క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం..
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28 : క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, క్రీడలను ప్రోత్సహించడం అంటే భవిష్యత్ తరాలను నిర్మించడమేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 4వ కియో జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, అన్ని వయసుల వారికి వర్గాల వారికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమివ్వడం సంతోషకరమని అన్నారు.
తెలంగాణలో ఉన్న క్రీడా మైదానాలను క్రీడాకారులు విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బీసీ సంక్షేమ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రీడలపై ఆసక్తి ఉంది కాబట్టే క్రీడలకు అధిక బడ్జెట్ కేటాయింపులు జరిగాయని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రీడా మైదానాల వైపు మళ్లే దిశగా ప్రభుత్వం వివిధ క్రీడా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు.
శాసనమండలి సభ్యులు తెలంగాణ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కరాటే క్రీడకు తెలంగాణలో పల్లె పల్లెలో ఎంతో ఆదరణ ఉందని, అనేక మండల కేంద్రాల్లో కరాటే శిక్షణ కేంద్రాలు విరివిగా ఉన్నాయని ఆయన అన్నారు. జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ దిగ్విజయంగా నిర్వహిస్తున్న తెలంగాణ లో భవిష్యత్తులో ఆసియన్ కరాటే ఛాంపియన్ షిప్ కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిలాష అని , త్వరలోనే ఆసియన్ కరాటే ఛాంపియన్ షిప్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మరిన్ని జాతి అంతర్జాతీయ పోటీలు హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్ని క్రీడా ఫెడరేషన్లు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని అన్నారు.
గ్రామస్థాయి నుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న యత్నాల్లో భాగమే ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి, భారతక్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, ఒలింపియన్ బాక్సర్ నికత్ జరిన్, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ అధ్యక్షులు భరత్ శర్మ కార్యదర్శి సంజీవ్ జాంగ్ర, కోశాధికారి బంకిన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీర్తన్ వివిధ రాష్ట్రాల కరాటే అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు.