– 32 నెలల్లో 75 సార్లు దిల్లీకి
– దిల్లీకి సామంతులుగా కాదు స్వతంత్రులుగా వుండాలి
– కేసీఆర్ చేతిలో తెలంగాణను పెట్టడమే జయశంకర్ సార్‌కు అసలైన నివాళి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6: తెలంగాణ ఆత్మగౌరవాన్నిదిల్లీ ముందు తాకట్టు పెట్టే రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ దిల్లీ పర్యటనలు చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. 32 నెలల్లో 75 సార్లు దిల్లీ వెళ్లారని, దాదాపు ప్రతి 13 రోజులకు ఒకసారి తిరుగుతున్నారని అన్నారు. దిల్లీకి సామంతులు కాకుండా స్వతంత్రులు కావాలి అని జయశంకర్ సార్ చెప్పేవారని గుర్తు చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పేవారని పేర్కొన్నారు. నీటి హక్కుల విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, జీఆర్ఎంబీ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఆధారాలతో వివరించారని చెప్పారు. దిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని, తెలంగాణ కోసం పుట్టిన నిఖార్సయిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చినా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, అప్పులు, అభివృద్ధి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం వాటిని వినియోగించలేకపోతోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణకు శాశ్వత శత్రువని జయశంకర్ సార్ చెప్పేవారని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
జయశంకర్ సార్ ఆశయ సాధనే అసలైన నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె.జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు అందించే నిజమైన నివాళి అని కేటీఆర్ అన్నారు. జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు. జయశంకర్ సార్‌తో పదేళ్ల పాటు కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని కేటీఆర్ తెలిపారు. ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియా, గొప్ప ఉపాధ్యాయుడని కొనియాడారు. కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా భావించిన జయశంకర్ సార్, ఆయనకు గాడ్ ఫాదర్‌లా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. స్వయం సమృద్ధి, ఆత్మగౌరవం, స్వయం పాలన అనే మూడు దశల ద్వారా తెలంగాణ సమాజాన్ని జయశంకర్ సార్ విశ్లేషించారని, పాలమూరు వెనుకబాటుతనాన్ని కూడా అదే కోణంలో వివరించారని అన్నారు. 2006, 2008 ఉప ఎన్నికల సమయంలో ఉద్యమానికి భావజాల వ్యాప్తి, ఆందోళన, డెమోక్రటైజేషన్ అనే మూడు పార్శ్వాలు ఉన్నాయని జయశంకర్ సార్ చెప్పారని గుర్తు చేశారు. యాచించి కాదు.. శాసించి తెలంగాణ సాధించాలి అనే ఆలోచనను కేసీఆర్‌లో నూరిపోసిన వ్యక్తి ఆయనేనన్నారు. ఉద్యమం భాస్వరంలా మండుతుంది.. తెలంగాణ తప్పక వస్తుంది అని జయశంకర్ సార్ తమకు ధైర్యం చెప్పారని, శ్రీకాంతాచారి వంటి అమరవీరుల త్యాగాలతో ఉద్యమం విజయవంతమైందన్నారు. ఢిల్లీలో జాతీయ మీడియాకు తెలంగాణ చరిత్రను, హైదరాబాద్ రాష్ట్ర ప్రత్యేకతను, ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను, ఆంధ్ర–తెలంగాణ విలీనానికి గల కారణాలను జయశంకర్ సార్ ఆధారాలతో వివరించేవారని తెలిపారు. తెలంగాణ ప్రజలను చిన్నబుచ్చే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించేవారని కేటీఆర్ అన్నారు. జయశంకర్ ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ నిరంతరం పని చేస్తుందని, తెలంగాణను మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





