గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్గా మార్చింది కేసీఆరే
కాంగ్రెస్‌కు షర్మిల, బిజెపికి పవన్ కల్యాణ్ మద్దతు
నేడు గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు చేయనున్న సీఎం
గజ్వేల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 8 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి డికేలొచ్చినా(కర్నాటక కాంగ్రెస్ డిప్యూటీ సిఎం డికె.శివకుమార్), పికేలొచ్చినా(జన సేనాని పవన్ కల్యాణ్) తమ ఏకే 47..సిఎం కేసీఆర్‌ను ఏం చేయలేరనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. నేడు గురువారం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్ధిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనుండటంతో మంత్రి హరీష్‌రావు బుధవారం గజ్వేల్‌లో సిఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండిడగ్, ఇతరత్రా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…గురువారం సిఎం కేసీఆర్ నామినేషన్ వేసేందుకు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుండి హెలికాప్టర్లో గజ్వేల్‌కు చేరుకుంటారన్నారు. గజ్వేల్‌లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం హెలికాప్టర్లో సిఎం కేసీఆర్ కామారెడ్డికి వెళ్లి అక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఎన్నికల ప్రచార ముగింపు సభ ఈ నెల 28న గజ్వేల్‌లో మధ్యాహ్నం నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా ముగింపు సభను గజ్వేల్‌లో చేసుకున్నామనీ, రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నామనీ, సిఎం కేసీఆర్‌కు వోటు వేసి రుణం తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు పోలింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్‌లో ఎన్నింటినో సిఎం కేసీఆర్ పూర్తి చేశారనీ, కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమైందన్నారు. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా గజ్వేల్ మారిందనీ, దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్‌కు వొచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారన్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వొచ్చాయన్నారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్‌కు రాబోతుందన్నారు. ఈ దఫా లక్షకుపైగా మెజారిటీతో గజ్వేల్‌లో గెలిచి తీరుతామన్నారు. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనీ, పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్లమవుతామని అనుకుంటున్నారన్నారు. కేసీఆర్‌కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరనీ, జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ సాధించారనీ, ఇంకెవరు పోటీ వొచ్చినా అది నామ మాత్రమే అన్నారు.
కేసీఆర్ తమ ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారనీ, వేరే వాళ్లు ఉంటే ఆ గౌరవం గజ్వేల్‌కు ఉంటుందా… అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం తమకు లేదనీ, ఎక్కడి నుండి నిన్న జనం వొచ్చారో ప్రజలందరికీ తెలుసు అని, తమ పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారనీ, నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కేసీఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి మద్దతు పలుకుతూ తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారన్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బిజెపి రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయనీ, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలాంటి వాళ్ల చేతుల్లో పెడితే ఆగమవుతామని, దయ్యాల పాలు చేసినట్లవుతుందన్నారు.
రిస్క్ లేకుండా నీళ్లు, సాగు నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు వస్తున్నాయనీ, మరి రిస్క్ తీసుకుని వేరే ప్రభుత్వానికి వేటు వేయడం ఎందుకని ప్రశ్నించారు. పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేసస్తుమనీ, కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్న ఆ రాష్ట్ర డిప్యూటి సిఎం డికె.శివకుమార్‌కు ధన్యవాదాలు చెప్పాలన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడనీ, నేను అనలేదు అని బుకాయిస్తున్నడన్నారు. రేవంత్ అన్న మాట, వీడియో అందరూ చూశారు, కుల్లం కుల్లం అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కనబడతాయన్నారు. 5 గంటలు కావాలి అనేవాళ్లు కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బిఆర్ఎస్కు వోటు వేస్తారన్నారు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో సిఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుందనీ, రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మంత్రి వెంట రాష్ట్ర ఎఫ్డిసి కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎం.భూంరెడ్డి, నేతి చిన రాజమౌళి, ఊడెం కృష్ణారెడ్డి, కోమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి(మియాపూర్) తదితరులు ఉన్నారు.





