మహిళాసాధికారత పరిపూర్ణం కావాలి!

మహిళాలోకం ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న సుందర స్వప్నం
అసమానతలను తొలగించిన నాడే ఆచరణ సాధ్యం
సమాజ సహకారం మహిళాభ్యున్నతికి సోపానం

సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదలైన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు..చేస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళా సాధికారతలో ప్రస్తావించారు. స్వశక్తిపై విశ్వాసాన్ని అభివృద్ధిపరచడం కూడా సాధికారతలో కలిసి ఉంటుంది. మహిళాలోకం ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న సుందర స్వప్నం  మహిళాసాధికారత. నడుస్తున్న చరిత్రలో సందర్భసహిత నినాదమిది. మహిళాసాధికారత పరిపూర్ణం కావాలి. అందుకు అవిశ్రాంత కృషితో అడుగులు వేయాలి.  సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు మానసికంగా, భౌతికంగా సంతోషంగా ఉన్నప్పుడే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. అప్పుడే సమాజం కూడా పటిష్టమవుతుంది.  ఆడపిల్ల జాతి గౌరవానికి ప్రతీక. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు.

ఇటీవల మనం వింటున్న భ్రూణ హత్యలు చట్టరీత్యా నేరం. ఆమెను మనమందరం రక్షించుకుందామన్న సంకల్పం మన మనస్సుల్లో మెదలాలి.  ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందన్న మాట నిజమయ్యే తరుణం ఇకన్కెనా ఆసన్నం కావాలి.  మన సమాజంలో ఎన్నో అసమానతలు. ఇది మహిళారంగానికీ వర్తిస్తోంది. లింగ వివక్ష కారణంతో ఆమె ఛీత్కారాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పనిచేసేచోట, ఉద్యోగ వ్యవస్థలో ఇది మామూలుగా జరుగుతున్నదే. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఈ వివక్షపై ఎన్నో సంఘటనలు, అత్యాచారాలు, అవమానాలు.. చివరికి హత్యాచారాలు ఎక్కడోచోట ఉండటం మనం ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో వింటూనే వున్నాం.. కంటూనే ఉన్నాం. వాస్తవానికి ఇవి రూపుమాపేలా వ్యవస్థీకృత మార్పులు రావాల్సి ఉంది. పదున్కెన చట్టాలు అమలుతోపాటు మనుషుల ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, అడుగుజాడల్లో మార్పురావాలని అనుకోవడం అభిలషణీయం. లక్ష్యసాధనలో మహిళలు ముందుంటున్నారని అంతర్జాతీయ నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నాయి. మహిళల్లో అంతర్లీనమైన సృజనాత్మకతను వెలికితీసే చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది. ఈ దిశగానే ప్రభుత్వాలు, పాలకులు చొరవ చూపినప్పుడే ఫలవంతవౌతుంది.  

Women empowerment must be perfect!

  సమకాలీన సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో గృహహింస సింహభాగం ఆక్రమిస్తోంది. రోజూ పత్రికల్లో, టీవీల్లో ఎక్కడోచోట వీటిపై  వార్తలు వస్తూనే ఉన్నాయి. లింగ వివక్ష, ఆర్థిక అసమానతలుసహా అనేక అంశాలు ముడిపడి ఉన్నందున ఈ తీవ్ర సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలన్నది ఆ సంఘాల ఆకాంక్ష. తొలుత ఈ గృహహింసపై కుటుంబపరంగానే ఆదిలోనే చరమగీతం పలకాలని మహిళా నిపుణులు పేర్కొంటున్నారు. సమాజ సహకారం మహిళాభ్యున్నతికి సోపానంలాంటిది. మన చట్టసభల్లో పురుషులకు దీటుగా ప్రాతినిధ్యం కొరవడటం ప్రతిబంధకమవుతోంది. వారి భాగస్వామ్యం, వాయిస్‌ పెరిగితేనే ఫలవంత చర్చకు దారితీస్తుంది. మహిళలకు రాజకీయాధికారం వస్తే సమాజం ఆర్థికంగా, విద్యాపరంగా మరింత ఎదుగుతుంది. చట్టసభల్లో ప్రతిచోటా వారికున్న రిజర్వేషన్లు పెంపుదల, ఆచరణాత్మక చూపటం పాలకులు, ప్రభుత్వాల సంకల్పమైతే మహిళాభ్యుదయం ద్విగుణీకృతమవుతుంది. అలాగే ఆర్థికంగా సమాన వాటాను దక్కించుకునేందుకు మహిళాలోకం ప్రయత్నించాలి. వీటన్నింటికితోడు మహిళలు వారికున్న హక్కులపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాల్సి ఉంది.  చట్టాలతోపాటు అసలు మహిళలపై జరిగే అకృత్యాలు, నేరాలపై ఉన్న చట్టాలు, సెక్షన్లపై ఇప్పుడిప్పుడే పత్రికలు, ప్రసారమాధ్యమాల ద్వారా ఎంతో తెలుసుకోగలుగుతున్నారు. అవసరమైనచోట, అవసరమైన సందర్భంలో తమ శక్తియుక్తులను మహిళలు ప్రదర్శించాలి. తమ గౌరవాన్ని కాపాడుకోవడంతోపాటు తెగింపుప్రదర్శన ఎల్లప్పుడూ వారిని కంటికి రెప్పలా కాపాడుతుంది. సమాజంలో ఎదురవుతున్న అకృత్యాలు, ఆగడాలను ధ్కెర్యంగా మహిళలు ఎదుర్కొనటాన్ని మనం చూడగలుగుతున్నాం.  

స్వీయ రక్షణతోపాటు మహిళలు తమకిష్టమైన విద్య, పరిశోధన ఇత్యాది రంగాల్లో రాణించి మేధోశక్తిని చాటాలన్నది అందరి మాట. ప్రభుత్వపరంగా మహిళల రక్షణకు, వారి అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యల్లో ఎంతో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరి ఆలోచనల్లోనూ పురోగతి కన్పిస్తోంది.  అందరూ మహిళలే నడిపే రైళ్లు, పనిచేసే రైల్వేస్టేషన్లకు శ్రీకారం చుట్టడం గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. లేచింది మహిళాలోకం అన్న చందంగా ఈ కార్యక్రమాలు రూపొందడం శుభసూచికమే. ఇక ఉద్యమాల్లో సైతం వారి భాగస్వామ్యం ఎంతో పెరగడమూ పేర్కొనదగినదే. అలాగే కోర్టులపరంగానూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడమూ మంచి పరిణామమే. గతానికి భిన్నంగా సైన్యంలో మహిళా కమాండర్ల నియామకానికి సుప్రీంకోర్టు జెండా ఊపడం వారి అభివృద్ధి దిశగా పయనించేందుకు మార్గమేర్పడిరది. సైన్యంలో మహిళా అధికారులకు కమాండర్లుగా అవకాశమిచ్చి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తద్వారా సైన్యంలో కొనసాగుతున్న లింగ వివక్షకు అత్యున్నత న్యాయస్థానం తెర దించింది.

  సమాజంలో ఉన్న అసమానతలను రుగ్మతలను తొలగించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అని మన స్మృతులు చెప్పాయి. అంటే ‘ఎక్కడ స్త్రీలకు గౌరవం లభిస్తుందో, అక్కడ దేవతలు పూజలందుకొంటారు.  ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలి.  ప్రతి మహిళా ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది. మన దేశాన్నే  మనం ఒక  స్త్రీ మూర్తీభవించిన  భారతమాతగా పేర్కొంటున్నాం.  నాడు యుద్ధ రంగంలో వీర విజృంభణ చేసిన రాణీ లక్ష్మీబాయి నుంచి నేడు ఒకే రాకెట్‌లో 104 ఉపగ్రహాలను పంపిన ఇస్రో మహిళా శాస్త్రవేత్తల  వరకు వివిధ రంగాల్లో తమకు సాటిగల వారు లేరని  మహిళలు నిరూపిస్తున్న విషయాన్ని మనం గుర్తెరగాలి.  సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లోనే కాకుండా రాజకీయాలు, కళలు, సాహిత్యం, క్రీడలు, విద్య మొదల్కెన అనేక రంగాల్లో దేశం రాణించడానికి, అభ్యున్నతి చెందడానికి భారతీయ మహిళలు అద్భుతమైన కృషి చేశారు. ఆథ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా  స్త్రీలను  బలోపేతం చేయడమనే విషయాలు మహిళా సాధికారతలో ప్రస్తావించారు.  స్వశక్తిపై విశ్వాసాన్ని అభివృద్ధిపరచడం కూడా సాధికారతలో కలిసి ఉంటుంది. 1990వ సంవత్సరంలో విదేశీ సంస్థల విరాళాల నుంచి పొందిన నిధుల ద్వారా మహిళల దృష్ట్యా పనిచేసే నూతన స్వచ్ఛంద సంస్థ ఏర్పర్చబడిరది.  

స్వయం ఉపాధి మహిళా సంఘాలు (ఎస్‌.ఇ.డబ్ల్యు.ఎ-సేవా) వంటి స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు భారతదేశపుస్త్రీల హక్కులపై ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. నర్మదా బచావో ఆందోళనలో మేధా పాట్కర్‌లాగా స్థానిక ఉద్యమాలలో చాలామంది మహిళా నాయకురాళ్లు ఉద్భవించారు. 2001 సంవత్సరాన్ని భారతదేశం మహిళా సాధికారతా సంవత్సరం (స్వశక్తి)గా ప్రకటించింది. స్త్రీ స్వశక్తిపై జాతీయ విధానం (పాలసీ) 2001 సంవత్సరంలో జారీ అయింది. భారతదేశపు మహిళా హోదా గృహహింస నిరోధ చట్టం, మహిళా సంక్షేమ పథకాలు, ఎన్నో పథకాలు స్త్రీలకి రక్షణగా ఉన్నాయి. ఒక చదువుకున్న తల్లి వంద మంది ఉపాధ్యాయులతో సమానం. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం, ఒక స్త్రీ తన ఇంటితో పాటు సమాజాన్ని, దేశాన్ని అభివృద్ధి చేస్తుంది.స్త్రీలు ప్రతి రంగంలో అగ్రస్థానాలలో నిలిచి మంచి నిర్వాహకులు అని పేరుప్రతిష్ట తెచ్చుకున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అని ‘స్త్రీ’’ని ఉపనిషత్తులో అందరి కంటే అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా అభివర్ణించారు.

   వేదకాలం నుండి సమాజంలో పురుషులకు స్త్రీ పట్ల పూజ్యభావం అమితంగా ఉన్నది. నాటి కాలంలో కూడా స్త్రీలు పురుషులతో సమానంగా విజ్ఞాన మార్గంలో, బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించే వారు కాబట్టే నాటి కాలమే స్త్రీని పురుషుడు అమితంగా గౌరవించేవారు.   ఏ దేశంలో అయితే మహిళలు సర్వాంగ సుందరంగా ఆభరణాలతో అలంకరించుకుని పురుషుని సహాయం, తోడు లేకుండా రహదారులలో, వీధులలో ధ్కెర్యంగా ఏ భయ భ్రాంతులు లేకుండా తిరగగలదో ఆ దేశం సుపరిపాలన కలది అని పంచమ వేదమైన మహాభారతం చెప్పింది. వేదకాలం నుండి స్త్రీని అత్యధికంగా గౌరవిస్తూనే స్త్రీ రక్షణ కొరకు అనుక్షణం ఆరాటపడుతూనే ఉంది. యావత్‌ సమాజంలో నేటికీ కొనసాగుతూనే ఉంది. గాంధీమహాత్ముడు కూడా ఈ మాటే అన్నాడు. స్త్రీకి రక్షణ ఉంటే లోకానికే రక్షణ కలుగుతుందని చెప్పాడు. అనాదిగా కొనసాగుతున్న పితృస్వామ్య వ్యవస్థ మహిళలను శారీరకంగా, మానసికంగా బలహీనులుగా మార్చి లింగపరమైన అసమానతల సమాజంగా మార్చడం వల్లనే మహిళలపై వివిధ రకాల దాడులు జరుగుతున్నాయని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

న్కెతిక విలువల పతనం చట్టంపై అవగాహనారాహిత్యం ల్కెంగిక వేధింపులు, బెదిరింపులు సమాజంలో మార్పు, కేవలం చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పన ద్వారా మహిళా రక్షణ కలిగించవచ్చు.   ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో ముందు మార్పు రావాలి. చట్టాల ద్వారా మార్పు రాదేమో కానీ అభ్యుదయం జరుగుతుంది. ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధిగా అమలు చేయాలి. అప్పుడే మహిళా సాధికారత సిద్ధిస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా కేంద్రం, రాష్ట్రాలు, పాలకులు, సమాజం అంతా కలిసికట్టుగా వ్యవహరించి మహిళల అభ్యున్నతికి పాటుపడాలి. గౌరవప్రదమైన గుర్తింపు సమానావకాశాలు ప్రాతిపదికన చర్యలుండాలని అందరి అభిలాష. వివక్షను రూపుమాపేందుకు వినూత్న చర్యలు మరిన్ని తీసుకోవాలని మహిళాలోకం ఆశిస్తోంది. జాతి నిర్మాణంలో వారిని భాగస్వాముల్నిచేస్తే అభివృద్ధి ఉభయతారకవౌతుంది.

-వర్ష మాయ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *