తలకోన అటవీ ప్రాంతంలో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
తిరుపతి, డిసెంబర్ 9 : శేషాచలం అటవీ ప్రాంతంలోని తలకోన అటవీ ప్రాంతంలో 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలకోన సౌత్ ఫారెస్ట్, అలిపిరి ఫారెస్ట్ బీట్ పరిధిలో చేసుకున్నట్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి రెండు టీంలుగా గురువారం శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. భాకరాపేట రేంజ్ పరిధిలోని ఎర్రవారిపాలెం మండలం తలకోన సౌత్ వీటిలో కూంబింగ్ చేపట్టగా మునెద్దుల మడుగు వద్ద కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం కొయ్యలను మోసుకొని వస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్మగ్లర్లను చుట్టుముట్టే ప్రయత్నం చేయగా 21 ఎర్రచందనం కొయ్యలును కింద పడి వేసి చీకట్లో పారిపోయారని పోలీసులు తెలిపారు.
అదే టాస్క్ ఫోర్స్ విశ్వనాధ్ టీం తిరుమల చేరుకొని తిరుపతి డౌన్ గాట్ రోడ్డు వైపు కూంబింగ్ చేపట్టగా అలిపిరి ఫారెస్ట్ బీట్ పరిధిలో తిమ్మనాయుడుపాలెం సెక్షన్ సన్నరాల మిట్ట వద్ద కొందరు పోలీసులను చూసి 11 ఎర్రచందనం దుంగలను కింద పడేసి పారిపోయినట్లు తెలిపారు. రెండు చోట్ల కలిపి 32 ఎర్రచందనం కొయ్యలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన ఎర్రచందనం కొయ్యలు బరువు 987 కిలోలు ఉండగా వీటి విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని ఎస్పీ చక్రవర్తి తెలిపారు. పారిపోయిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.




