సంఘ సంస్కర్త, ఆంధ్ర పితామహుడు ‘మాడపాటి’

 (జనవరి 22.. 140వ జయంతి)

జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాకుండా, తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం హనుమంతరావును అజాత శత్రువుగా నిలిపాయి. ఆయన ఒక కవి, రచయిత. తెలుగుజాతి ప్రగతికి పాటుపడిన తేజోమూర్తి. దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో దక్షత కలిగి, తెలుగు ప్రజల భాషా, సాంస్కృతిక గుర్తింపు చాటడానికి సమర్థ ఉపకరణంగా జర్నలిజాన్ని ఉపయోగించుకున్నారు. రాజకీయాల్లో ఆయన మితవాది అయినా ఆయన రాజకీయాదర్శాలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు సైతం అయన ఎంతగానో గౌరవించేవారు. ఆ విశిష్ఠ వ్యక్తే మాడపాటి హనుమంతరావు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ అయినందువల్ల, తెలుగుజాతిని ఐక్యం చేయడానికి గ్రంథాలయాలే పునాదిగా భావించి హనుమకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం, హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. కొన్ని వత్తిళ్ళ వలన కార్యదర్శి పదవికి ఆయన రాజీనామా చేసి, వేరొకర్ని ఏర్పాటు చేశారు.

నిద్రావస్థలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి కొత్త ఊపిరిలూది మేల్కొల్పిన వైతాళికుడు, తెలంగాణలో తెలుగు భాష సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవితం అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. ప్రజాహిత కార్యసేవాతత్పరుడు, ఆంధ్ర పితామహ బిరుదాంకితుడు. గ్రంథాలయోద్యమం, సంఘ సంస్కరణ, వయోజన విద్య, స్త్రీవిద్య, మహిళాభ్యుదయం, సాహిత్య వికాసం, సాంస్కృతికాభివృద్ధి వంటి  ఉద్యమాలకు ఎనలేని కృషిచేసిన మహా మనీషి. తెలంగాణలో చైతన్యాన్ని తెచ్చిన తొలి తెలుగు నాయకునిగా ప్రాచుర్యం పొందారు. 1885 జనవరి 22న వరంగల్‌ జిల్లా మధిర తాలూకా ఎర్రుపాలెం గ్రామంలో జమలాపురం ఆడబడుచు వేంకట సుబ్బమ్మ. వేంకటప్పయ్య దంపతులకు జన్మించారు. వరంగల్‌లో పాఠశాల  విద్య చదివి మద్రాసు మెట్రిక్‌ పాసయ్యారు. కొన్నేళ్ళు వరంగల్‌ విద్యాశాఖలో పనిచేసి, తరువాత సెలవుపెట్టి హైదరాబాద్‌లో న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులై 1917లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. న్యాయ, పౌర, రాజకీయ హక్కులను గురించి ‘నీలగిరి’, ‘గోల్కొండ’, ‘సుజాత’, ‘దేశబంధు’, ‘తెలంగాణా’ పత్రికల్లో వ్యాసాలు  రాశారు. పాత్రికేయునిగా ఆయన తనదైన ముద్ర వేశారు. పిరదౌసి ఫార్సీ కవితను తెలుగులోకి అనువదించారు.

మొత్తం పదమూడు కథలు రాశారు. ‘మల్లికాగుచ్చం’ పేరిట ఆయన కథలు 1911 లో పుస్తకరూపం దాల్చాయి. రచయితగా ఆయనకు శాశ్వత కీర్తి అందించిన గ్రంథం ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’. ముషీర్‌ ఎ దక్కన్‌ అనే ఉర్దూ పత్రికకు చాలాకాలం సంపాదకీయాలు రాసారు. బంకించంద్ర ఛటర్జీ ‘‘ఆనందమఠ్‌’’ ప్రసిద్ధ నవలను తెలుగులో అనువదించారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌ పనిమీద వచ్చినప్పుడల్లా విద్యార్థులు, విద్యావంతులు తప్పనిసరిగా ‘‘గోల్కొండ’’ గృహంలో సురవరం ప్రతాపరెడ్డిని, ‘‘ఆంధ్ర కుటీరం’’ పేరిట నిర్మించుకున్న ఇంటికి మాడపాటిని ఒక ఆచారంలా సందర్శించేవారని తెలంగాణ సాయుధ పోరాటం ముందు స్థితిగతులను ప్రతిబింబించేలా దాశరథి రంగాచార్యులు రసిన చారిత్రిక నవల ‘‘చిల్లర దేవుళ్ళు’’ నవలలో మాడపాటిని ఒక పాత్రగా మలిచారన్న విషయం విదితమే.

తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఆయన మేల్కొలిపి సంఘటిత పరచి ఆంధ్ర మహాసభ నెలకొల్పారు.. 1935 లో కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు.. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు గౌరవంలేని రోజుల్లో తెలంగాణాలో ‘మేం ఆంధ్రులం’ అని చెప్పగలిగిన ధైర్యశాలి. తెలంగాణలో ఆంధ్ర మహాసభకు ఆయన పెద్దదిక్కుగా వ్యవహరించారు. హైదరాబాదు నారాయణగూడలో దేశంలో ప్రప్రథమంగా బాలికోన్నత పాఠశాల సంస్థాపకుడాయన. అందుకే ఆ పాఠశాలకు మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల అని పేరు పెట్టారు.

గ్రామ ప్రాంతాల చైతన్యానికి, తెలంగాణా వెనుకబాటు తనానికి కారకులైన నిజాం పాలక విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాలను నడిపించడంలో మాడపాటి హనుమంతరావు కీలక పాత్ర పోషించారు. 1921లో నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం కార్యదర్శిగా సారథ్యం వహించారు. రాష్ట్రం నిజాం చెఱ వీడిన తర్వాత 1951లో హైదరాబాద్‌ నగర పాలక సంస్థ మొదట మేయర్‌గా ఎన్నికై మాడపాటి హనుమంతరావు నగరాభివృద్ధి కృషి చేశారు. హైదరాబాద్‌ నగర మొట్టమొదటి మేయర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విధానమండలి తొలి అధ్యక్షుడు,  మాడపాటికి భారత ప్రభుత్వం 1955 జనవరి 26న ‘‘పద్మభూషణ్‌’’ బిరుదునిచ్చి సత్కరించింది. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌కు శాశ్వత సభ్యులయ్యారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ మొదటి అధ్యక్షులుగా ఆరేళ్లు కొనసాగారు. 1970 నవంబర్‌ 11వ తేదీన 86వ ఏట తనువు చాలించి, ఆంధ్ర పితామహుడనే ఖ్యాతినార్జించారు మహనీయుడు మాడపాటి.
-నందిరాజు రాధాకృష్ణ, 98481 28215       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *