విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
బిజెపి నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్ట్
హెచ్‌ఐసిసిలో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నడ్డా
హైదరాబాద్,జూలై1: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, లక్ష్మణ్, విజయశాంతి ఇతర నేతలు ఘనంగా స్వాగతం చెప్పారు. భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోయింది. ఎయిర్ పోర్టు నుంచి శంషాబాద్ టౌన్ లో కిలోవి•టర్ మేర రోడ్డు షో కొనసాగింది. రోడ్డుకిరువైపులా నేతలు, కార్యకర్తలు నిలబడి నడ్డాకు ఘన స్వాగతం పలికారు. జై బీజేపీ, నడ్డా జిందాబాద్ నినాదాలతో హోరెత్తింది. రోడో షో తర్వాత హెచ్‌ఐసిసిలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను నడ్డా ప్రాంభించారు.
ఎగ్జిబిషన్ లో తెలంగాణ విమోచన చరిత్ర, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమ్రంభీం, షోయాబుల్లాఖాన్ లాంటి యోధుల చరిత్ర తెలిపేలా ప్రదర్శన ఉంది. మలి దశ ఉద్యమం, బీజేపీ పాత్రను తెలిసేలా ఫోటో ప్రదర్శన ఉండనుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 7 గంటలకు అక్కడే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్న రాజకీయ, ఆర్థిక అంశాలపై నడ్డా వీరితో చర్చించనున్నారు. రాత్రి 8.30 గంటలకు భరతనాట్యం, శివతాండవం, పేరణి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత దరువు ఎల్లన్న నేతృత్వంలోని తెలంగాణ కల్చరల్ పోగ్రామ్స్ ఉంటాయి. శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ నేషనల్ ఆఫీసు బేరర్ల సమావేశం నడ్డా అధ్యక్షతన జరుగనుంది.




