- జాతీయ స్థాయి క్రీడాకారులకు తీరని మనోవేదన
- సీఎం స్పందించి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2024 ఎస్జిటి టీచర్ పోస్టుల (DSC Teacher Posts) స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాల ఆరోపణలపై చేపట్టిన రీ వెరిఫికేషన్ ప్రక్రియ నెలల తరబడి జాప్యం అవుతోంది. టీచర్ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఏర్పాటు చేసిన కమిటీలు ఇచ్చిన నివేదికలు ఇంకా వెలుగులోకి రాలేదు. రీ వెరిఫికేషన్ వివరాలను అధికారులు బయట పెట్టడం లేదు. నాలుగు నెలలైనా రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్జీటీ స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలపై ఏర్పాటు చేసిన కమిటీలపై స్కూల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు అక్రమార్కులను కాపాడే యత్నం చేస్తున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అర్హులైన జాతీయ క్రీడాకారులు తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ నేత చిన్న రెడ్డిని కలిసి ఇచ్చిన వినతి పత్రాలను పట్టించుకోవడం లేదని వారు గగ్గోలు పెడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అక్రమాలు జరిగిన విషయంపై ఎందుకు నిగ్గు తేల్చడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చేందుకు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు డీఎస్సీ 2024 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ తో 10వేల టీచర్ నియామకాలు చేపట్టారు ఇందులో భాగంగా 2% స్పోర్ట్స్ కోటా కింద టీచర్ పోస్టులను భర్తీ చేసింది. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అంతర్జాతీయ క్రీడాకారులు అర్హులని ఎస్జీటీ టీచర్ పోస్టుల్లో జాతీయ స్థాయి క్రీడల్లో ప్రాతినిధ్యం వహించినవారు అర్హులని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇందుకోసం జాతీయ స్థాయి క్రీడాకారులు ఫామ్- 2 సమర్పించి జాతీయ స్థాయి క్రీడా సర్టిఫికెట్లను సమర్పించాలని నోటిఫికేషన్ లో పేర్కొంటూ 100 ఎస్జీటీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు ఎవరూ లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. ఎస్జీటీ పోస్టుల కోసం సుమారు 1000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఎస్జిటి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రం నియామకాలు చేపట్టింది.
జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులను కాకుండా రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొన్న అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత దసరా రోజు ఇచ్చిన పోస్టింగ్ లో ఆధారంగా జరిగిన అక్రమాలపై జాతీయ స్థాయి క్రీడాకారులు అప్పుడే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడాకారులను నియమించారని, అర్హులైన మాకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ రెక్రూట్మెంట్ అథారిటీకి పలుమార్లు విన్నవించారు. అయినా నోటిఫికేషన్ కు విరుద్ధంగా అధికారులు పోస్టింగ్ ఇచ్చేశారు. దీంతో చాలామంది కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులతో కొందరు కుమ్మక్కవడంతో జాతీయ స్థాయి క్రీడాకారుల విన్నపాలను పట్టించుకోకుండా నియామకాల ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించక తప్పలేదు.
రీ వెరిఫికేషన్ నివేదిక ఏది?
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలు అక్రమాలు జరిగాయని చాలా మంది అర్హులైన అభ్యర్థులు కోర్టుకెళ్లడంతో ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలంటూ న్యాయస్థానం డీఎస్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నియామకాల ప్రక్రియను రీ వెరిఫికేషన్ నిర్వహిస్తామని కోర్టుకు నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ సైతం స్పందించి రీ వెరిఫికేషన్ చేయాలని డీఎస్సీ అధికారులకు సూచించింది. దీంతో రీ వెరిఫికేషన్ కోసం ఓ కమిటీని నియమించింది. గతేడాది నవంబర్ లో నియామకమైన ఈ కమిటీ. 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను ప్రత్యక్షంగా పరిశీలించింది. మూడు రోజుల్లో పాటు సుమారు 100 పోస్టులకు గాను 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిష్కరించారు. అభ్యర్థులతో వారు ఆడిన ఆటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కానీ ఈ కమిటీ నివేదిక వివరాలను అధికారులు వెల్లడించలేదు. మరో నెల తర్వాత మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సైతం నెలన్నర పాటు గడిపి మరో నివేదిక ఇచ్చింది.. ఈ నివేదికను హైపవర్ కమిటీకి పంపుతున్నట్లు చెప్పి కాలయాపన చేస్తున్నారు. రీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించి సుమారుగా నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దానికి సంబంధించిన నివేదికలు బయటపెట్టలేదు. అసలు అక్రమాలు జరిగాయా లేదా రాష్ట్రస్థాయి క్రీడాకారులకు ఎలా ఉద్యోగాలు వొచ్చాయి నోటిఫికేషన్ లో కేవలం జాతీయ స్థాయి క్రీడాకారులే ఎస్జీటీ పోస్టులు ఇవ్వాలని ప్రకటించినట్లుగా నియామకాలు జరిగాయా? లేదా జాతీయ స్థాయి క్రీడాకారులు అర్హులు ఉండగా వారిని కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఎలా పోస్టింగ్ ఇచ్చారు. అర్హులైన జాతీయ స్థాయి క్రీడాకారులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదనే ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం లేదు.
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
రీ వెరిఫికేషన్ పేరుతో ఇన్ని రోజులు జాప్యం చేయడంతో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. తమకు న్యాయం చేయాలంటూ పలుమార్లు అధికారులను అడగగా. రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని అంటూ దాటవేస్తూ వొస్తున్నారు. అన్యాయానికి గురైన జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న అభ్యర్థులందరూ ప్రజా భవన్ కు వెళ్లి కూడా ఐదు సార్లు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డికి వినతులు ఇచ్చారు. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సైతం ఈ వినతులపై ఉన్నతాధికారులతో మాట్లాడితే మూడు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న విద్యా శాఖలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వొస్తున్నా సీఎం ఎందుకు దృష్టి సారించడం లేదంటూ అభ్యర్థులు వాపోతున్నారు. తప్పుదారి పట్టిస్తుంది ఎవరు? ఖచ్చితంగా నోటిఫికేషన్ కు విరుద్ధంగా జరిగిన నియామకాల అభ్యర్థుల్లో లావాదేవీలు జరిగాయి కాబట్టి.. వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఎన్ని రోజులు నివేదికలు బయటికి రాకుండా ఆపుతున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్రమంగా నియామకాలైన రాష్ట్రస్థాయి క్రీడాకారులను తొలగిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో రచ్చ అవుతుందనే భయంతోనే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు .. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి డిఎస్సీ 2024 స్పోర్ట్స్ కోటా నియామకంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించాలని వేడుకుంటున్నారు.





