“మొత్తం మీద ఈ వ్యవహారంలో శోధ కన్ స్ట్రక్షన్స్, సృజన్ రెడ్డి, నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, జి ఆర్ ఎన్ అండ్ మహాలక్ష్మి, వారాహి జీకే ఆర్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్, సుశీ హైటెక్ వంటి పేర్లు బైటికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇంకా పేర్లు బైటికి రాని కనీసం అరడజన్ కాంట్రాక్టర్లు అందరూ ఏదో ఒక రాజకీయ పక్షానికి అనుచరులో, సన్నిహితులో, రాజకీయ నాయకుల మద్దతు ఉన్నవారో, లేదా రాజకీయ నాయకుల బినామీలో అని తెలుస్తున్నది. ఈ వాదోపవాదాల్లో ప్రజలకు అర్థమవుతున్నది, ప్రజలు అర్థం చేసుకోవలసినది ఏమంటే ఖనిజ వనరుల రంగంలో, ప్రత్యేకించి బొగ్గు రంగంలో అందరూ దొంగలే అని. బొగ్గు బుక్కని వారూ, ఆ బొగ్గును ఎదుటి వారి మీద ఊయని వారూ ఎవరూ లేరని.”
చిలికి చిలికి గాలివాన అయినట్టు ఒక టీవీ చానల్ ప్రసారం చేసిన వార్తాకథనం అటూ ఇటూ ఎటెటో తిరిగి తిరిగి బొగ్గు కుంభకోణాల కథలోకి దారి తీసింది. ఆ టీవీ వార్తా కథనం వాస్తవంగా ఒక బొగ్గు బ్లాక్ తవ్వకాల కాంట్రాక్టు ఎవరికి దక్కాలనే కొట్లాటలో పుట్టిందనీ, ఇద్దరు మంత్రులు రెండు వేరు వేరు కాంట్రాక్టు కంపెనీల కొమ్ము కాయడం వల్ల, అధికారం ఉన్న మంత్రి ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల, మరొక మంత్రి దాన్ని అడ్డుకోవడం వల్ల ఏర్పడిన రభసలో ఆ కథనం వచ్చిందనీ ధృవీకరించుకోవడానికి వీలులేని కథనాలు ప్రచారంలోకొచ్చాయి.
ఆ బొగ్గు కుంభకోణం గురించి మాట్లాదుకోబోయే ముందు, అసలు ఈ వివాదం ఎట్లా రాజకీయమయమైందో , ఆ రాజకీయ వివాదం కావడంలో పద్ధతి ప్రకారం ప్రజా ప్రయోజనాల ఊసు లేకుండా ఎలా రూపుమాపారో చూడాలి. అధికార పక్షానికీ, రెండు ప్రతిపక్ష పార్టీలకూ కూడా బొగ్గు కుంభకోణం పరస్పర ఆరోపణలకూ ప్రత్యారోపణలకూ వేదికా, సాధనమూ అయింది. బొగ్గు కుంభకోణాలు మీ కాలంలో జరగలేదా అంటే మీ కాలంలో జరగలేదా అనీ, ఇంకేదో కుంభకోణాన్ని తాము బైటపెడితే దాన్ని తప్పించడానికే ఈ కుంభకోణాన్ని తెర మీదికి తెచ్చారనీ, సిబిఐ, సుప్రీం కోర్టు విచారణలు కావాలనీ, ఈ ఒక్క వ్యవహారం మీదనే కాదు, గత పన్నెండు సంవత్సరాలలో జరిగిన అన్ని టెండర్ల మీద విచారణ జరగాలనీ ఒకరి మీద ఒకరు బోలెడంత బొగ్గు చల్లుకుంటున్నారు. మొత్తానికి అందరి తెల్ల ఖద్దరు చొక్కాలూ బొగ్గు మసెక్కిపోయాయి.
ప్రస్తుత వివాదానికి ఆధార బిందువైన నైని బొగ్గు గని టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఒక కంపెనీకి లాభం చేకూర్చడానికి ప్రయత్నాలు, నిబంధనల మార్పిడి జరిగాయని, దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ నాయకులు టి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎంతో అవినీతి, నిరంకుశమైన టెండర్ నిబంధనల విధింపు జరిగాయి గనుక సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కూడా కెటి రామారావు కోరారు. టెండర్ ప్రక్రియతో, టెండర్ నిబంధనలతో తనకేమీ సంబంధం లేదన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసలు నైని బ్లాక్ టెండర్లను రద్దు చేయమని సింగరేణిని ఆదేశించారు. మరొక వైపు నుంచి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారం పరిశీలించడానికి ఇద్దరు సభ్యుల సాంకేతిక కమిటీని పంపింది. తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే గనుల శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి కొత్తగూడెం వెళ్లి సింగరేణి యాజమాన్యంతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వమనీ, కమీషన్ల కోసమే నైని బ్లాక్ టెండర్ ప్రక్రియలో అక్రమాలు చేసిందనీ బిజెపి నాయకులు ఆరోపించారు.
మొత్తం మీద ఈ వ్యవహారంలో శోధ కన్ స్ట్రక్షన్స్, సృజన్ రెడ్డి, నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, జి ఆర్ ఎన్ అండ్ మహాలక్ష్మి, వారాహి జీకే ఆర్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్, సుశీ హైటెక్ వంటి పేర్లు బైటికి వచ్చిన కాంట్రాక్టర్లు, ఇంకా పేర్లు బైటికి రాని కనీసం అరడజన్ కాంట్రాక్టర్లు అందరూ ఏదో ఒక రాజకీయ పక్షానికి అనుచరులో, సన్నిహితులో, రాజకీయ నాయకుల మద్దతు ఉన్నవారో, లేదా రాజకీయ నాయకుల బినామీలో అని తెలుస్తున్నది. ఈ వాదోపవాదాల్లో ప్రజలకు అర్థమవుతున్నది, ప్రజలు అర్థం చేసుకోవలసినది ఏమంటే ఖనిజ వనరుల రంగంలో, ప్రత్యేకించి బొగ్గు రంగంలో అందరూ దొంగలే అని. బొగ్గు బుక్కని వారూ, ఆ బొగ్గును ఎదుటి వారి మీద ఊయని వారూ ఎవరూ లేరని.
“బొగ్గు ఒక్కటే ఇంత వివాదానికి కారణమవుతున్నదంటే, ఇసుక, గ్రానైట్ వంటి ఖనిజ వనరులు, కలప వంటి అటవీ వనరులు, భూమి, భూమిలోపల నిక్షిప్తమైన అత్యంత విలువైన ఇతర లోహాలూ ఖనిజాలూ మన పాలకులకు ఎంత బంగారు బాతులై ఉండాలి! ఎన్ని వందల వేల కోట్ల ముడుపులు సంపాదించి పెడుతూ ఉండాలి! ఈ దేశ ప్రజల సంపద, వారసత్వ సంపద, ప్రజలందరికీ చెందవలసిన సంపద, ఐదేళ్ల కోసం అధికారానికి వచ్చినవారి హక్కు భుక్తమైపోతున్నది! ధ్వంశమైపోతున్నది. భవిష్యత్ తరాలకు అందకుండా పోతున్నది!”
ఈ సందర్భంగా ఇవాళ్టి ప్రధాన వివాదవస్తువైన బొగ్గు గురించే మాట్లాడుకోవాలి. వలస పాలనా కాలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన విలియం కింగ్ అనే సర్వేయర్ అప్పటి వరంగల్ జిల్లా యెల్లందు సమీపంలో సింగరేణి గ్రామం దగ్గర బొగ్గు నిక్షేపాలున్నాయని కనిపెట్టాడు. ది హైదరాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్ అనే బ్రిటిష్ కంపెనీ 1886లో ఇక్కడ గనులు తవ్వడానికి అనుమతులు సంపాదించింది. ఆ కంపెనీ 1920లో సింగరేణీ కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా మారింది. ఆ కంపెనీ షేర్లను మొత్తంగా హైదరాబాద్ ప్రభుత్వం 1945లో కొనేసింది. ఆ తర్వాత ఆ బొగ్గు కంపెనీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కంపెనీగా మారింది. ప్రస్తుతం ఈ సంస్థలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది. ఈ బొగ్గు గనుల సంస్థను ఆక్రమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నది. డైరెక్టర్ల బోర్డులో ఉన్న తెలంగాణ ప్రతినిధులు ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు.
సింగరేణి కాలరీస్ పెగడపల్లి దగ్గర నిర్మించ తలపెట్టిన 600 మెగావాట్ల చొప్పున రెండు విద్యుదుత్పత్తి కర్మాగారాలకు అవసరమైన బొగ్గును సరఫరా చేయడానికి ఒడిశా లోని అంగుల్ జిల్లాలో తాల్చేర్ బొగ్గు క్షేత్రాలలో ఉన్న నైని బొగ్గు గనిని 2015లో కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. సింగరేణి సంస్థకు రాష్ట్రానికి బైట అందిన మొట్ట మొదటి గని ఇది. ఈ గని మొత్తం 913 హెక్టారలో (2300 ఎకరాలలో) విస్తరించి ఉంది. అందులో 643 హెక్టార్ల (1600 ఎకరాల) రిజర్వ్ అడవితో సహా మొట్ట 783 హెక్టార్లు (1950 ఎకరాల) అడవి ఉంది. ఈ గనిలో మొత్తం 45 కోట్ల టన్నుల బొగ్గు ఉందనీ, అందులో కనీసం 34 కోట్ల టన్నుల బొగ్గు తవ్వి తీసే అవకాశం ఉందనీ పరిశోధనలు చెపుతున్నాయి. అందులోనుంచి సాలీనా ఒక కోటి టన్నుల బొగ్గు తీసే అవకాశాన్ని సింగరేణి చేజిక్కించుకున్నది. అంటే కనీస పక్షం ఈ గని ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఉనికిలో ఉంటుంది. ఒకప్పుడు ఏనుగుల స్వర్గంగా పిలవబడిన అంగుల్ – ఢెంకనాల్ అటవీ ప్రాంతం ఇది. ఇక్కడ బొగ్గు గనుల తవ్వకం వల్ల ఇప్పటికే ఏనుగుల సంఖ్య తరిగిపోయిందనీ, గనుల తవ్వకం అలాగే సాగితే మిగిలి ఉన్న ఏనుగులు కూడా అంతరించిపోతాయనీ, పర్యావరణానికి తీవ్రమైన నష్టం సంభవిస్తుందనీ పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టాయి.
అలా 2015 ఆగస్ట్ 13న సింగరేణికి ఈ బొగ్గు బ్లాక్ ను కేటాయించినప్పటికీ మొదటి దశ పర్యావరణ అనుమతులు 2021లో, రెండో దశ అనుమతులు 2023 మార్చ్ లో మాత్రమే అందాయి. 2024 జూలై లో 643 హెక్టార్ల అటవీ భూమిని అప్పగించడానికి ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ బ్లాక్ చేతికి అందిన నాటి నుంచే సింగరేణి యాజమాన్యం, అంటే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొత్త బొగ్గు గనిని నిర్వహించడం తమ సామర్థ్యానికి మించిన పని అని, అందువల్ల ఈ పనిని ఔట్ సోర్స్ చేయక తప్పదని, అంటే మరొక సంస్థకు అప్పగించక తప్పదని ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఐదు జిల్లాలలో విస్తరించిన డజన్ల కొద్దీ భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులను తవ్విన వంద సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఒక్క గని తవ్వి బొగ్గు తీయడానికి తమ సామర్థ్యం సరిపోదని, ఔట్ సోర్స్ చేయడం అవసరమని అన్నదంటే, ఇందులో ఉన్న కుంభకోణం పాత్రను అర్థం చేసుకోవాలి. ఆ పని చేయడానికి ముందుకు వచ్చే కంపెనీలు తమ ఆసక్తి వ్యక్తీకరించాలని 2016 జనవరిలో సింగరేణి ఆహ్వానాలు కూడా పంపింది. ఇదంతా తెలంగాణ మొదటి ప్రభుత్వం రోజుల్లోనే జరిగిందంటే బొగ్గు కుంభకోణానికి బీజాలు అప్పుడే పడ్డాయనుకోవాలి.
ఆ దారిలోనే సాగుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక, నవంబర్ 2025లో నైని బొగ్గు గనిని అభివృద్ధి చేసి, నిర్వహించడానికి (మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్) టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ప్రక్రియ జనవరి 2026 చివరికి పూర్తయి పోయి, టెండర్ గెలుచుకున్నవారు తవ్వకాలు ప్రారంభించవలసి ఉండింది. అయితే ఈ టెండర్ ప్రక్రియలో సింగరేణి యాజమాన్యం ఒక చిక్కుముడి వేసింది. టెండర్ ప్రక్రియలో పాల్గొనదలచుకున్న కంపెనీ గని క్షేత్ర పర్యటన చేయాలి. చేసినట్టుగా స్థానిక జనరల్ మేనేజర్ నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకుని టెండర్ ఫారంకు జత చేయాలి. ఇక్కడ ఒక కంపెనీ సైట్ విజిట్ చేసినప్పటికీ, సర్టిఫికెట్ ఇవ్వడమా లేదా అన్నది ఆ జనరల్ మేనేజర్ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. తనకు ఇష్టమైనవారికి ఇవ్వవచ్చు, ఎవరికైనా ఇవ్వకుండానూ ఉండవచ్చు. అలా ఆ సర్టిఫికేట్ దొరకక కొన్ని కంపెనీలు టెండర్ ప్రక్రియలో పాల్గొనే అర్హత కోల్పోయాయి. అలా కొన్ని కంపెనీల అర్హత పోగొట్టడం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి.
నిజానికి ఈ ఎండిఓ టెండర్ ప్రక్రియకన్న ముందే 2016 నుంచే ఓపెన్ కాస్ట్ గని తవ్వకం, తవ్విన మట్టిని ఎత్తి వేరేచోట పోయడం, డీజిల్ సరఫరా, ఇతర యంత్ర సహకారం, నిర్వహణ సహకారం కాంట్రాక్టులు, సివిల్, రహదారుల, భవనాల నిర్మాణ కాంట్రాక్టులు, శ్రామికుల సరఫరా కాంట్రాక్టులు ఇస్తూనే ఉన్నారు. ఈ కాంట్రాక్టులలో బిఆర్ఎస్ పాలనా కాలంలో నెగెటివ్ టెండర్ రేట్లకే ఉన్నాయని (అంటే పనికి ప్రభుత్వం చూపిన ధరకంటే తక్కువ ధరకు – దాదాపు 7 శాతం నుంచి 20 శాతం తక్కువకున్నాయని), కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసి 7 శాతం నుంచి 10 శాతం ఎక్కువ ధరకు చేసేవారికి అప్పగించారని హరీష్ రావు అన్నారు. (అయితే అసలు ప్రభుత్వ పనుల టెండర్ ప్రక్రియ గురించి తెలిసినవారెవరికైనా టెండర్ లో ప్రభుత్వ అంచనాను మొదటే ఎక్కువగా చూపిస్తారని, ఆ ప్రాతిపదిక మీద అతి తక్కువ పాడినవారికి ఇస్తారని తెలుసు. అంటే అసలు టెండర్ ప్రక్రియ అంటేనే మోసంగా ఉన్నప్పుడు, తక్కువ ధర, ఎక్కువ ధర అనేది మాటవరుస ఆరోపణకు మాత్రమే పనికి వస్తుంది.) శోధ కన్ స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఈ కొత్త పద్ధతిలో లాభపడుతున్నదని ఆయన అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన కాంగ్రెస్ వచ్చాకనే 2024లో విధించారని ప్రతిపక్షం ఆరోపించగా, అది 2018 నుంచే ఉందని అధికార పక్షం ప్రత్యారోపించింది.
బొగ్గు ఒక్కటే ఇంత వివాదానికి కారణమవుతున్నదంటే, ఇసుక, గ్రానైట్ వంటి ఖనిజ వనరులు, కలప వంటి అటవీ వనరులు, భూమి, భూమిలోపల నిక్షిప్తమైన అత్యంత విలువైన ఇతర లోహాలూ ఖనిజాలూ మన పాలకులకు ఎంత బంగారు బాతులై ఉండాలి! ఎన్ని వందల వేల కోట్ల ముడుపులు సంపాదించి పెడుతూ ఉండాలి! ఈ దేశ ప్రజల సంపద, వారసత్వ సంపద, ప్రజలందరికీ చెందవలసిన సంపద, ఐదేళ్ల కోసం అధికారానికి వచ్చినవారి హక్కు భుక్తమైపోతున్నది! ధ్వంశమైపోతున్నది. భవిష్యత్ తరాలకు అందకుండా పోతున్నది!





