ఇంత బలుపు ఎందుకు
తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..?
పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : రాహుల్ గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్ ఆ కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి ఉండటానికి ఇళ్ళు లేని పరిస్థితి ఉంటే, పదేళ్లలో ఫామ్ హౌజ్‌లు కట్టుకున్న చరిత్ర..ఇంత బలుపు ఎందుకు కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్ రూమ్‌లు కడుక్కుని బతికేవాడివంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేస్తే నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వొచ్చినా తిరస్కరించారని తెలిపారు. పెద్దపల్లిలో గురువారం నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ…సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా నో, బిర్లా మందిర్ వద్దో బిచ్చం అడుక్కునేదని, ఇవాళ లక్ష కోట్లు, వేలాది ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ చెప్పా•ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిదని, హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేసుకున్నది కేసీఆర్ కుటుంబం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 60 ఏండ్లు దేశాన్ని ఏలిన గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు..కానీ పదేళ్లు ప్రభుత్వంలో ఉండి వందల ఏకరాలు కొన్నది..ఫామ్ హౌస్ కట్టుకున్నది నువ్వు కేటీఆర్ అని విమర్శిస్తూ ఆయనకు అంత బలుపు పనికి రాదన్నారు. రాహుల్ గాంధీని నువ్వేవరు అని అడిగేంత బలుపు అవసరమా అంటూ…రాహుల్ గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంత బలుపు ఉన్న నాయకులు అవసరమా? మనకు అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్టం ఇచ్చిన రాహుల్ గాంధీ ఎవరు అని అడుగుతున్నారు సన్యాసులంటూ విమర్శించారు. రాహుల్ కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసిందని, కెసిఆర్ 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి.. రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, రాహుల్ ఎవరు అనే అర్హత వారికి ఎక్కడిదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పందికొక్కుల్లా లక్షల కోట్లు దోచుకున్న వారు రాహుల్ గాంధీ ఎవరని ప్రశ్నిస్తారా? అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారని, ఉద్యోగాలు రాక ఆడ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే అవహేళన చేస్తున్నారని, అట్లాంటి కేసీఆర్ మరో సారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఏం చేసిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, నెట్టెంపాడు వంటి భారీ ప్రాజెక్టులు, హైదరాబాద్‌కు ఐటీ ప్రాజెక్టులు, విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసింది ఎవరని ప్రశ్నించారు. తెలంగాణకు జవహార్ లాల్ నెహ్రూ స్వాతంత్య్రం తెచ్చారని, రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేశారని, దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని, యువతకు 18 ఏళ్లకే వోటు హక్కును కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రకటించిందని, అధికారంలోకి రాగానే అమలు చేసి చూపిస్తామన్నారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా రూ. 500కే సిలిండర్ ఇస్తామని, ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షల ఆర్ధిక సాయం చేస్తామని, రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామని, రైతు కూలీలకు రూ.12వేలు అందించనున్నామని, పెన్షన్ రూ.4వేలు అందించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రూ. 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చామని రేవంత్ వివరించారు. ఇవన్నీ ఇవ్వాలంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వొచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి విజయరమణారావును 50 వేల మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి వోటర్లకు విజ్ఞప్తి చేశారు





