సంక్రాంతి పిలిచిందనీ ఊరెళ్ళాను.
మిత్రులు రమ్మాన్నారని వీధులన్నీ తిరిగాను.
మనిషి మనిషిలో
పోలిక పోగులను విప్పుకుంటూ
ఊరును మోస్తూ మనసు
అర్ధరాత్రి ఇంటికి చేరింది.
జ్ఞాపకాల జోలెను రాశిగా పోసి
మట్టి కొట్టుకున్న తేదీలను
సంవత్సరాలలో ముంచి తేల్చి
మాట గుర్తులతో
పలకరింపు హోదాలో దగ్గరై
ప్రతి ఒక్కరు ఇష్టంగా ముందుకు నడుస్తుంటే
తల నెరిసిన పాత ఇష్టాలకు
రంగులద్దిన కొత్త తరం హంగు
ఇంటింటా కనిపించినా
అరిగిపోయిన చేతుల్లో
బిడ్డల బిడ్డ కేరింతలు ఒడిసి పట్టి
బోసి నోళ్లతో నడక మెలితిరిగి
ఒక్కొక్కరు ఎదురౌతుంటే
కాలం ఒకరికి ఇచ్చింది
తిరిగి తీసుకుని
ఇంకొకరికి ఇచ్చినట్లుగా ఉంది.
గోడ మీద అద్దం
తాతను చూపిన ప్రేమతో నాన్నను
నాన్నను గౌరవించిన ఇష్టంతో నన్ను
చూపుతుంటే
నా బాల్యాన్ని గుర్తుపట్టి
రేపటి నా వృద్ధాప్యాన్ని
నా ఊరి వాళ్ళందరిలో చూపించి
నా మనసుని పంచమని చెప్పి
దీవించినట్లుగా ఉంది ఊరు.
-చందలూరి నారాయణరావు





