అగ్నిపద్యం అలిశెట్టి కవిత

దోపిడి వటవృక్షాలను దహించే అగ్నిపద్యంలా అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని సృష్టించిన అక్షరయోధుడు అలిశెట్టి ప్రభాకర్. తుపాకీ తూటాలా తన భావాలను సూటిగా గుండెలను తాకించగల శక్తి అలిశెట్టి అక్షరానిది.  కరెన్సీ స్పర్శ కంటే కవిత్వంలోనే సేదతీరిన రచనా పిపాసి. రాతకు చేతకు లేశమాత్రం తేడా లేని నిండైన నిఖార్సయిన ఆచరణశీలి. నాలుగు పదులు కూడా దాటని అలిశెట్టి జీవన గమనంలో కుళ్ళిన సమాజం ఒళ్ళు విరిచేలా పూరించిన కవితా శంఖారావం మనచెవుల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది. ఆదర్శాలు వల్లిస్తూ భద్రజీవనంలో బందీ అయిన కుహనా మేధావుల కుతంత్రాలకు తలొగ్గక అనారోగ్య పీడితుడై  కూడా అశేష పీడితజనం పక్షాన అక్షరసేద్యానికి నడుంకట్టిన కవితా హాలికుడు అలిశెట్టి ప్రభాకర్. మరణం నా చివరి చరణం కాదు అంటూ  కాలం అంచున చిగురించిన నెత్తుటి ఊహలా, పాఠకుల కనులకొలనుల్లో రక్తాశ్రువులను నింపాడు. అగ్నిపద్యమై దగ్దగీతమై అక్షర క్షిపణులను సంధించాడు.

పరాధీనమవుతున్న బతుకులకు పోరాట పరిమళమద్ది మంటల జెండాలతో మందుపాతరలు సృష్టించాడు. సంపద సామాన్యుల మధ్య పంపిణి కావాలంటే దోపిడి వటవృక్షాలను కూకటివేళ్లతో పెకలించాల్సిందేనన్నాడు. సకల రుగ్మతలతో కునారిల్లుతున్న దేశమనే దేహానికి నిలువెల్లా శస్త్రచికిత్స చేయాలన్నాడు. ఏండ్లు గడిచినా అలిశెట్టి ప్రస్తావించిన సమస్యల తీవ్రత పెరుగుతుందే గాని తగ్గకపోవడమనేది ఆయన కవిత్వానికున్న ప్రాసంగికతను తెలియజేస్తుంది. ఎర్రపావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, సంక్షోభగీతం, సిటీ లైఫ్‌, మరణం నా చివరి చరణం కాదు, కవితా సంపుటాలల్లో అసమ సమాజంలో అల్లుకున్న జీవన వైరుధ్యాలను, పాలకుల దమననీతిని, ప్రజాస్వామ్య వైఫల్యాలను ఎత్తి చూపాడు. ఎర్రపావురాలు కవితా సంపుటిలో వేశ్యల వ్యధాభరిత జీవితాలను-
“తను శవమై
ఒకరికి వశమై
తనువు పుండై
ఒకడికి పండై
ఎప్పుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై” 
అని‌ చెప్పిన‌ మాటలు  సూటిగా మన గుండెలను తాకి మెలిపెడుతాయి.
న్యాయస్థానం కవితలో‌ ఇలా అంటాడు- 
”ఈ‌ తరాని
ఈత రాని
నిరుపేదలకు
ఈ చట్టం 
ఎత్తయిన  నీటి మట్టం” 
కేవలం ఐదు పదాలతో  ఈ దేశపు న్యాయస్థానాలు  సామాన్యుల పక్షం కాకుండా సంపన్నుల కొమ్ము కాస్తున్న దుస్థితికి అద్దం పట్టినట్లు ఆవిష్కరించారు. మంటల జెండాలు కవితాసంపుటిలో నీతి బాహ్యమైన రాజకీయ వ్యవస్థ ను నిలువెల్లా కడిగేశాడు. రాజకీయం కవితలో-
”ఒక నక్క
ప్రమాణ స్వీకారం చేసిందట
ఇంకెవర్నీ మోసగించినని
ఒక పులి
పశ్చాత్తాపం ప్రకటించిందట
తోటి జంతువుల్ని సంహరించినందుకు
ఈ కట్టు కథ విని
గొర్రెలింకా
పుర్రెలూపుతూనే ఉన్నాయ్”
అని వేసిన చురకలు నేటి నాయకత్వానికి కూడా సరిపోతాయనడంలో  సందేహంలేదు. ఈ కవితా పంక్తులు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకుల కప్పదాటు వైఖరిని, మోసపూరిత వాగ్దానాలను, ఎత్తి చూపడానికి ‌సందర్భోచితంగా వాడుతున్నారు. పెత్తందార్ల పొట్టనిండా దౌర్జన్యపు కూడు నిండుకుందని , జగిత్యాల ‌జైత్రయాత్ర అక్రమార్కుల భరతం పట్టే ఆయుధమైందన్నాడు. మెజారిటీ ప్రజల ‌కష్టాలు కన్నీళ్ళను‌ దోసిట బట్టే కవితలతో సమాజానికి ఎరుక కల్గించే చురకలను పెట్టారు. భౌతికవాద దృక్పథంతో అద్భుతమైన భావనా శక్తిని రంగరించి వాడి, వేడి పదాలతో మన‌మస్తిష్కాలను మధింపజేస్తాడు అలిశెట్టి.

‘న్యాయాన్ని ఏ కీలుకాకీలు విరగొట్టగలవాడే వకీలు’ అంటాడు. అలాగే ‘నువ్వంచిన నడుమ్మీదే ఆధారం పెట్టుబడి దారీ‌ వ్యవస్థ ఆదాయం’ అంటూ శ్రమజీవుల రక్తంతో ఎదుగుతున్న పెట్టుబడిదారి వికృత రూపాన్ని సమర్థంగా అభివ్యక్తీకరించాడు. అన్నం మెతుకును ఆగర్భ శ్రీమంతున్ని వేరుచేస్తే‌ శ్రమ విలువేమిటో తెలుస్తుందనే చారిత్రిక సత్యాన్ని చాటిచెప్పారు. ఆకలిబాధలు,  దొరల దౌర్జన్యం, ధరల పెరుగుదల, దళారి సంస్కృతి,  అందాల పోటీలు,  నిరుద్యోగ సమస్య, పాలక వర్గాల అవకాశవాద రాజకీయాలు, ప్రజాస్వామ్యపు దీనస్థితిని రక్తరేఖ కవితా సంపుటిలో విశ్లేషించారు.

మర్రివిత్తనమంత అక్షరంలో మహావృక్షమంత సందేశాన్ని ఇమిడ్చే శక్తి గలవి అలిశెట్టి ప్రభాకర్ ‘‌సిటీ లైఫ్’ కవితలు. ధ్వంసమవుతున్న మానవ విలువల్నీ హింసా రాజకీయాలను నిరసిస్తూ నిప్పుకణికల్లాంటి అక్షరాలతో పాఠకుల మెదళ్ళకు పదును పెట్టాడు.  ఊసరవెల్లిలా రంగులు మార్చే రాజకీయాలను, అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకుల్లో దాచుకునే దగాకోరులు, సంపన్న దేశాల సామ్రాజ్యవాదం, ఎన్నికల్లో జరిగే‌ మారణకాండ, మొదలగు అనేకాంశాలు అలిశెట్టి సిటీ లైఫ్ కవితలకు వస్తువైనాయి.
‘పేదోడి మెడకెప్పుడు / ధనికుడే ఉరితాడు’ అని తనకున్న వర్గ దృక్పథాన్ని సూటిగా వ్యక్తీకరించాడు. సామాన్యుని పక్షాన నిలబడని ప్రభుత్వాలపై వ్యంగ్యాస్త్రాలను‌ విసురుతూ ‘గరీబోడి గుండు మీద/ మండే ఎండ లాంటిది / గవర్నమెంట్’ అని అంటారు. ఆకలి తీవ్రతను తెలుపుతూ ‘కడుపు మీద / తడిసిన అగ్గిపుల్లతో గీసినా / భగ్గున మండితే అదేరా ఆకలి’ అంటాడు.

ఇట్లా మర ఫిరంగుల్లాంటి అక్షరాలతో మానవత్వం కృశిస్తున్న సమాజంపై యుద్ధభేరి మ్రోగించిన సాహసికుడు అలిశెట్టి ప్రభాకర్. కాసుల కొరకు‌ కక్కుర్తి పడుతూ అడ్డదారులు త్రొక్కుతూ నానా‌గడ్డి కరుస్తున్న మనుషులు మధ్య  అనారోగ్య పీడుతుడై మరణం చేరువవుతున్నా ఆత్మాభిమానం వీడని అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్. కేవలం 39 సంవత్సరాలు మాత్రమే బతికిన అలిశెట్టి ఆయన అందించిన అక్షరాల్లో ‌పునరుజ్జీవనం పొందుతూనే ఉన్నాడు. ఆయన ఇంకా బతికుంటే తెలుగు సాహిత్యం గతిని మార్చే అద్భుతమైన కవిత్వం ఆవిష్కరించబడేది. జనన మరణాలను సమంగా స్వీకరించిన అలిశెట్టి ప్రభాకర్ జన్మదినం నాడే మరణించడం ఒక యాదృచ్ఛిక విషాదం. ఆయన ఆకాంక్షించిన, విలువలు, సమసమాజం దిశగా అడుగులు వేయడమే ఆయనకు మనమందించే నివాళి.

గన్ రెడ్డి ఆది రెడ్డి
(జనవరి 12 అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా..)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *