రాష్ట్రంలో మోగిన బడి గంట

రెండేళ్ల తరవాత మళ్లీ విద్యార్థుల బడిబాట
మన ఊరు-మన బడి కింద పాఠశాలల ముస్తాబు
పుస్తకాలు అందక అంతటా ఆందోళన
పిల్లలకు చాక్లెట్లతో స్వాగతం పలికిన మంత్రి సబిత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌వేసవి సెలవుల అనంతరం బడిగంట మోగింది. సోమవారం నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ ‌కావడంతో పిల్లలు బడిబాట పట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌స్కూళ్లన్నీ తెరుచుకున్నాయి. వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. కొత్త ఆశలు, క్రొంగొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగు పెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. సెలవులకు స్వస్తి పలికిన విద్యార్థులు పేరెంట్స్‌కు టాటా చెబుతూ స్కూల్‌లో అడుగుపెట్టారు. సుమారు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. కోవిడ్‌ ‌కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవక పోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా..ఆ ఊహాగానాలకు విద్యాశాఖ తెరదించింది. 13వ తేదీ నుంచే యథావిధిగా పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని స్పష్టం చేసిన మేరకు స్కూళ్లు తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ, ఎయిడెడ్‌ ‌స్కూళ్లలో 26లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. రెసిడెన్షియల్‌, ‌కస్తూరిబా బాలికల విద్యాలయాలు, మోడల్‌ ‌స్కూల్స్‌లో మరో 2.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇక 10,800 ప్రైవేటు స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులున్నారు. మొత్తంగా 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల బాట పట్టారు. కొరోనా ప్రభావం కారణంగా రెండేళ్ల తర్వాత ఈ విద్యా సంవత్సరం లోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతుండటం గమనార్హం.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ’మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే సర్కారీ బడుల్లో 1 నుంచి 8 తరగతులకు ఆంగ్ల బోధన మొదలవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు 80 వేల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేసింది. వారు ఇంగ్లిష్‌ ‌మీడియంలో బోధన చేయనున్నారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్‌ ‌రెండు మాధ్యమాల్లోనూ ఉండేలా సిద్ధం చేశారు. పుస్తకం బరువు పెరగకుండా.. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌?1 ‌వరకూ ఒక భాగం, ఎస్‌ఏ?2 ‌వరకు మరో భాగంగా విభజించారు. ఇంగ్లిష్‌ ‌మీడియం నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పటికీ పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కొత్తగా ఇంగ్లిష్‌ ‌మీడియం కోసం రెండు భాషల్లో ముద్రించిన పుస్తకాలు స్కూళ్లకు సరిపడా చేరలేదు. 2.10 కోట్ల పుస్తకాలు అవసరంకాగా.. ఇప్పటికీ 20 లక్షల పుస్తకాలే ముద్రించినట్టు సమాచారం. కాంట్రాక్టర్లు ఎక్కువ ధర కోట్‌ ‌చేయడంతో టెండర్ల పక్రియ తిరిగి మొదలుపెట్టడం, కాగితం కొరత ఆలస్యానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పుస్తకాలు అందుతాయని అంటున్నా.. మరో నెల వరకూ వొచ్చే అవకాశం కన్పించడం లేదు. ఇక గత ఏడాది సర్కారీ స్కూళ్లలో యూనిఫారాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఈ సమస్య కన్పిస్తుంది. 1.5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం కాగా.. ఇప్పటివరకు 60 లక్షల మీటర్లే కొనుగోలు చేశారు. మిగతాది కొని, కుట్టించి, పంపిణీ చేయాలంటే సమయం పట్టవొచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్యగానే ఉంది. బోధనేతర సిబ్బందీ సరిగా లేరు. 2019-20 విద్యా సంవత్సరంలో 21 వేల మంది విద్యా వలంటీర్ల సేవలు తీసుకున్నారు. కోవిడ్‌తో గత ఏడాది వీరి సేవలు నిలిపివేశారు. మళ్లీ వారిని తీసుకుంటే కొంతవరకు సమస్య తీరుతుందనే అభిప్రాయాలు వొస్తున్నాయి.

పిల్లలకు చాక్లెట్లతో స్వాగతం పలికిన మంత్రి సబిత
స్కూల్లు తెరవడంతో మొదటి రోజు స్కూల్స్‌కు పిల్లలు ఉత్సాహంగా వొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నగరంలోని మెహబూబియా స్కూల్‌కు వొచ్చిన మంత్రి… స్కూల్స్ ‌రీ ఓపెన్‌ ‌సందర్భంగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్‌ ‌కమ్‌ ‌చెప్పారు. అనంతరం సబితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ…మన ఊరు మనబడి కింద స్కూళ్లను డెవలప్‌ ‌చేస్తున్నామన్నారు. 9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇంగ్లీషు మీడియా మొదలు పెట్టామని… ప్రైవేట్‌ ‌స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ బడులు ఉంటాయన్నారు. గవర్నమెంట్‌ ‌స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియా ప్రవేశ పెట్టిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. గురుకులాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గురుకులాలల్లో సీటు కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు. బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని, లోపాలు వెతికే ప్రయత్నం చేయవద్దని అన్నారు. మాటలు మాట్లాడకుండా ప్రభుత్వం చేస్తున్న పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతియేటా మాదిరిగా జులై మొదటి, రెండో వారంలో పుస్తకాలు, యూనిఫార్మస్ అం‌దిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *