– జీవితాలను మార్చే సామాజిక న్యాయ సంకల్ప సభ
– అగ్రకులాల్లోని ప్రజాస్వామ్య వాదులే మార్పులకు కారణం
– బీసీలకు 50శాతం రిజర్వేషన్ వచ్చేవరకు పోరాడుతా
– టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: ఒకనాటి అమానవీయ పరిస్థితులను మార్చుకునేందుకే మనం రాజ్యాంగం రాసుకున్నాం. కానీ రాజ్యాంగం పూర్తి స్థాయిలో మనం అమలు చేసుకోలేకపోయాం. అందుకే మనం ఈ సభ ద్వారా సామాజిక న్యాయ పోరాటం చేయబోతున్నాం. సామాజిక న్యాయ సంకల్పం తీసుకోబోతున్నామని టీఆర్ ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో మాట్లాడుతూ సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలు మా సీట్లు ఎక్కడ పోతాయోనని భయపడుతారు. ఇవ్వాళ మనం టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకున్నాం. మనకు సామాజిక న్యాయంపై పోరాటం చేసే ఒక గొప్ప అవకాశం దొరికింది. సమాజంలోని అగ్రవర్ణాల్లో ఉన్న గొప్ప నాయకులే ఒక్కొక్కరుగా వెలుగుతూ మనం ప్రజాస్వామ్యాన్ని సాధించుకునే పరిస్థితి తెచ్చారు. నేను బీసీల గురించి మాట్లాడితే చాలా మంది అగ్రవర్ణాల్లో పుట్టిన నీకెందుకు అంటూ పళ్లు ఇకిలిస్తారు. కానీ నా పుట్టుక నా చేతిలో లేదు. కానీ నేను ఎవరి కోసం పనిచేయాలో అది నా చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు గ్రామపంచాయితీ మొఖం కూడా తెలియని కులాలతో పనిచేసి వారిలో సాధికారిత తెచ్చే వరకు కూడా నా జీవితాన్ని అంకితం చేస్తున్నా. ఈ దేశంలో ఇప్పటి వరకు వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో చాలా వరకు కూడా అగ్రకులాల్లో ఉన్నప్రజాస్వామ్య వాదుల ప్రయత్నం ద్వారానే జరిగాయి. మండలి కమిషన్ రిపోర్ట్ ను కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్లు బీరువాలో పెడితే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే క్షత్రియ పుత్రుడే దాన్ని అమలు చేశారు. తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ల కోసం వాటిని 9వ షెడ్యూల్ లో పెట్టించినది అగ్రకులానికి చెందిన జయలలితే. అలాంటి వారందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాలి. మనవాళ్లపై మనమే వివక్ష చూపటం అన్యాయం. ఇప్పటికైనా సామాజిక న్యాయం కోసం అందరం పోరాటం చేద్దాం. కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా 97 శాతం దళితులు అత్యంత వెనుకబాటులో ఉన్నారు. ఈ దేశంలో లక్షలాదిగా ఎస్సీ, ఎస్టీల బ్యాక్ లాగ్ పోస్టులు ఉన్నాయి. వాటి గురించి మనం పిడికిలి ఎత్తి పోరాటం చేయాలి. ఎస్టీల్లో కూడా 97 శాతం ప్రజలు అత్యంత వెనుకబడే ఉన్నారు. ఇక ముస్లింలలో కూడా కనీసం సర్పంచ్ పదవి చేపట్టని పరిస్థితి ఉంది. అన్ని ప్రభుత్వాలు వాళ్ల జీవితాల్లో మార్పులు తెస్తామంటూ మాటలు మాత్రమే చెబుతున్నాయి. కచ్చితంగా ముస్లింలకు కూడా వాళ్ల హక్కులతో కూడిన రిజర్వేషన్లు రావాలి. అన్ని వర్గాలకు సమన్యాయం కావాలని పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కచ్చితంగా నేను పోరాటం చేస్తాను. సగానికి పైగా మన దేశంలో బీసీ జనాభా ఉంది. కానీ 71 శాతం మంది బీసీలు ఎస్సీల కన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ లు 46 శాతం ఉంటే 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది. బీసీ ముస్లింల సంగతి పట్టించుకోవటం లేదు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే. అందుకోసం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి పనిచేసి బీసీలకు న్యాయం చేయాలి. ప్రతి గ్రామంలో మనం సామాజిక న్యాయం కోసం సభలు నిర్వహించుకుందాం. ఆ తర్వాత అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుందాం. సామాజిక న్యాయం కోసం మనం చేసే పోరాటాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 6 నాటికి సమీక్ష చేసుకుందాం. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక మాట చెప్పారు. తెలంగాణ ఉద్యమంతోపాటు సామాజిక తెలంగాణ ఉద్యమాన్ని ఒకేసారి చేయలేమన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత సామాజిక న్యాయం కోసం అంతే పవిత్రంగా మనం ఉద్యమాన్ని చేయాలని చెప్పారు. ఆయన కన్న కలలను నిజం చేసే విధంగా మనం పోరాటం చేద్దాం. జయశంకర్ సార్ విగ్రహాన్ని మనం కచ్చితంగా ట్యాంక్ బండ్ వద్ద పెట్టుకోవాలి. ఈ సభ ద్వారా మనం కొన్ని తీర్మానాలు చేస్తున్నాం. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు కలిసి వచ్చే వారితో దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. మహత్మా జ్యోతిరావ్ పూలే దంపతులకు భారత రత్న అవార్డు ఇవ్వాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని పెట్టాలి. ఎస్సీ, ఎస్టీల నిధులను వాళ్ల అభ్యున్నతి కోసమే వాడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను నింపేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు రావాలి. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ముస్లింలకు ఆర్థిక స్వావలంబనతోపాటు వక్ఫ్ బోర్డు చట్టం తేవాలి. సిక్కులు, క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంబన ఉండేలా చర్యలు తీసుకోవాలి. ట్రాన్స్ జండర్లకు సంపూర్ణ హక్కులు రావాలి. వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్లు పెంచాలి. వారికి కో ఆప్షన్ సభ్యుల్లో రిజర్వేషన్ కల్పించాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





