రాహుల్‌ న్యాయయాత్ర బిజెపి విజయపరంపరను అడ్డుకోగలదా?

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండవ విడుతగా చేపట్టిన ‘భారత్‌ న్యాయ యాత్ర’ కాంగ్రెస్‌ కష్టాలను గట్టెక్కిస్తుందా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువొస్తుం దా అన్న విషయంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతున్నది. ఇంతకు క్రితం రాహుల్‌ గాందీ చేపట్టినó ‘భారత్‌ జోడో యాత్ర’ రాజకీయంగా ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదన్న వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే  ఇటీవల కాలంలో  జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే అందకు నిదర్శనమన్న   విమర్శలున్నాయి.. అతికష్టంగా గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌, తాజాగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వంలోకి రాగలిగింది. అదే సమయంలో  మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలను కోల్పోయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఇదిలాఉంటే  ప్రజల్లో మాత్రం ఇంకా తమ పార్టీపట్ల విశ్వాసం సన్నగిల్లలేదంటోంది కాంగ్రెస్‌. గత సెప్టెంబర్‌లో కన్యాకుమారి నుండి కాశ్మీర్‌ వరకు రాహుల్‌ జరిపిన పాదయాత్ర మంచి ఫలితాలిచ్చాయనడానికి కర్ణాటక, తెలంగాణ ఎన్నికలే నిదర్శనమంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు.  రాహుల్‌ పాదయాత్ర దేశంలోనే సంచలనంగా మారిందని, దేశ ప్రజల్లో ఆయన పట్ల  ఆదరణ  పెరిగిందంటున్నారు.  ఆ ఆదరణే పదేళ్ళపాటు అధికారానికి కాంగ్రెస్‌ దూరంగా ఉన్నప్పటికీ  రెండు రాష్ట్రాల్లో తమ పార్టీని ప్రజలే అధికారంలోకి తీసుకువొచ్చారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  వాటికి తగ్గట్లు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రకటించిన సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షించడం కూడా ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  కాగా  రాహుల్‌ ఎన్ని పాదయాత్రలు చేసినా ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడేవేమీలేదని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా విమర్శిస్తున్నది. గాంధీ కుటుంబం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరిగినా అతికష్టంగా రెండు రాష్ట్రాలను గెలుచుకోగలిగాయంటున్నారు.

బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకున్న నేపథ్యంలో మోదీ విజయపరంపరను ఎవరూ అడ్డుకోలేదని, ఈసారి మోదీయే  హ్యాట్రిక్‌ ప్రధానిగా నెగ్గుతారని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.  ఏదియేమైనా రాహుల్‌ రెండవ భారత్‌ జోడో యాత్రకు మాత్రం ఆ పార్టీ అధిష్టాన వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘భారత్‌ న్యాయ యాత్ర’పేరున జనవరి 14 నుండి ఈ యాత్ర కొనసాగనుంది. సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకు ముందు చేపడుతున్న ఈ యాత్ర రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతుందనే అనుకుంటున్నారు. ఎందుకంటే రాహుల్‌ గత యాత్ర అంతా భారత్‌ను సంఘటితం చేయాలన్న సంకల్పంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన వివిధ వర్గాలు, మతాల వారినందరినీ ఏకతాటిపైకి తీసుకువొచ్చేందుకు తన వంతు కృషిచేసిన వాస్తవాన్ని చూశాం. ఆ యాత్ర తనకు దేశ పరిస్థితులపట్ల అవగాహనను పెంచిందని చెప్పిన  రాహుల్‌ యాత్ర ఆసాంతం ముఖ్యంగా మూడు అంశాలపైనే  దృష్టి సారించారు. దేశంలో విచ్చిన్నమవుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపైన ఆయన ప్రజల్లో అవగాహన తీసుకురావాడానికి ప్రయత్నించారు. తన యాత్ర పొడడునా అవే అంశాలను ఆయన ప్రస్తావించారుకూడా. అదే విధంగా రెండవ విడుత యాత్రలోకూడా  అవే అంశాలను  తీసుకుని వాటికి న్యాయం జరుగాలని మరోసారి ప్రజలముందుకు రాబోతున్నాడు. అలాగే దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, యువత భవిష్యత్‌,  సమాజాన్ని విడగొట్టే చర్యలను వ్యతిరేకించే నినాదంతో ఈ యాత్రను కొనసాగించేందుకు రాహుల్‌ సిద్దమవుతున్నారు.

భారత్‌ జోడో యాత్ర 136 రోజుల పాటు కన్యాకుమారి నుండి జమ్మూ, కాశ్మీర్‌ వరకు సాగింది. ఆ యాత్ర పన్నెండు రాష్ట్రాలగుండా సుమారు నాలుగు వేల  కిలోమీటర్ల పొడవున సాగింది. ఈ యాత్రలో రాహుల్‌కు విశేష ఆదరణ  లభించిన విషయం తెలిసిందే. అనేక మంది కాంగ్రెస్‌ అభిమానులు, రాహుల్‌కు మద్దతివ్వాలనుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపార దిగ్గజాలు ఆయనతోపాటు పాదయాత్ర సాగించేందుకు ముందుకు రావడం చూశాం. కాగా జనవరి 14న మణిపూర్‌లోని ఇంఫాల్‌లో భారత్‌ న్యాయ యాత్ర పేర రెండవ విడుత భారత్‌ జోడో యాత్రకు రాహుల్‌ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ యాత్రలో కూడా ప్రధానంగా మహిళలు, యువకులు, అణగారిన వర్గాలవారి సాధకబాధలను విచారిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ యాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరవై ఏడు రోజులపాటు జరిగే ఈ యాత్ర తూర్పు నుండి పడమరలోని పద్నాలుగు రాష్ట్రాల్లోని 85 జిల్లాలనుండి సాగనుంది. సుమారు 6,700 కిలోమీటర్ల పొడవున సాగే ఈ యాత్రలో 350 లోకసభ స్థానాలు కలువనున్నాయి. లోకసభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలను కలుపుకుని వెళ్ళే ఈ యాత్ర ప్రభావం ఆయా రాష్ట్రాలపైన ఏమేరకు ప్రభావాన్ని చూపించనుందన్న చర్చ జరుగుతున్నది.
 -మండువ రవీందర్‌రావు
సీనియర్‌ జర్నలిస్ట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *