ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగిస్తాం

– పెండింగ్ బకాయిల చెల్లింపునకు కృషి
– విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలుపై ఆలోచన
– ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌తో ఆన్‌లైన్ ద్వారా చేపల పంపిణీ
– రూ.కోటి 34 లక్షల బీమా క్లియర్ చేశాం
– పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రాష్ట్రంలోని 26 వేల చెరువులు, వంద రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని విస్తరించడంతోపాటు మత్స్యకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్యరంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతం లక్ష్యంగా జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు బీమా, మోపెడ్‌లు, రిటైల్ అవుట్‌లెట్ షాపుల ఏర్పాటు కోసం ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలపై సమీక్షిస్తామని వెల్లడించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించడంతోపాటు మత్స్యకారులకు సంబంధించిన పెండింగ్ బకాయిల విడుదలకు ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల పోషకాహారాన్ని మెరుగుపరిచే దిశగా మధ్యాహ్న భోజన పథకంలో చేపలను చేర్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు నెలకొన్న సహకార సంఘాల సభ్యత్వ వివాదాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ కోహెడలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా చేపల విక్రయాలు, పంపిణీకి అవకాశం ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారులకు సంబంధించిన రూ.1.34 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను ప్రభుత్వం ఇప్పటికే క్లియర్ చేసిందని తెలిపారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులకు ప్రొటోకాల్ అంశంపై ప్రభుత్వంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి వాకిటి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *