సూపర్‌ ఎల్‌ ‌నినోపై అప్రమత్తం చేయాలి

– రిజర్వాయర్లలో నీటిని తాగునీటికి వినియోగించాలి
– ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలి
– అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలి
– వ్యవసాయ మంత్రి తుమ్మలసిరిసిల్ల, ప్రజాతంత్ర, జూలై 30: సూపర్‌ ఎల్‌ ‌నినో ప్రభావంపై రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మార్కెటింగ్‌, ‌వ్యవసాయ, చేనేత జౌళి శాఖ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సూపర్‌ ఎల్‌ ‌నినోపై కలెక్టరేట్‌లో  వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించగా మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్‌, ‌ప్రభుత్వ విప్‌, ‌వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌గరిమ అగ్రవాల్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేష్‌ ‌బి గితే తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్‌ ఎల్‌ ‌నినో ప్రభావాన్ని ఎదుర్కునేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన పీపీటిని ప్రదర్శించారు. జిల్లా ఎల్‌ ‌నినో ప్రణాళిక, తెలంగాణ జలసిరి పేరిట రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా పరిధిలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి.. వాటిలో నీటిమట్టం.. ఎన్ని ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.. మిషన్‌ ‌భగీరథ ద్వారా నీటి సరఫరా.. విద్యుత్‌ ‌సరఫరా తదితర అంశాలపై మంత్రి తుమ్మల ఆరా తీశారు. సూపర్‌ ఎల్‌ ‌నినో ప్రభావం దక్షిణ భారత దేశంపై ఎక్కువగా ఉంటుందని, వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు రిజర్వాయర్లలో ఉన్న నీరు తాగునీటికి మాత్రమే వచ్చే ఏడాది జూలై వరకు వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన మిషన్‌ ‌భగీరథ అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో కురిసిన వర్షం పంటలకు కొంత మేలు చేస్తుందని, కానీ పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు ఉపయోగపడదని తెలిపారు. రెండు నెలలు వర్షాలు సరిగా కురవక పంటల సాగు గణనీయంగా తగ్గిందని, వచ్చే నెలలో ఏ పంటలు సాగు చేస్తే మేలో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆరుతడి, స్వల్పకాలిక పంటలు, పప్పు ధాన్యాలు, ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు చేసేలా వివరించాలన్నారు. వాటికి కావలసిన అన్ని విత్తనాలు అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. మంచి ప్రణాళిక ప్రకారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చూడాలి
గత ఏడాదితో పోలిస్తే భూ గర్భ జలాలు రెండు మీటర్లకుపైగా లోతులోకి వెళ్ళాయని వెల్లడించారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలోని నీరు పంటలకు విడుదల చేసే అవకాశం లేదని, భూ గర్భ జలాల సమాచారం అధికారులు ప్రజలు, రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.  జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చూడాలని మంత్రి ఆదేశించారు.  తెలంగాణ జలసిరి కింద బోర్‌ ‌వెల్స్ ‌రీచార్జ్ ‌పనులు, పామ్‌ ‌పాండ్స్ ‌నిర్మాణ పనులు ముమ్మరంగా చేయించాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పాఠశాలల ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు.  జిల్లాలోని మిషన్‌ ‌భగీరథ నీటి సరఫరా కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని, రిజర్వాయర్ల నీటిని పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పంపింగ్‌ ‌కోసం కావాల్సిన మోటర్లు అదనంగా సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు.  నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎరువుల కొరత, ఇతర ఇబ్బందులపై వచ్చే అసత్య ప్రచారాలు చేయకుండా చూడాలని సూచించారు. పోలీస్‌ అధికారులు శాంతిభద్రతలు పరిరక్షిస్తూనే ప్రతీ అంశంపై దృష్టి సారించాలని ఆదేశించారు.  సూపర్‌ ఎల్‌ ‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.
 రైతులకు అవగాహన కార్యక్రమాలు
ఎల్‌ ‌నినో, పంటల మార్పిడిపై జిల్లాలో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని కలెక్టర్‌ ‌గరిమ అగ్రవాల్‌ ‌తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, ఇన్‌చార్జి మంత్రి సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌ ‌మానేరు) జలాశయం కీలకమని తెలిపారు. గత ఏడాది జిల్లాలో లక్షా 85 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని, ఈ ఏడాది ఇప్పటి వరకు 78 వేల ఎకరాల్లో సాగు అయిందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతు భరోసా అందుతున్న రైతుల ఫోన్లకు సమాచారం పంపుతున్నామని వెల్లడించారు. ఆగస్టులో సాగు చేసే పంటలపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని, రైతులకు మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాకు ఆయిల్‌ ‌పామ్‌ 1500 ఎకరాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 400 ఎకరాలు పూర్తి చేయించామని, మిగతా పురోగతిలో ఉందని వెల్లడించారు. జలసిరి కింద జిల్లాలో నీటి సంరక్షణ పనులు పకడ్బందీగా చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ‌గడ్డం నగేష్‌, ‌డీఆర్‌ఓ ‌జయశ్రీ, వేములవాడ ఆర్డీవో కే ఎస్‌ ‌బీ కుమారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివాసాచారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *