సర్కారు బడి.. కబ్జాకు గురి

కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 07 : ‌కూకట్‌పల్లి నియోజకవర్గంలో కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. గుడి, బడి అని కూడా చూడకుండా విచ్చలవిడి తనాన్ని అవలంబిస్తున్నారు. అడిగేవారు లేరని, ‘‘అందినోడికి అందినంత’’ అనే పద్దతిలో అందినకాడికి దండుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారని కాబోలు..స్థానిక అధికారులు సైతం వీరికి తగిన సహకారాన్ని అందిస్తున్నారనడానికి నిలువెత్తు నిదర్శనం..ఆయా ప్రాంతం ప్రాథమిక పాఠశాల భవనం చీల్చి జరుపుతన్న అక్రమ నిర్మాణాలే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని తుంగలో తొక్కుతూ, అక్రమార్కులు బడిని సైతం వొదలకుండా నిర్మాణాల పేరుతో కబ్జా చేసి నిర్మాణాలు జరిపి జేబులు నింపుకుంటున్నా స్థానిక అధికారులలో చలనం లేకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది.

ఉన్నత విద్యను పేదలకు అందించడమే లక్ష్యంగా  ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చర్యలు చేపడుతుంటే ఇక్కడ వ్యవహారం దానికి భిన్నంగా జరుగుతుంది. తాజాగా ఖైతాలపూర్‌ ‌సేవాలాల్‌ ‌తండాలో గల ప్రాథమిక పాఠశాల భవనం తొలిచి, దేవాలయం పేరుతో వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. ఇది ఎక్కడో కాదు. మూసాపేట్‌ ‌నుండి ఖైతలపూర్‌ ‌వెళ్లే ప్రధాన రహదారి ప్రక్కనే. అక్రమంగా నిర్మాణం జరుగుతున్నా స్థానిక అధికారులు ఏమి తెలియనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ పాఠశాల మెయిన్‌ ‌రోడ్డు పైనే ఉండడంతో ఇక్కడి భూమ్మీద అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడి భూములకు అధిక ధర పలుకుతుండడంతో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాదారులకు పంట పండినట్టే అని పలువురు అనుకుంటున్నారు. ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు, రెవిన్యూ సిబ్బంది స్పందించి కబ్జాదారుల పాలవుతున్న  స్థలాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *