, మెక్సికోలు పెద్దపీట వేస్తున్నాయి. అమెరికాతో సుమారు 300 బిలియన్ల డాలర్ల వాణిజ్య భాగస్వామ్యం కలిగి ఉన్న ఈ రెండు దేశాల విషయంలో ట్రంప్ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారన్న అపప్రతిష్టను మూటగట్టుకున్నారు. అమెరికాతో భూ సరిహద్డులను పంచుకుంటున్న కెనడా, మెక్సికోలతో ట్రంప్ వైఖరి సముచితంగా లేదు. ” మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” లో భాగంగా కెనడా, గ్రీన్‌లాండ్, పనామా, మెక్సికోలను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న ఆశ ట్రంప్‌లో మెదిలింది. యుఎస్ కు తలనొప్పిగా తయారైన మెక్సికో వలస వాదులను నిరోధించడానికి మెక్సికో గోడకు ట్రంప్ గతంలోనే శ్రీకారం చుట్టారు.
ఇక కెనడా ఆర్థికంగా దివాలా తీయడం, కెనడాపై నూరుశాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించడం, కెనడా తమ దేశంలో విలీనమైతే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని ట్రంప్ చేసిన ప్రకటన.. కేవలం కెనడాకే కాదు ఇతర దేశాల సార్వభౌమత్వానికి కూడా సవాల్ విసిరినట్టుగానే భావించాలి. అమెరికాలో ఉంటున్న విదేశీయులను తరిమేయాలన్న ట్రంప్ ఆలోచన సరైనది కాదు. అమెరికాలో జన్మించిన విదేశీ వలసదారుల పిల్లలకు కూడా పౌరసత్వం నిరాకరిస్తూ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలిచిపోయింది. అమెరికా రాజ్యాంగం, న్యాయస్థానాలు ట్రంప్ ఆలోచనలను ఏనాటికీ అంగీకరించబోవు. అక్రమ వలసదారులను తిప్పి పంపడంలో తప్పు లేకపోవచ్చు. కానీ ఈ విషయంలో అమెరికా పాటిస్తున్న పద్దతి అనాగరికంగా ఉన్నమాట వాస్తవం. అమెరికాలో సుమారు 50 లక్షల మంది భారతీయులున్నారు. వారంతా విభిన్న రంగాల్లో కష్టించి పనిచేస్తూ, అమెరికా ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. కేవలం భారత్ కు చెందిన 18 వేల మందిని అక్రమ వలసదారులుగా గుర్తించి, వారిలో వందల సంఖ్యలో ఇప్పటి వరకు అమెరికా భారత్ కు తిప్పి పంపింది. ఈ ప్రక్రియ అత్యంత అవమానకరమైన రీతిలో సాగడం ఆక్షేపణీయం. ఈ చర్య ద్వారా అమెరికా తనకున్న శతాబ్ధాల ఘన నచరిత్రను, విశ్వసనీయతను, గౌరవాన్ని మసకబార్చుకుని, ప్రపంచం దృష్టిలో నిజమైన ముద్ధాయిగా నిలబడింది. ఈ వికృత చర్యతో అమెరికా అధ్యక్ష స్థానానికున్న హుందాతనం దిగజారిపోయింది.
వలసవాదుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వొచ్చిన వెంటనే అదే పని చేస్తున్నారు. చివరికి భారత్ విషయంలో కూడా అదే వైఖరి ప్రదర్శిస్తూ, అక్రమ వలస దారుల పేరుతో అమెరికాలో ఉంటున్న భారతీయులకు సంకెళ్ళు వేస్తూ, అవమానకరమైన పద్ధతిలో తరిమికొట్టడం అత్యంత దారుణం, అమానుషం. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా సుమారు 18 వేల మంది భారతీయులు తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్నారని అమెరికా గుర్తించింది. అలాంటి వారిని భారత్ కు పంపించే ప్రక్రియను వేగంగా కొనసాగిస్తోంది. మొదటి విడతలో 104 మందిని, రెండవ విడతలో 116 మందిని, మూడవ విడతలో 119 మందిని అమెరికా సైనిక విమానంలో భారత్ కు పంపించింది. ఇప్పటి వరకు అమెరికా యుద్ధ విమానంలో భారత్ కు పంపించిన వారిలో పంజాబ్, గుజరాత్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారున్నారు. అక్రమ వలసదారులతో కూడిన అమెరికా యుద్ధ విమానం అమృత్ సర్ లో దిగడం పంజాబ్ రాజకీయాల్లో దుమారం రేపింది. పంజాబ్ రాష్ట్రాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కేంద్రం అమృత్‌సర్ లో విమానం ల్యాండింగ్ కు అనుమతిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపిస్తున్నారు. కాళ్లు, చేతులు బంధించి ఇలా సైనిక విమానంలో పంపించడం అమెరికా అహంకారానికి, ఆధిపత్యానికి నిదర్శనం.
ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మౌనాన్ని పాటించడం సరికాదు. బలవంతుడితో కయ్యం పెట్టుకోలేక, నెయ్యానికే ప్రాధాన్యతనిస్తూ భారతదేశం అగ్రరాజ్యాధీశుడితో వాణిజ్య, రక్షణ సంబంధాలను కొనసాగిస్తున్నది. బ్రిక్స్ దేశాల్లో భాగమైన భారత్ తో స్నేహం కొనసాగిస్తునే భారతీయ ఉత్పత్తులపై టారిఫ్ పెంచుతానని ట్రంప్ నిర్ధ్వంద్వంగా ప్రకటించారు. డాలర్ కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తెస్తే, ఆయా దేశాలపై అమెరికా నూరు శాతం సుంకాలు విధిస్తుందని చెప్పడం ప్రపంచాన్ని అమెరికా డాలర్ మాత్రమే శాసించాలనే ట్రంప్ నియంతృత్వాన్ని ప్రస్ఫుటం చేస్తున్నది. గతంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ రూపొందించుకోవాలని పుతిన్ పిలుపిచ్చారు. అయితే ఇప్పుడా ప్రతిపాదన ఆవిరైపోయినట్లుగానే భావించాలి. మోదీ అమెరికా పర్యటన కేవలం కొన్ని ఒప్పందాల వరకు మాత్రమే పరిమితమయ్యాయి. మోదీ అమెరికా పర్యటనలో భారత్ కు అత్యంత అధునాతన యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి అంగీకారం కుదిరింది, గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి, ఇతర దేశాల రక్షణ వ్యవస్థల కన్నుగప్పి శత్రు స్థావరాలను, శత్రు దేశాల యుద్ధ విమానాలను సునాయాసంగా ఢీకొట్ట గల సామర్థ్యం గల ఫైటర్ జెట్ లను భారత్ కు విక్రయించడానికి అమెరికా అంగీకారం తెలిపింది. రన్ వే తో సంబంధం లేకుండా భూమిపై దిగగల సామర్థ్యం ఎఫ్-35 యుద్ధ విమానాలకుంది. మోదీ పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు. ఎలాన్ మస్క్ తో భేటీ సందర్భంగా కృత్రిమ మేథస్సు కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ కు అందించడానికి సంబంధించి అంగీకారం కుదిరినట్టు తెలుస్తున్నది.
మోదీ పర్యటనతో వలసదారులకు లభించని ఊరట
మోదీ పర్యటనలో సైబర్ భద్రత, కృత్రిమ మేధ, రక్షణ సంబంధిత అంశాలకు మాత్రమే ప్రాధాన్యత లభించింది. ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా పదవీ స్వీకారప్రమాణం చేసిన కొద్ది రోజులకే మోదీ అమెరికాలో పర్యటించడాన్ని అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు ఎంతో ఆనందించారు. మోదీ పర్యటన వలన వీసాలు, వలసదారుల విషయంలోను ట్రంప్ వైఖరి మారుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. మోదీ అమెరికా పర్యటన పట్ల భారత దేశంలోని పాలక, ప్రతిపక్షాలు విభిన్నమైన స్పందన వ్యక్తం చేశాయి. అమెరికా- భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన ఒక మైలురాయిగా బిజెపి ప్రశంసించగా, అక్రమ వలసదారుల పేరుతో భారతీయులను బంధించి, యుద్ధ ఖైదీల మాదిరిగా సంకెళ్లు వేసి, సైనిక విమానంలో పంపడాన్ని కాంగ్రెస్ విమర్శించింది. భారత దేశం అమెరికాకు చేస్తున్న ఎగుమతులపై అధిక సుంకం విధిస్తానని ట్రంప్ ఖరాఖండిగా చెప్పడమే కాకుండా , అమెరికా దిగుమతులపై టారిఫ్ తగ్గించాలని కోరడం మన కంటిని మన వేలితో పొడిచిన చందంగా ఉంది. భారత్ తమ దేశం ఉత్పత్తులపై అధిక శాతం పన్నులు విధించాడాన్ని తాను గతంలోను విభేదించానని, భారత్ కు తగినట్టుగానే తాను కూడా సమానమైన టారిఫ్ విధిస్తానని ట్రంప్ చెప్పడం వాణిజ్య సంబంధమైన ప్రతీకార చర్య అవుతుంది. బ్రిక్స్ దేశాలపై 100 శాతం టారిఫ్ విధిస్తాననే ట్రంప్ హెచ్చరికను బ్రిక్స్ కూటమి ఎలా పరిగణిస్తుందో చూడాలి. ఇండో అమెరికన్ ” ట్రేడ్ డీల్” లో చోటుచేసుకుంటున్న పరిణామాల వలన భవిష్యత్తులో ఎవరికి లాభం ఎవరికి ఎక్కువ నష్టం? అనే విషయం పై విశ్లేషకులు తలలు బాదుకునే అవసరం లేదు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో అమెరికాకు అనుకూలంగా పన్నులు తగ్గించినా ట్రంప్ కు రుచించలేదు.
“మేక్ అమెరికా గ్రేట్ అండ్ గ్లోరియస్ అగైన్” అంటూ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసిన ట్రంప్ అదే విధానాన్ని ప్రస్తుతం అమలు చేస్తున్నారు. బైడెన్ హయాంలో అమెరికాతో భారత్ కు కుదిరిన సాంకేతిక, రక్షణ విషయాల్లో మార్పులేమీ లేవు. భారత్ అమెరికాకు క్రియాశీలక వాణిజ్య భాగస్వామి. మోదీ వ్యూహాత్మకంగా బడ్జెట్ లో కొంతమేరకు అమెరికాకు అనుకూలంగా పన్నులు తగ్గించినా ట్రంప్ ధోరణిలో పెద్దగా మార్పేమీ లేదు. పైగా ఇతర దేశాల కంటే తమ దేశం నుంచే అధికంగా ఆయుధాలను, ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేయాలని భారత్ ను కట్టడి చేయడం వల్ల ఇప్పటికే తక్కువ ధరకు ఇంధనం సరఫరా చేస్తున్న భారత్ కు అత్యంత విశ్వసనీయ దేశమైన రష్యా పరిస్థితి ఏమిటి? లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సరఫరాలో ఖతర్ భారత్ కు పెద్ద వాణిజ్య భాగస్వామి. క్రూడ్ ఆయిల్ లో రష్యా భారత్ కు పెద్ద భాగస్వామి. భారత్ కు అమెరికా పంపుతున్న వస్తువుల్లో దిగుమతి సుంకాలు విధించే వస్తువులు కేవలం స్వల్ఫశాతం మాత్రమే ఉన్నాయని, కాబట్టి అమెరికా బెదిరింపులకు భయపడవలసిన అవసరం లేదనే వాదనలున్నాయి. భారత్ కు దిగుమతి అవుతున్న వస్తువుల మీద ఇప్పటికే జి.ఎస్టీ అమల్లో ఉంది. అమెరికా రెసిప్రోకల్ టారిఫ్ పై మున్ముందు భారత్ కు ఎలాంటి సమస్యలు వొస్తాయో వేచి చూడాలి.
ఇక ట్రంప్ చర్యలు ప్రపంచాన్ని పెనం మీద నుంచి పొయ్యిలో పడేసే విధంగా ఉంటున్నాయి. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే వైదలగడం జరిగింది.వాతావరణ మార్పులు, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా పారిస్ ఒప్పందాన్ని బైడైన్ ఆమోదించినా, తిరిగి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ పాత పల్లవినే అందుకుని పారిస్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలం శిలాజ ఇంధనాల వాడకం. సౌరశక్తి వాడకంపై దృష్టి సారించకుండా శిలాజ ఇంధనాల వినియోగం అధికం చేయాలనే ట్రంప్ వితండవాదం పర్యావరణానికి పెద్ద దెబ్బ. ఇప్పుడిప్పుడే క్లీన్ ఎనర్జీ పై దృష్టి సారిస్తున్న ప్రపంచానికి ట్రంప్ నిర్ణయం ఆందోళన కలిగిస్తున్నది. ట్రంప్ బాధ్యతారాహిత్యానికి ప్రపంచం మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రపంచంలోని పలు దేశాలు తమ అవసరాల దృష్ట్యా అగ్ర దేశమైన అమెరికా అడుగులకు మడుగులొత్తక తప్పదు. అమెరికా అనుసరించే విధానాలకు భజన చేయక తప్పదు. తమ దేశమే గొప్పదనే నిరంకుశ వాదంతో హిట్లర్ ను తలదన్నే జాత్యహంకారంతో చెలరేగిపోతున్న ట్రంప్ “ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్” గా పేరొందిన అమెరికా నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పేరుతో విదేశీయులకు బేడీలు వేసి, అత్యంత అవమానకరంగా ఆయా దేశాలకు పంపడం అమానుషం.
భారత్ తో ఒకవైపు ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటూనే మరో వైపు అక్రమ వలసదారులంటూ అమెరికాలో ఉంటున్న భారతీయులను బలవంతంగా,అభ్యంతరకరంగా భారత్ కు పంపించడం అత్యంత క్రూరమైన చర్య.ప్రపంచంలోని అన్ని దేశాలు తమ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. కొన్ని దేశాలు సంపన్న దేశాలుగా,మరికొన్ని నిరుపేద దేశాలుగా మనుగడ సాగిస్తున్నాయి. కొన్ని దేశాలు సహజ సంపదలతో, అనుకూలమైన భౌగోళిక స్వరూపం తో, ఉపాధి అవకాశాలతో, వాణిజ్య సంబంధమైన ఎగుమతులతో సంపన్న దేశాలుగా చెలామణీ అవుతుంటే, కొన్ని దేశాలు తమ మేథాశక్తితో,సాంకేతికంగాను, ఆయుధ పరంగాను ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. అమెరికా,చైనా లాంటి దేశాలు ఆయుధ సామర్ధ్యంతో, సాంకేతిక పరిజ్ఞానంతో,వాణిజ్యంతో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. కొన్ని దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా స్వయం స్వావలంభన సాధిస్తున్నాయి. సహజ వనరులు లేని దేశాలు, అభివృద్ధికి అనువుగా లేని దేశాలు నిరక్షరాస్యతతో, మౌలిక సదుపాయాల లేమితో ఆకలి,దరిద్రం వంటి సమస్యలతో బాధపడుతున్నాయి. అభివృద్ధి చెందాలని భావించే దేశాలు పరాయి దేశాల ఈర్ష్యాద్వేషాలతో తమ రక్షణ కోసం, ఆయుధాల కోసం ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నాయి. ఈ పరిస్థితులు మారాలి. తమ దేశం లోని సహజ వనరులను,యువ శక్తిని వినియోగించుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుని, అన్ని రంగాల్లోను స్వయం స్వావలంభన సాధించాలి. అగ్ర రాజ్యాల అధికారం క్రింద నలిగి పోకుండా,వారి ఆంక్షలకు బలికాకుండా తమను తామే అన్ని విధాలా తీర్చుదిద్దుకోవాలి.
-సుంకవల్లి సత్తిరాజు.
(సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్)
మొబైల్ నెం : 9704903463.