సైద్ధాంతిక విశ్లేషణతో సాగిన విమర్శకు సప్రమాణత చేకూరుతుంది. పరిశోధనాత్మకతతో కూడుకున్న విశ్లేషణ భవిష్యత్తుకు దారి దీపమవుతుంది. సాహిత్య సాంస్కృతిక చారిత్రక భాషా కళారంగాలలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన కృషి విస్మరణకు గురై సముచిత స్థానాన్ని పొందలేదన్నది వాస్తవం. పరిశోధనాత్మకత, ప్రామాణికత కలిగిన 20 వ్యాసాలతో తెలంగాణ అస్తిత్వ సృజన.. ఇతర వ్యాసాలు అన్న పేరుతో డా.ఎన్‌. ‌రజని వ్యాస సంకలనాన్ని వెలువరించారు. మొదటి వ్యాసం సమ్మక్క – సారక్క – చారిత్రక అవసరం. హక్కుల కోసం పోరాడిన సమ్మక్క సారక్కల జ్ఞాపకాన్ని తరతరాలకు అందించే చారిత్రక అవసరాన్ని సమగ్రంగా వివరించిన వ్యాసం ఇది. సమ్మక్క, సారక్కల గురించి ఎన్నో కథలు, స్థల పురాణాలు, శాసనాలు, కుల పురాణాలు వివిధ రీతులలో ఉన్నా కథనంలో కొన్ని మార్పులు చేరినా, కథలు అనేకంగా ప్రచారంలో ఉన్నా సమ్మక్క, సారక్కలు గిరిజనులు పూజించే గ్రామ దేవతలని తెలిపారు. వెయ్యేండ్ల చరిత్ర కలిగి మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ప్రకృతి ఒడిలోని పండుగగా చెప్పారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో రెండేళ్లకోసారి జరిగే ప్రపంచ స్థాయి పెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ ప్రాంతపు పెద్దపండుగగా సమ్మక్క – సారక్క జాతరను చూపి చారిత్రక దృక్కోణాలను పరిచయం చేశారు. గిరిజనుల ప్రకృతి ప్రేమ, విశ్వాసాలు, వన దేవతల పట్ల ఉన్న అచంచల నమ్మకం విగ్రహారాధన కాకుండా గద్దెలను భక్తితో ప్రజలే ప్రతిష్టించుకున్న తీరును చెప్పి సమ్మక్క సారక్క జాతరను చారిత్రక దృష్టికోణంలోంచి వెలికి తీయాలన్న సూచనను చేశారు.

సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ రంగాల నేపథ్యంలో సురవరం గొలకొండ కవుల సంచిక ప్రాతిపదికగా తెలంగాణ అస్తిత్వాన్ని విశ్లేషించిన వ్యాసం ప్రామాణికంగా సాగింది. గుర్తించలేకపోయిన దశ నుంచి గుర్తింపు పొందాలన్న స్పృహతో కూడిన ఆలోచనలు విస్తరించిన ఎన్నో అంశాలను ఉదాహరణలు, గణాంకాల యుక్తంగా ఈ వ్యాసం చూపింది. మరుగున పడిన చరిత్రను వెలికితీయాల్సిన ఆవశ్యకతను, ఎందరెందరో కవుల కవితా ప్రక్రియలను గురించి తెలుసుకోవలసిన ప్రత్యేక పార్శ్వాన్ని, విభిన్న కోణాల్ని ఈ వ్యాసం ప్రస్తావించింది. ఆంధ్రమహాసభ – విశ్లేషణ అన్న మరొక వ్యాసం తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి స్ఫూర్తిని, ప్రేరణను ఆంధ్రమహాసభ కలిగించి కీలకపాత్రను ఎలా పోశించిందో తెలిపారు. తెలంగాణ ఉద్యమ చైతన్యంలో ఆ మహాసభ భాగంగా మారిన తీరును కూడా విశదంగా వివరించారు. తెలంగాణ ఉద్యమం – సాహిత్యం అన్న వ్యాసం తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలతో పాటుగా వచ్చిన కథాసాహిత్యాన్ని స్పృశించింది. ఉద్యమ జీవితమే కథ, సకల జనులే కథాంశాలంటూ బతుకమ్మ తెలంగాణ, ఎలగపండు, ఓ సిన్నోని కథ, విధ్వంసం, సంబురాల పండుగ, నమస్తే తెలంగాణ, సూర్రెడ్డి, జమానా, దిష్టిబొమ్మ, అమ్మను ఆస్పత్రికి, నెత్తుటి గూడు నా తెలంగాణ వంటి కథల విశ్లేషణతో తెలంగాణ జీవితం, ఆరాటం, అస్తిత్వం, పోరాటాలను ప్రతిబింబించింది. స్వాతిశ్రీపాద, ఉదయమిత్ర, డాక్టర్‌ ‌సదానంద్‌ ‌శారధ, సత్యపాల్‌రెడ్డి కంచెర్ల, మార్క వెంకట్రాములు, వజ్జీరు ప్రదీప్‌, ఎనగంటి గోపాల్‌, ‌డాక్టర్‌ ‌కె నాగేశ్వరాచారి, అత్రిపత్రి, ధర్మశాంత్‌ ‌ప్రభాకర్‌రావు, జీవన్‌ ‌వంటి కథా రచయితల ఉద్యమ భావ ఉన్నతికి సంబంధించిన విశ్లేషణ ఇందులో ఉంది.

తెలంగాణ స్త్రీల కవిత్వం – అభ్యుదయ విప్లవధోరణులు అన్న వ్యాసంలో స్త్రీలు కవిత్వం రాయడమే ఒక అభ్యుదయమని, ఒక ఆలోచన అని, తమ అవగాహనను, సామాజిక స్పృహను కలిగి ఉండడమే ఒక విప్లవమని విశ్లేషించి చూపింది. జిగర్‌, ‌తెలంగాణ కవిత 2009 తదితర సంకలనాలతో పాటు పలువురు రచయిత్రుల కవితలను సమగ్రంగా చర్చిస్తూ మహిళలను స్త్రీ వాదానికే పరిమితం చేయకుండా అభ్యుదయ, విప్లవ పంథాల్లో కూడా వారు సమున్నత స్థానాన్ని వహించారన్న విషయాన్ని గుర్తించి పరిశోధించాలన్నారు. తెలంగాణ స్త్రీల కథా సాహిత్యం అన్న వ్యాసం పలువురు రచయిత్రుల కథలను ప్రస్తావిస్తూ స్త్రీల కథాంశాల్లో విభిన్నత వైవిధ్యం ఉన్నాయని, అన్ని అంశాలను ఆ కథల్లో చిత్రిస్తారని గ్రహించమని తెలిపారు. ఇల్లిందల సరస్వతిదేవి, నందగిరి ఇందిరాదేవి, పి యశోదారెడ్డి, నెల్లుట్ల రమాదేవి, గాజుల గౌరి, గీతాంజలి, గోపి భాగ్యలక్ష్మి, తాయమ్మ కరుణ వంటి రచయిత్రుల కథల్లోని కథాంశాలను, అన్ని కోణాలను స్పృశించారు.

సామాజిక చైతన్యం, ప్రకృతి ఆరాధన, ప్రణయం మొదలైన భావాలన్నీ కలగలిసిన అగ్నిధార స్పష్టతను దాశరథి అగ్నిధార ఒక పరిశీలన అన్న వ్యాసం లోతైన విశ్లేషణతో చూపింది. అగ్నిధార కావ్యం ఈ కాలానికి కూడా ఎంత వినూత్నమైందో, అందులో వస్తువు ఎంత పటిష్టమైందో, దాశరథిలోని నిమగ్నత, నిబద్ధత ఎంతటిదో తెలిపారు. దాశరథి అగ్నిధారలోని పలు ఖండికలను ఉదాహరిస్తూ వాటిలోని లోతైన కవి భావనలను ఈ వ్యాసం వెల్లడించింది. సమాజపు గొడవనే తన కవిత్వంగా మలిచి వర్తమాన వాస్తవ ప్రపంచాన్ని కళ్లెదుట నిలిపిన జనం కవి కాళోజీ. ఈ సంపుటిలోని నా గొడవ – ఒక పరిశీలన అన్న వ్యాసంలో మనుషులతో మాట్లాడడం కాళోజీకి తన ప్రాణంకంటే ఎక్కువ ఇష్టం అన్న వాక్యాన్ని రాసి మనుజుల చేతనే మనెడు ప్రపంచము/ మానవులనే మననీదు ప్రపంచము వంటి పలు కవితాత్మక ఉదాహరణలతో చూపించారు. సమాజమే కవి తన కవిత్వ రంగస్థలం అన్న విషయాన్ని చెప్పారు. ప్రపంచం, ఇంకెన్నాళ్లు, దీపావళి దీపాలు, లోకం, రాదుర్మతీరా, బ్రతుకు వంటి కవితా ఖండికల ద్వారా ఏ రాజకీయ సిద్ధాంతాలకు కట్టుబడని సమాజ జీవిత సంఘర్షణ, పోరాటంతో కూడిన కాళోజీ తత్వాన్ని విశ్లేషించి చూపారు. రాయి రువ్వినా/ రాకెట్‌ ‌విసిరినా/ గిట్టిన వారిని కొట్టుటకే కదా వంటి ప్రఖ్యాతమైన కాళోజీ రాజకీయ చురకల్ని ప్రస్తావించి నిశితంగా పరిశీలించారు.

తెలంగాణ చారిత్రక, సాహిత్యమట్టి పొరలను తవ్వితీసిన అరుదైన తొలితరం కథా రచయిత పొట్లపల్లి రామారావు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ ప్రారంభంలోనే ఇక్కడి చరిత్ర, సాహిత్యాన్ని వెలికితీస్తూ తాత్త్విక చింతన, ఉన్నతమైన భావజాలంతో ఆయన రాసిన కథలను ఉదాహరించారు. రూపాంతరం, ముత్యాల బేరం, న్యాయం, విముక్తి, ఒంటరి చూపు, సమాధి స్థలము, జైలు డైరీ వంటి విలువైన కథల్ని విశ్లేషించి ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని చూపారు. కవిత నా చిరునామా అన్న పేరుతో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె 1987 – 88 మధ్యకాలంలో తాను రాసిన కవితలను 1998లో పుస్తకంగా వెలువరించారు. కవిత నా చిరునామా – సినారె కవితా దృక్పథం అన్న శీర్షికతో ఈ సంపుటిలో ఉన్న వ్యాసంలో అందులోని 75 కవితలపై పరిశోధనాత్మక పరామర్శ జరిగింది. కవిత్వమే సినారె చిరునామా కనుక అన్ని కవితలకూ ఈ పేరు సరిపోతుందంటూ ఒక మొక్క, వీధి, బహురూపుల సంస్కృతి, సముద్రం చావదు, వెలుగంటే విముక్తి, జోహారు, రుధిర శ్వాస, మట్టిగుడ్లు, బొట్లు, నిన్నటి ప్రశ్న, బొగ్గు పలక, బుడతలొస్తున్నారు వంటి పలు ఖండికలను విశ్లేషించి చూపారు. ప్రగతివాద అభ్యుదయ కరమార్గానికి అద్దంపట్టే ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఆలోచన వ్యాస సంపుటిపై ఎస్వీ ఆలోచనాధార – ఆలోచనాత్మకం అన్న వ్యాసం ప్రజా కళారూపాలు, సాహిత్యం, ప్రజా ఉద్యమాల ప్రాధాన్యాన్ని, ప్రాభవాన్ని, రాయప్రోలు, గురజాడ వంటి కవుల కృషి, తేడాలను విశ్లేషించింది. గురజాడ – భిన్న పార్శ్వాలు అన్న వ్యాసంలో వందేళ్ల ముందు చూపు కలిగిన రచయితగా ఆయన రచనల్లోని కొత్తదనం, కొత్త కోణాలను వెలికితీస్తూ ఏయే సాహిత్యాల నేపథ్య ప్రభావం ఆ రచనలపై పడిందో సూచించారు. కన్యాశుల్కం నాటకం, దిద్దుబాటు కథ, మెటిల్డా, సంస్కర్త హృదయం వంటి కథలను విశ్లేషించి గురజాడ జీవించిన కాలం పాతకూ కొత్తకు మధ్య సంఘర్షణ కాలమని చెప్పారు.

కొడవటిగంటి కుటుంబరావు గల్పికలు – సామాజిక సమస్యలు అన్నవ్యాసంలో హేతుబద్ధంగా, తార్కికంగా ఆయన రాసిన 73 గల్పికలను ప్రస్తావించారు. గల్పికలలో ప్రదర్శితమైన అవినీతి, అనైతికత, మూడభక్తి, కుటుంబ అనుబంధాలు, సంబంధాలు, స్వార్థం, అహంకారం, అవినీతి, కీర్తికాంక్ష, ధనవ్యామోహం, రాజకీయాల వంటి అంశాలతో హాస్యం, వ్యంగ్యాన్ని జోడిస్తూ సామాజి స్పృహను కుటుంబరావు ఎలా కనబరిచారో తెలిపారు. కవిరాట్టు, దేవుడు, సైతాను, ఆఫీసులో అల్లరి, విప్లవకారుడు, దేవుడున్నాడు, నిప్పులాంటి వాడు, పందికొక్కులు వంటి గల్పికలను పేర్కొన్నారు. స్పష్టత, సూటిదనం కలిగిన కుటుంబరావు గల్పికలను నిశితంగా విశ్లేషించి వ్యాఖ్యానించారు. వేయి పడగలు – మానవ సంబంధాలు వ్యాసంలో విశ్వనాథ సత్యనారాయణ విస్తృతమైన సమాజ జీవితాన్ని ప్రతిబింబింపజేసిన తీరును వెల్లడించారు. వేయి పడగలులోని ఇంగ్లీషు విద్యావ్యాప్తి, వైరుధ్యాలు, ప్రకృతి, మనుషుల మధ్య విడదీయరాని అనుబంధం, ఆధునికత, ప్రాచీనతకు మధ్య సంఘర్షణ వైరుధ్యం, విభిన్న మనస్తత్వాలు కలిగిన మానవులు ఇవన్నీ కలిస్తేనే వేయి పడగలు అన్న విశ్లేషణను తెలిపారు. వేయి పడగలు నవలలోని మానవ సంబంధాలను, సమాజ పరిస్థితులను స్పష్టంగా చూపారు.

ఊప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్లిన మొట్టమొదటి తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయమ్మ గురించి ఉన్న వ్యాసంలో ఆమెలోని జాతీయ భావాలు, దేశభక్తిని వెల్లడించారు. స్వాతంత్య్ర పోరాట యోధురాలిగా, మహిళగా లక్ష్మీబాయమ్మ అందించిన స్ఫూర్తిని భావితరాలకు తెలియజెప్పడం జరిగింది. లక్ష్మీబాయమ్మ జీవితంలోని అనేక సంఘటనలను వివరిస్తూ గాంధీజీ సత్యాగ్రహంలో పాల్గొన్న సంఘటనలను ప్రస్తావించారు. జైలు జ్ఞాపకాలు – అనుభవాలు రచన ద్వారా తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేసి స్త్రీశక్తికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మహిళగా ఆమెను చూపారు. చేకూరి రామారావు (చేరా) వ్యాసం ఆయనలోని నిబద్ధతతో కూడిన నిమగ్నతను వివరించింది. కళింగాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మాండలికాల స్థూల విభజన చెబుతూనే ప్రాంతీయ అస్తిత్వవాద సాహిత్యంలో ప్రతిఫలించిన మాండలికాలను వివరించారు. గురజాడ, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, కె సభా, దేవేంద్రాచారి, వట్టికోట అళ్వారుస్వామి, సురవరం ప్రతాప రెడ్డి, అల్లం రాజయ్య, బిఎస్‌ ‌రాములు, తమ్మేటి రఘోత్తంరెడ్డి వంటి వారి రచనలలోని ప్రాంతీయ అస్తిత్వవాదంలోని మాండలికాలను విశ్లేషించారు. భాషను, యాసను సజీవంగా ఉంచడానికి మాండలికాల తోడ్పాటును తెలిపారు.

దళిత కవిత్వం – ఐక్యత అన్న వ్యాసం వైరుధ్యాల్ని తెలుసుకోవడం అనివార్యమూ, అవసరమూ అని చెప్పింది. 1915లో మంగిపూడి వెంకటశర్మ నిరుద్ధభారతం మొదలుకొని కుసుమ ధర్మన్న కవి, జాలా రంగస్వామి, గుర్రం జాషువా, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్‌, ‌సతీష్‌ ‌చందర్‌, ‌విజయలక్ష్మి, ఎండ్లూరి సుధాకర్‌, ‌నాగప్ప గారి సుందర్రాజు, కనకయ్య వంటి వారి రచనలు, వర్గీకరణ, ఏకీకరణ, మాదిక్కేక, దండోరా సంపుటాలను విశదంగా వెల్లడించారు. మనుషులలో చైతన్యం పెరిగే కొద్దీ సంఘర్షణ దిశగా ముందుకు సాగాలని చెప్పారు. ఆధునిక సాహిత్యం – విభిన్న కోణాలు అన్న వ్యాసం హేతువాదం, అభ్యుదయవాదం విప్లవవాదం, స్త్రీవాదం, ప్రాంతీయ అస్తిత్వ వాదాలను ప్రస్తావించింది. నీలిమేఘాలు కవితా సంపుటిని భావ ప్రకటనా వేదికగా చూపి విమల సౌందర్యాత్మక హింస, రేవతీదేవి దూరం వంటి కవితలను ఉదాహరించి స్త్రీవాద కవిత్వం వస్తు, భాషావైవిద్యాలు, అభివ్యక్తిలో కొత్తదనాలను తెలిపింది. అలాగే ఇతర వాదాలను కూడా వివరించింది. ప్రపంచీకరణ నేపథ్యంలో కథ అన్న వ్యాసం తెలుగు కథను రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల వారీగా చూపి ఆయా ప్రాంతాల జీవన నేపథ్యాన్ని, సమస్యలను, సామాజికాంశాలను తెలిపారు. ప్రపంచకీరణ నేపథ్యంలో విరివిగా విస్తృతంగా కథలు వస్తున్నాయంటూ తెలిపారు. పెద్దింటి అశోక్‌కుమార్‌ ఊటబాయి కథాసంపుటిలో అంతరించిపోతున్న కులవృత్తులు ప్రధానంగా కథల్లో కనిపించిన తీరును చూపారు. ప్రపంచీకరణలోని సరకుల వ్యామోహాన్ని తెలిపే కాగుబాత్త కథ, ఐటి కప్ప కథ, కాలువ మల్లయ్య, బెజ్జారపు రవీందర్‌ ‌వంటి రచయితల కథలను ప్రస్తావించారు.

దృక్పథ స్పృహతో సమగ్ర, నిర్దిష్ట, నిర్దుష్టతతో ప్రతిఫలించే కృషిని ఈ వ్యాసాలలో కనబరిచేందుకు డాక్టర్‌ ‌రజని ఎంతో శ్రమించారు. లోతైన అన్వేషణ జరిగాక విషయాన్ని కూలంకుశంగా ప్రవచిస్తున్న రీతిలో వ్యాసాల్ని అకడమిక్‌ ‌దృష్టితో జాగ్రత్తగా మలిచారు. పరిశోధకులు ఉదాహరించేందుకు ఉపయోగపడే పలు విశేష విషయాంశాలను ఈ వ్యాసాలలో చేర్చారు. ఆసక్తి, శక్తి, అభిరుచి, దృక్పథం కలగలసిన సమగ్ర వ్యాస విశేషంగా సాహిత్య విమర్శలో ఈ పుస్తక ప్రయత్నం నిలిచిపోతుంది.
– తిరునగరి శ్రీనివాస్‌, 8466053933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *