– సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో ప్రారంభం
– పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ రేషన్ కార్డులను స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు. రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందని తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ప్రారంభోత్సవం నిర్వహించనుండగా అదే సమయంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆర్డీఓ సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 15న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. లబ్దిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పాలనలో ఇది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





