‘‘1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ ఇండియాకు స్వాతంత్య్రం సిద్ధించింది గాని హైదరాబాద్ తది తర సంస్థానాలకు విముక్తి, స్వేచ్ఛ లభించలేదు. ఖాసిమ్ రజ్వీ తదితరుల ప్రోత్సాహంతో మీడ్ ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్ర హైదరాబాద్ కలలు కన్నాడు. ఐక్యరాజ్య సమితికి ఆయన ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించాడు.’’
దాదాపు వంద సంవత్సరాల (1857-1947) బ్రిటిష్ పాలన అంతమయి భారత దేశం దాస్యశృంఖలాలను తెంచుకోవడం, స్వాతంత్య్రాన్ని సాధించడం ఆధునిక యుగంలో ఒక మహత్తర సంఘటన. ఈస్టిండియా కంపెనీ పెత్తనాన్ని గూడ పరిగణనలోనికి తీసుకుంటే మరో వంద సంవత్సరాలు వెనుకకు వెళ్లక తప్పదు. 1757లో ఆంగ్లేయులు ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజ్దు•లాను ఓడించినప్పుడే బ్రిటిష్ ప్రాబల్యం మొదలయింది. ప్రపంచమంతట సామ్రాజ్యవాదానికి, వలస తత్వానికి చరమగీతం వలె భారత స్వాతంత్య్ర శంఖారావం విన్పించింది. బ్రిటిష్ పాలన అంతమొందడానికి, స్వదేశీ స్పూర్తి పెంపొందడానికి వరుసగా ముప్పయి రెండు సంవత్సరాలు గాంధీజీ అపూర్వ అహింసాయుత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాలకు నేతృత్వం వహించినప్పటికి దేశమంతటా లక్షలాది యోధులు బ్రిటిష్ పాలకుల దమన నీతికి, నిర్బంధ చర్యలకు గురి కాక తప్పలేదు. అసంఖ్యాకులు ఆసేతు హిమాచల పర్యంతం చెరసాలల పాలయ్యారు, ఉరికంబాలు ఎక్కారు, ప్రాణాలను త్యాగం చేసారు. డెబ్భయి అయిదు సంవత్సరాల కిందట 1947 ఆగస్టు 15 తొలి క్షణాలలో పరాయి పాలన అంతమయి స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు దేశం రక్తసిక్తమయింది. భారత ఉపఖండం విభజన జరిగి రెండు స్వతంత్రదేశాలు భారతదేశం, పాకిస్తాన్ అవతరించినప్పుడు మతోన్మాదం మంటలు రేగి కొన్ని లక్షలమంది నిర్వాసితులయినారు, ప్రాణాలు కోల్పోయారు. నాడు అది విషాద భారతం. అహింసామూర్తి గాంధీజీకి అప్పటి హింసా కృత్యాలు, రక్తపాతం, చెలరేగిన అమానుషత్వం అమితఖేదం కల్గించాయి.
ఆయన తట్టుకోలేక పోయారు. స్వాతంత్య్రం సంబరాలలో ఆయన భాగస్వామి కాలేక పోయారు. ఉపఖండ విభజనను కాంగ్రెస్ అంగీకరించినప్పటికి గాంధీజీ వ్యతిరేకించారు. మతోన్మాదం మంటలను ఆర్పడానికి ఆయన స్వయంగా నౌఖాలి తదితర స్థలాలకు వెళ్లారు. అయిదురోజులు ఆయన ఉపవాస దీక్ష జరిపారు. స్వతంత్ర భారతం పుట్టుక సుఖంగా జరుగలేదు. తరువాత అయిదున్నర మాసాలకే 1948 జనవరి 30వ తేదీ సాయంత్రం దిల్లీ లో గాంధీ మహాత్ముని హత్య జరిగింది. హిందూ మతోన్మాది నాథూరామ్ వినాయక్ గాడ్సే తుపాకి గుండ్లు బాపూజీ ప్రాణాలను హరించాయి! బ్రిటిష్ పాలకుల కుతంత్రం ఫలించింది. భారత ఉపఖండం రెండు ముక్కలయింది. భారత ఉపఖండం విభజన అనివార్యమని 1947 జూన్ 3వ తేదీన అప్పటి వైస్రాయి లార్డ్ మౌంట్ బాటెన్ వెల్లడించాడు. భారత ఉపఖండాన్ని రెండు దేశాలుగా చీల్చడానికి వీలు కల్పించే ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ 1947 జూలై 1వ తేదీన ఆమోదించింది. అంతకుముందే క్యాబినెట్ మిషన్ ప్లాన్‌కు అనుగుణంగా, 1946 డిసెంబర్ 9వ తేదీన సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన రాజ్యాంగ నిర్ణయసభ ఏర్పాటయింది. స్వాతంత్య్రానికి ముందే 1946లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది.
ఉపఖండం విభజన రెండు దేశాల అవతరణకు దారితీయడంతో భారత రాజ్యాంగ నిర్ణయసభ సచ్చిదానంద సిన్హా అధ్యక్షతన స్వాతంత్య్రానికి ఒకరోజు ముందే 1947 ఆగస్టు 14వ తేదీన సమావేశమయింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, ఉక్కు మనిషిగా ప్రసిద్ధి పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రిగా (దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో) స్వతంత్ర భారత ప్రథమ మంత్రి వర్గం ఏర్పాటయింది. బి.ఆర్. అంబేడ్కర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ తదితరులు ప్రథమ మంత్రివర్గ సభ్యులు. లార్డ్ మౌంట్ బ్యాటెన్ గవర్నర్ జనరల్ గా నియమితుడయినాడు. తరువాత సి. రాజగోపాలచారి గవర్నర్ జనరల్ (1948-50). ఆయనే మొదటి, చివరి భారత గవర్నర్ జనరల్. 1949లో జనరల్ కె.ఎమ్. కరియప్ప నైన్యాదిపతిగ నియమితుడయ్యే వరకు స్వతంత్రభారత సైన్యానికి జనరల్ బుచర్ వంటి ఆంగ్లేయ సైనికాధికారులే ఆధిపత్యం వహించారు. ఈ ఆంగ్లేయ సైనికాధికారులు జమ్మూ – కాశ్మీరు, హైదరాబాద్ సంస్థానం విషయాలలో సరైన సలహాలు ఇవ్వలేదు.
ఒకవంక దేశ విభజన క్లిష్ట పరిణామాలతో, మతోన్మాద శక్తుల విజృంభణతో అరాచకత్వం బుసలు కొట్టుతుండగా మరోవంక స్వాతంత్య్రానికి రెండు నెలలయినా నిండకముందే జమ్మూ – కాశ్మీరు పై పాక్ సైనికమూకలు దాడి చేసి రాజధాని శ్రీనగర్ వరకు చొచ్చుకవచ్చాయి. భారత సైన్యం రంగంలో దిగి పాక్ మూకలను వెనుకకు తరిమింది. ఐక్యరాజ్య సమితి జోక్యంతో యుద్ధ విరమణ జరిగినప్పటికి, అప్పటికే జమ్మూ – కాశ్మీరు కొంతభాగం పాకిస్తాన్ ఆక్రమణ లోనికి వచ్చింది. ఆక్రమిత కాశ్మీరు ‘ఆజాద్ కాశ్మీర్ అని పాకిస్తాన్ ప్రచారం చేస్తున్నది. కాశ్మీర్ మహారాజు పాక్ మూకల దాడులు మొదలయిన తరువాత 1947 అక్టోబర్ 26వ తేదీన భారత దేశంలో తన సంస్థాన విలీనం ఒప్పందం మీద సంతకం పెట్టినాడు. మొదటే ఆయన స్వతంత్ర భారతంలో విలీనానికి నిర్ణయించలేదు. ఆసఫ్ జాహి వంశపు ఏడవరాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో పరిస్థితులు భయంకర స్వరూపం ధరించాయి.
మజ్లిసెఇత్తెహాదుల్ ముసల్మాన్ నాయకుడు, మతోన్మాది ఖాసిమ్ రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు జరిపిన క్రూర, అమానుష హింసా కాండతో హైదరాబాద్ సంస్థానం అరాచకత్వం పాలయింది. హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన భాగం అగ్నిగుండంగా మారింది. కమ్యూనిస్టు పార్టీ – తెలంగాణ ఆంధ్ర మహాసభ నాయకత్వాన నిజామ్ నిరంకుశ పాలనకు, రజాకార్లకు వ్యతిరేకం సాయుధపోరాటం తీవ్ర స్వరూపం ధరించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ ఇండియాకు స్వాతంత్య్రం సిద్ధించింది గాని హైదరాబాద్ తది తర సంస్థానాలకు విముక్తి, స్వేచ్ఛ లభించలేదు. ఖాసిమ్ రజ్వీ తదితరుల ప్రోత్సాహంతో మీడ్ ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్ర హైదరాబాద్ కలలు కన్నాడు. ఐక్యరాజ్య సమితికి ఆయన ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించాడు. బ్రిటిష్ పాలకులు 565 సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చి, చేతులు దులుపు కుని నిష్క్రమించారు. ఈ సంస్థానాల విలీనం ఒక జటిల సమస్యగా పరిణమించింది. శైశవ దశలో ఉన్న స్వతంత్ర భారతదేశానికి అన్ని వైపుల అతిక్లిష్ట పరిస్థితులు, సమస్యలు ముసురుకున్నాయి. అయినప్పటికి ప్రగతి ప్రయత్నాలు ఆగలేదు.
– ప్రజాతంత్ర డెస్క్




