- యాత్రలో పాల్గొన్న మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ
- రేపు మధ్యప్రదేశ్‌లోకి…
- కలకలం రేపుతున్న ఇండోర్‌లో బాంబు దాడితో హత్య చేస్తామన్న బెదిరింపు లేఖ
ముంబయి, నవంబర్ 18 : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నవంబర్ 7 నుండి మహారాష్ట్రలో కొనసాగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు పాదయాత్ర అకోలా జిల్లా బాలాపూర్ నుండి ప్రారంభించి బుల్దానా జిల్లా షెగావ్ చేరుకోగా అక్కడ మహాత్మా గాంధీ ముని మనవడు, రచయిత, సామాజిక కార్యకర్త తుషార్ గాంధీ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసారు. కాగా తుషార్ పాదయాత్రలో పాల్గొనడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా పేర్కొంది. ఆనాడు ఎలాగైతే క్లిష్ట పరిస్థితుల్లో జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ కలిసి దేశాన్ని ఎలా రక్షించారో అదే విధంగా వారి ముని మనవల కలయికను పోలుస్తూ వంశపారంపర్యంగా కొనసాగుతున్న సందర్భంగా పేర్కొన్నారు. తుషార్ గాంధీ గురువారం చేసిన ట్వీట్‌లో షెగావ్ తన జన్మస్థలమని పేర్కొన్నారు. షెగావ్‌లో రాహుల్ పేరొందిన శ్రీ సంత్ గజానన్ మహరాజ్ దేవాలయాన్ని దర్శించుకున్నారు.
సాయంత్రం యాత్ర సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్ర ఇండోర్‌లో అడుగు పెట్టగానే బాంబు దాడులు చేసి రాహుల్ గాంధీని, కమల్ నాథ్‌ను హత్య చేస్తామని బెదిరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ఇండోర్‌లోని ఒక స్వీట్ షాప్ ముందు వొదిలి వేసిన లేఖ కలకలం రేపుతున్నది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సిసిటివిల ఆధారంగా లేఖను వొదిలి వెళ్లిన వ్యక్తులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సావర్కర్‌పై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల తర్వాత బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టిస్తున్నది. రేపు ఆదివారం యాత్ర మధ్యప్రదేశ్‌లో ప్రవేశించనుంది.




