ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య హాట్ కామెంట్స్ కొనసాగుతుండగా, పొత్తులు, సీట్ల సర్దుబాటుపైన పార్టీల మధ్య హీట్ డిస్‌కషన్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో పలు రాజకీయపార్టీలు ‘సత్తా’ కోసం పోటీ పడుతున్నాయి. ఇక్కడ ట్రై యాంగిల్ ఫైట్ ఉంటుందన్నది గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. అధికారానికి ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటూ వొస్తున్న భారతీయ జనతాపార్టీ ఈ ఎన్నికల నాటికి బాగా దూకుడుగా దూసుకు వొచ్చింది. కాంగ్రెస్ పార్టీని తోసి బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తామేనని ఢంకా బజాయించి మరీ ప్రచారం చేసుకుంది. ఆ మేరకు పార్టీ పరంగా కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని నిలదీయడం ప్రారంభించింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలపై ఛాలెంజీ చేసింది. ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణమీద శ్రద్ధ చూపిస్తుండడంతో అధికార బిఆర్‌ఎస్‌పైన అలిగిన నాయకులు, కాంగ్రెస్‌లో ఇక కొనసాగలేమనుకున్న నాయకులు ఆపార్టీలోకి క్యూకట్టడం ప్రారంభించారు. అయితే కర్ణాటక ఎన్నికలు తెలంగాణలో ఆ పార్టీకి ఎదుగుదలకు ఒక్క సారే బ్రేకు వేసినట్లు అయింది. బిజెపిలో చేరికలు అగిపోయాయి. పైగా ఆ పార్టీలోని నాయకులు తిరిగి తమ మాతృసంస్థలోకి రావడం మొదలైంది. దీంతో ఒక్కసారే పైకి పాకిన బిజెపి గ్రాఫ్ పడిపోవడం ప్రారంభించింది. తెలంగాణపై ఆ పార్టీ పెట్టుకున్న ఆశలన్నీ పేకమేడల్లా మారిపోయాయి. దీనికి తగినట్లుగా అధ్యక్షుడి మార్పు కొట్టవచ్చినట్లు కనిపించింది. రాష్ట్రలో బిజెపి పార్టీకి ఒక ఊపు తీసుకువచ్చిన బండి సంజయ్‌ని ఎందుకు ఆ పదవినుండి తొలగించారో ఎవరికీ అంతుబట్ట కుండా పోయింది. చాలామంది పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఈ మార్పు తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇప్పుడు పడిపోయిన ఆ గ్రాఫ్‌ను పైకెత్తేందుకు కేంద్ర, రాష్ట్ర నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక అనుమానానికి తావేర్పడింది. ఇంతకాలం బిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయమంటూ దూసుకుపోతున్నట్లుగా కనిపించిందంతా ‘హైప్’ మాత్రమేనా- వాస్తవంగా అంత బలంగా బిజెపికి లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గోలకొండపైన కాషాయ జండా ఎగురవేస్తామని చెప్పుకుంటూ వొస్తున్న ఈ పార్టీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందా అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ- బిజెపిని పక్కకు తోసి తిరిగి తన స్థానాన్ని పదిల పర్చుకునే పనిలో పడింది. దీంతో ఇంతకాలం త్రికోణ పోటీ ఉంటుందనుకుంటున్న క్రమంలో ఇప్పుడు కేవలం కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యనే ముఖాముఖి పోటీ ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో ఈ రెండు పార్టీల మధ్య హాట్ కామెంట్స్ కొనసాగుతున్నాయి. ఈ పార్టీల మధ్యమాటలు హద్దు మీరుతున్నాయి. తోటి రాజకీయపార్టీని, నాయకులను విమర్శించేప్పుడు కనీస మర్యాదలను కూడా పాటించపోవడం విచారకరం. తాజాగా బిఆర్‌ఎస్ నేత వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. నాయకులను కుక్కలతో పోల్చడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడైన రైతు బంధు సమితి చైర్మన్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నోరు జారిన విధానం పట్ల ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో ఒక ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కుక్కలను పిల్లులుగా సంస్కరించేందుకే తమ పార్టీలో ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటున్నామన్న తీరుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఎంత అధికార పార్టీలో ఉన్నా ఇలాంటి మాటలు మాట్లాడటం ఎమ్మెల్సీ స్థాయి నాయకుడికి తగింది కాదంటున్నాయి ఆ పక్షాలు. అలాగే ఎంఎల్‌ఏ బాల్క సుమన్ చేసిన కామెంట్ కూడా సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఏమీ అనవద్దు.. వాళ్ళు మన వాళ్ళే.. మనమే కొందరిని ఆ పార్టీలోకి పంపించాం.. ఎన్నికైన తర్వాత తిరిగి వాళ్ళు మన పార్టీలోకి వొస్తారన్న ఆయన మాటల వెనుక బిఆర్‌ఎస్ కుట్రకోణం దాగి ఉందా అన్న ఆలోచనలో కాంగ్రెస్‌తో పాటు మిగతా పార్టీలు కసరత్తుచేసే పనిలో పడ్డాయి.
మరో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థాన్‌రెడ్డి ఒక్కొక్కడిని కాల్చి పారేస్తా అనడంపైన రాజకీయ వర్గాలు తీవ్రంగా చర్చిస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్న అహంకారమే ఆయన అనడానికి కారణమంటున్నాయి విపక్షాలు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలుకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ జై అంటూ కొందరు నినాదాలు చేయడంపైన ఆయన తన ఆగ్రహాన్ని ఆలా వ్యక్తం చేశాడు. నా క్యాడర్‌తో చెబితే ఒక్కరు మిగులరంటూ ఘాటైన పదజాలం వాడడాన్ని రాజకీయ పార్టీలు ఆక్షేపిస్తున్నాయి. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కెటిఆర్‌ల మధ్య ట్వ్టిర్‌ల వార్ చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా చేవెళ్ళలో కాంగ్రెస్ ప్రకటించిన దళిత, గిరిజన డిక్లరేషన్‌పై ట్విట్టర్‌లో కెటిఆర్ 75 ఏళ్ళ స్వాతంత్య్ర భారత్‌లో దళితులు వెనకబడినారన్న విషయాన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తించిందని చేసిన కామెంట్‌కు, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని తాము మోసం చేయలేదంటూ రేవంత్ సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఏమంటే కేసిఆర్ ఖేల్ ఖతం.. బిఆర్‌ఎస్ దుకాణం బంద్ అన్న ప్రచారాన్ని ఆయన ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయంలో అధికారికంగా ప్రకటించకున్నా కాంగ్రెస్ ఉభయ ••మ్యూనిస్టులతో చర్చలు జరుపుతోంది. కాగా విముక్తి చిరుత కచ్చీ (వీసీకే) తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, చిదంబరం ఎంపీకూడా అయిన డాక్టర్ తోటి తిరుమావలన్ ఇప్పటికే ప్రకటించారు. కాగా మరి కొన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌తో పొత్తు కలవడానికి ఉత్సాహ పడుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ఎన్ని సీట్లు వొదులుకోవాల్సి వొస్తుందో చూడాలి మరి.




