ప్రచారానికి మళ్ళీ రాహుల్
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు…12 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు
(మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): తెలంగాణ మరో ఎన్నికకు సిద్ధ్దమవుతున్నది. ఏకంగా ప్రభుత్వాన్నే మార్చిన డిసెంబర్ 3 ఎన్నికల ఫలితాలు వెలువడి వారంరోజులు కావస్తుండగా, మరో కీలక ఎన్నికలకు రాజకీయ పార్టీల అనుబంధ, ఇతర కార్మిక సంఘాలు సిద్ధ్దమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు పదమూడు కార్మిక సంఘాలు పాల్గొనున్నాయి. వాటిల్లో ప్రధానంగా టిబీజీకేఎస్, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ, సీఐటియూ, హెచ్‌ఎంఎస్, ఇప్టూ లాంటి సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు ఈ నెల 27న జరుగనున్నాయి. వాస్తవంగా శాసనసభ ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే సింగరేణి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడమైంది. శాసనసభ ఎన్నికలకు ముందుగానే ఈ ఎన్నికల నిర్వహించేందుకు తేదీలు ఖరారు అయినాయి. అయితే శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ ఎన్నికలను వాయిదా వేశారు.
అయితే ఈ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ, గుర్తుల కేటాయింపులు కూడా జరిగిపోవడంతో ఇక ఎన్నికలే తర్వాయిగా మిగిలిపోయింది. ఈ ఎన్నికల విషయంలో హైకోర్టు ఆదేశాలమేరకే వాయిదా వేసిన అనంతరం ఈ నెల 27వ తేదీని ఖరారు చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సింగరేణిలో ఏడవ సారి జరుగబోతున్న ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీబీజీకేఎస్, కొన్ని జాతీయ కార్మిక సంఘాల మధ్యనే పోటీ నెలకొని ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ మధ్య ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పొత్తు కుదిరినప్పటికీ వీటి అనుబంధ కార్మిక సంఘాలైన ఎన్‌ఐటీయూసీ, ఏఐటీయూసీలు వేర్వేరుగానే ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, 2017 సెప్టెంబర్ 5న జరిగిన ఎన్నికల్లో నాటి అధికార బిఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టిబీజీకేఎస్) గుర్తింపు పొందింది. సింగరేణి పరిధిలోని 11 ఏరియాల్లో తొమ్మిది ఏరియాల్లో తెలంగాణ బొగ్గుగని కార్మికులు గుర్తింపు తెచ్చుకోవడమైంది. కార్మికులకు సంబందించిన పలు డిమాండ్లను ఇప్పటికే టిబీజీకేఎస్ సాధించింది. కార్మికుల ప్రధాన డిమాండ్‌లలో ఒకటైన వారసత్వ ఉద్యోగాల్లాంటి వాటిని సాధించిన ఈ కార్మిక సంఘం గత రెండు ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వొచ్చింది. వాస్తవంగా సింగరేణిలో మొదటిసారిగా 1998లొ గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఆనాడు ఎఐటీయుసీ గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2001లోకూడా ఎఐటీయుసీ గుర్తింపు పొందింది. 2003లో ఐఎన్‌టీయుసీ, 2007లో మరోసారి ఎఐటీయుసీ, 2012, 2017ల్లో టిబిజికెఎస్ గుర్తింపు పొందింది.
కాగా 2021లో జరుగాల్సిన ఎన్నికలు ఇప్పుడు 2023లో జరుగుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఈసారి కార్మికులు ఎటువైపున మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో వ్యాపించిన సింగరేణి కార్మికులు 12 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల ప్రభావం 12 నియోజకవర్గాలపైన ఉంటుండంతో రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందుకు తాజాగా ముగిసిన శాసనసభ ఎన్నికల్లోమాదిరిగానే కేంద్ర నాయకులను ప్రచారానికి దింపే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాయి. ముఖ్యంగా తాజా ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నికల్లోనైనా ఇక ఆషామాషీగా తీసుకోకుండా ఇప్పటినుండి తమ ఆధిక్యతను చాటుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.
అందుకే కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం అయిన ఐఎన్‌టియూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) విజయం సాధించేందుకు కేంద్ర నాయకులను తీసుకువచ్చే సన్నాహాలు చేస్తున్నది. తాజాగా ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు సింగేణి మ్యానిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ఐఎన్‌టియూసీ పక్షాన ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రానున్నట్లు తెలిపారు. సింగరేణి పరిధిలోని 11 ప్రాంతాలకు సంబంధించి 39వేల 748 మంది అర్హులైన కార్మికులు ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. వీరి సంఖ్యకు తగినట్లుగా సింగరేణి కార్మకులు ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులకోసం 11 ప్రాంతాలకుగాను 84 వోటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ అయిన రోజున్నే వోట్ల లెక్కింపు జరుగుతుంది. అందుకుగాను పది లెక్కింపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.




