- ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దళిత నేత
- శశిథరూర్‌పై భారీ మెజార్టీతో విజయం
- అభినందనలు తెలిపిన సోనియా, రాహుల్, థరూర్
- కాంగ్రెస్ కార్యాలయం ముందు సంబురాలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే ఘనవిజయం సాధించారు. ఆయనకు 7,897 వోట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన శశిథరూర్‌కు 1,000 వోట్లు వొచ్చాయి. 416 వోట్లు చెల్లలేదు. మల్లికార్జున్ ఖర్గే విజయం సాధించడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితం వెలుండిన అనంతరం ఏఐసీసీ కార్యాలయం బయట సంబురాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేకు శశిథరూర్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. నిజమైన పార్టీ పునరుద్ధరణ పక్రియ ఈ రోజుతో మొదలైనట్టు తాను నమ్ముతున్నానని శశిథరూర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు అభినందనలు తెలిపారు. నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు కానివారు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడుతుండటం 24 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
ఈ నెల 17వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ అనంతరం ఆయా రాష్ట్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు వోట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పోలింగ్‌లో అక్రమాలు జరిగాయని శశిథరూర్ వర్గం ఆరోపించింది. కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లింది. లక్నోలో లేని డెలిగేట్ల వోట్లు పోలయ్యాయని, యూపీ నుంచి పోలైన అన్ని వోట్లను చెల్లనివిగా పరిగణించాలని కోరింది. మొత్తంగా చాలాకాలంగా సోనియా గాంధీ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. కాగా ఖర్గేను పూర్వపు అధ్యక్షురాలు సోనియా గాంధీ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
Tags: mallikarjun karge,Congress new president, bharat jodo yatra




