అంబేడ్కర్‌ దేశానికి అందించిన సేవలు అసాధారణం

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ : మాజీ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  స్మరించుకున్నారు. దేశ స్వాతంత్య్ర అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడం లో బాబాసాహెబ్‌ కనబరిచిన దార్శనికత మహోన్నతమైన దని కేసీఆర్‌ కొనియాడారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అంబేడ్కర్‌ పొందుపరిచిన ఆర్టికల్‌ 3, ఈ దిశగా వారి దార్శనికత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిందని గుర్తు చేశారు. వారి విశేష కృషిని, వారు అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో వారి స్ఫురద్రూపాన్ని తెలంగాణలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలుపుకున్నామన్నారు.

దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన బీఆర్‌ అంబేడ్కర్‌ ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ పాలనా భవనానికి ‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ స్టేట్‌ సెక్రటేరియట్‌’ అని పేరు పెట్టుకున్నామని తెలిపారు. వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన అంబేడ్కర్‌ అజరామర కీర్తిని ప్రపంచానికి చాటేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. అనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు. అంటరాని వర్గాలుగా తర తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వారి సామాజిక గౌరవం ఇనుమడిరపజేసే దిశగా, అంబేడ్కర్‌ స్ఫూర్తితోనే నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేసిందన్నారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపే దిశగా దళిత బంధు సత్ఫలితాలు సాధించిందని తెలిపారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో వివక్ష లేని సమ సమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేయడం ద్వారానే, అంబేడ్కర్‌ మహనీయునికి మనం ఘన నివాళి అర్పించగలమని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page