ఫార్ములా ఈ కార్ రేసు కేసులో…
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: ఫార్ములా ఈIకార్ రేస్ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. అయితే మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా అదేనెల 26వ తేదీన కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు పంపింది. ఆ సమయంలో ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరవుతానని ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఈ కేసుకు సంబంధించి గతంలో ఒకసారి కేటీఆర్ ఏసీబీ, ఈడీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. జనవరి 6న లాయర్లతో కలిసి ఏసీబీ విచారణకు వెళ్లిన ఆయనను అధికారులు అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. తిరిగి మరోసారి జనవరి 8న ఏసీబీ విచారణకు హాజరు కాగా దాదాపు 7 గంటలపాటు విచారించింది. జనవరి 9న మరోసారి విచారణకు పిలవగా కేటీఆర్ సమయం కోరారు. ఇక మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది.