కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ ది చావు భాష
కేసీఆర్ రాష్ట్రాన్ని నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు.
దిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది
హెచ్ సీయూ విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : రాష్ట్రమంతా కూడా కేసీఆర్ వైపు చూస్తోందని, ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో, నీళ్లేవో అర్థం అయిపోయిందని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవు అన్నది ప్రజలకు అర్థమయిపోయిందని విమర్శించారు. పటాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి బుధవారం బీరంగూడ చౌరస్తా నుంచి రుద్రారం గణేష్ గడ్డ దేవాలయానికి పాదయాత్ర చేశారు. అనంతరం పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం సిద్ధి వినాయక గుడిలో హరీష్ రావు పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. నో ఎల్ఆర్ఎస్ అని అన్నారు కానీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మేము వొస్తే ఫార్మాసిటీ భూములన్ని రైతులకు వాపస్ ఇస్తామన్నారు. ఇప్పుడేమో 16 వేల ఎకరాలు ఫార్మా సిటీ కోసం స్వీకరిస్తామని ప్రకటించారు. జీవో 58, 59 కింద ఇదే పటాన్ చెరు నియోజకవర్గంలో వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశాం. నేడు రేవంత్ రెడ్డి వొచ్చాక58, 59 జీవో బంద్ చేశాడు. పైసలు కట్టినోళ్లకు కూడా పట్టాలు ఇవ్వడం లేదని అరోపించారు.
50 శాతం కూడా రైతుబంధు అందలేదు..
రైతుబంధు కేసీఆర్ రూ.10,000 ఇచ్చారని రేవంత్ రెడ్డి తానొస్తే రూ.15,000 ఇస్తానన్నాడని కానీ 15వేలు కాదు కదా కేసీఆర్ ఇచ్చిన 10,000కి కూడా ఇప్పుడు దిక్కులేదని హరీష్ రావు విమర్శించారు. వానా కాలం, యాసంగి రైతుబంధు 40 పైసలు మందమేసి 60 పైసలు ఎగ్గొట్టాడు అని హరీష్ రావు విమర్శించారు. వానా కాలం రైతుబంధు 9,000 కోట్లు యాసంగి రైతుబంధు 5,000 కోట్లు. రెండు కలిపితే 14వేల కోట్లను రైతుబంధు కింద రేవంత్ రెడ్డి ఎగ్గొట్టాడు అని అన్నారు. రుణమాఫీ అసలు ఇయ్యాల్సింది 49 వేల కోట్లు, అసెంబ్లీలో చెప్పింది 31వేల కోట్లు, ఇచ్చింది 15, 16 వేల కోట్లు కూడా లేదు. వానా కాలం యాసంగికి ఎగ్గొట్టిన రైతుబంధు డబ్బులు 14,000 కోట్లు రుణమాఫీకి పెట్టిండు. 50% రుణమాఫీ కూడా కాలేదు. రైతుబంధు రాలేదు. 4000 పెన్షన్, అక్కాచెల్లెళ్లకు మహాలక్ష్మి పెన్షన్ రాలేదు. కెసిఆర్ 13 లక్షల పేదింటి ఆడపిల్లల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. ఇప్పుడు పెళ్లయి పిల్లలు పుట్టినా కల్యాణ లక్ష్మి చెక్కు లేదు.. తులం బంగారం ఊసే లేదు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు.
రాష్ట్ర జీఎస్టీ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. కేసీఆర్ హయాంలో ఏటా 12 శాతం జీఎస్టీ వృద్ధి రేటు ఉండేది. దేశ జీఎస్టీ కంటే సగానికి తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు పడిపోయింది. దేశం 10 శాతం జీఎస్టీ వృద్ధిరేటు సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే వృద్ధి రేటు సాధించింది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి వాటిని నరుకుతున్నాడు. మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకుని అక్కడ చెట్లు నరికేశారు. నిన్న హెచ్ సీయూ భూముల్లో 400 ఎకరాల్లో చెట్లను నరికి మూగజీవుల పాపం కట్టుకున్నాడు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టాడు. కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా చంపుతా తొడలదరగొడతా ఇలాంటి భాష రేవంత్ రెడ్డిది. దిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది. దిల్లీలో బిసి సభకు రాహుల్ గాంధీని తీసుకొస్తానని పార్లమెంట్లో బిల్లు ఆమోదింపచేస్తా అని అన్నాడు. వీళ్ల పార్టీ నేత రాహుల్ గాంధీ దిల్లీలో ఉండి కూడా ధర్నాకు రాలేదు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మరుసటి రోజు రేవంత్ రెడ్డి లేకుండా పిసిసి అధ్యక్షులతో ఉపముఖ్యమంత్రితో ఫోటోలు దిగారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్ సీయూ విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తున్నామని ప్రకటించారు.
ఈ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి ఆదేశించిందట ఉపముఖ్యమంత్రి కేసులుఉపసంహరించుకుంటారట. రేవంత్ రెడ్డి పెట్టింది తప్పుడు కేసులని ఉపముఖ్యమంత్రి బట్టి భట్టి విక్రమార్క చెప్పినట్టే కదా అని హరీష్ రావు అన్నారు. అక్రమ కేసులు పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హెచ్ సీయు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. హైడ్రా హైడ్రా అని ఆర్నెల్లు ఉరికి వెల్లకిలాపడ్డాడు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఈగలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఆదాయం లేదు. మెట్రో రైల్ వద్దన్నాడు, ఫార్మాసిటీ వద్దన్నాడు. పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే వచ్చేది. కేసీఆర్ వొచ్చాక పవర్ హాలిడేలు ఎత్తేసి 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చాడు.
దేశానికి నెంబర్ వన్ గా తెలంగాణ తీర్చిదిద్దింది కేసీఆర్. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తెలంగాణ నుంచి బియ్యాన్ని మాకు అమ్మండి అని అడిగేవారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను కెసిఆర్ తీర్చిదిద్దారని అన్నారు. బీఆర్ఎస్ రావాలి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు తెలిపారు. ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ ను విజయవంతం చేయాలని, పటాన్ చెరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కదిలి రావాలని కోరారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనా చారి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రుద్రారం గణేష్ గడ్డ దేవస్థానం ఈవో లావణ్య, ఎండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, నాయకులు శ్రీధర్ చారి, పటాన్ చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.