(నవంబర్ 14 – 20 ‘జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు’ సందర్భంగా…)
భారత గ్రంథాలయ సంఘం, ఐఎల్‌ఏ చొరవతో 1968 నుంచి ప్రతి ఏట పండిట్ నెహ్రూ జన్మదినం సందర్భాన్ని ఆసరాగా చేసుకొని 14 – 20 నవంబర్ తేదీల్లో దేశవ్యాప్తంగా ‘‘జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు’’ ఘనంగా నిర్వహించుట ఆనవాయితీగా మారింది. విజ్ఞాన వితరణలో గ్రంథాలయాల విశేష కృషి, విధి నిర్వహణలో లైబ్రేరియన్ల అకుంఠిత దీక్ష, లైబ్రరీ సేవలందించే సిబ్బంది నిస్వార్థ సేవా గుణాలు, విజ్ఞాన సమాజ స్థాపనలో లైబ్రరీల అమూల్య సేవలను గుర్తు చేసుకుంటూ, ప్రచారం చేస్తూ గ్రంథాలయ వారోత్సవాలను భక్తి భావంతో వేడుకల వలె జరుపుకోవడం సముచితంగా ఉంటుంది. గ్రంథాలయాల వినియోగంతో అందరికీ చదవడమనే సద్గుణం అలవడడం శుభ పరిణామంగా భావించాలి. పుస్తకాలు కొలువుండే అక్షరాలయంతో మానవ మేధస్సు చురుకుదనం పెరుగుతుంది.
గ్రంథాలయ ఉద్యమ పితామహులు
మద్రాసుకు చెందిన ఎస్. ఆర్. రంగనాథన్ (09 ఆగష్టు 1892 – 27 సెప్టెంబర్ 1972) జీవితం గ్రంథాలయ అధికారినే కాకుండా గ్రంథాలయాల ప్రాధాన్యాలను వ్యాప్తి చేయడంలో జాతీయ అంతర్జాత గుర్తింపును పొంది ‘‘భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడి (ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్)’’గా పేరు తెచ్చుకున్నారు. గ్రాంథాలయ ఉద్యమంలో నాయకుడిగా ముందుండి పుస్తక బాంఢాగారాల విలువను ప్రజలకు వివరించే యజ్ఞంలో పాలుపంచుకున్నందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘అయ్యంకి వెంకట రామయ్య’ గారిని ‘గ్రంథాలయ పితామహుడు లేదా గ్రంథాలయ ఉద్యమ రూపశిల్పి’ గా పిలవడం కూడా జరుగుతున్నది.
గ్రంథాలయ వారోత్సవాల్లో పోటీల నిర్వహణ
జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జిల్లా/మండల/పాఠశాల స్థాయిల్లో విద్యార్థులకు కథల పోటీలు, గ్రంథాలయాలకు సంబంధించిన క్విజ్ పోటీలు, పుస్తక సమీక్షలు, రీడిరగ్ పోటీలు, పుస్తక ప్రదర్శనలు, పోస్టర్ మేకింగ్ పోటీలు, గ్రంథాలయాల ప్రాధాన్యంలో వ్యాస/వకృత్వ/డిబేట్ లాంటి పోటీలను నిర్వహించడం సముచితంగా ఉంటుంది. పుస్తక పఠనంతో విశ్వ దర్శనం, మానసిక మేధో వికాసం, బంగారు భవిష్యత్తు నిర్మాణం, సమాజ గుర్తింపు లాంటి ప్రయోజనాలు ఒనగూడుతాయి. ఈ వారోత్సవాల్లో పుస్తకాలను ముద్రించే వ్యక్తులు/సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎన్జిఓలు, బుక్ సెల్లర్స్, గ్రంథాలయ అధికారులు లాంటి వ్యక్తులను గుర్తించి ఘనంగా సన్మానించడం కూడా నిర్వహించుకోవచ్చు.
పుస్తకం మస్తిష్క వికాస సాధనం
అరుదైన పుస్తకాలకు నెలవులు లైబ్రరీలు. విజ్ఞాన వితరణతో మేధస్సును పదును పెడుతూ, సమాజాన్ని సన్మార్గంలో నడపడానికి, వ్యక్తిత్వ మేధో వికాసానికి, ఆకర్షణీయ ఉద్యోగ సాధనకు, పేద యువతకు ఉచిత జ్ఞాన వితరణలో గ్రంథాలయాలు ఎనలేని సేవలను చేస్తున్నాయి. నేటి డిజిటల్ యువతలో చదివే అలవాటు సన్నగిల్లుతున్నది. చదవడం తగ్గితే అజ్ఞానం రాజ్యమేలుతుంది. అజ్ఞాన సమాజం అశాంతికి ఆజ్యం పోస్తుంది. నేడు ప్రతి ఊరు వాడల్లో గ్రాంథాలయాలను ఏర్పాటు చేయడం, సక్రమంగా వినియోగించుకోవడం, యువతను పుస్తక పఠన వైపు ఆకర్షించడం, అన్ని రకాల పుస్తకాలు, పత్రికలను అందుబాటులో ఉంచడం లాంటి ఆదర్శ లక్షణాలను అలవర్చుకొని విజ్ఞాన సంపన్న సమాజ స్థాపనకు పునాదులు వేస్తూ పుస్తకాలను జ్ఞాన నిధులు భావిద్దాం.
మధుపాళీ
కరీంనగర్, 9949700037




