- అందరికీ ఇళ్లు, విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ˜ జర్నలిజానికి అండగా ప్రభుత్వం
- టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి
- జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్న మంత్రి తుమ్మల
- జర్నలిస్టులకు ఔట్ సోర్సింగ్ పద్దతిలో వేతనాలివ్వాలన్న ఎంఎల్‌ఏ కూనంనేని
భద్రాచలం/ఖమ్మం, ప్రజాతంత్ర,జూన్ 20 : భావస్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో భంగం కలగదని నిర్మాణాత్మకమైన విమర్శ అవసరమని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం టియూడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మీడియా భద్రత కోసం ఒక చట్టాన్ని తీసుకరావాలనే మీడియా అకాడమి ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచనతో తాను ఏకీభవిస్తున్నానని, ఆ చట్టాన్ని తెచ్చేందకు కృషి చేస్తామని అన్నారు. పేదలందరికీ ఇల్లు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని విక్రమార్క పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల కేటాయింపు త్వరలోనే జరుగుతుందని హామీ ఇచ్చారు. జర్నలిజంలో యాజమాన్యాల ఆలోచనలు ఎలా ఉన్నా, జర్నలిస్టు ఉన్నత ఆలోచనలతో సమాజానికి మేలు చేసే వార్తలు రాయాలని అన్నారు . జర్నలిజానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, ఈ విషయంలో జర్నలిస్టులు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు.
రుణమాపీ విషయంలో అనుమానాలు, అపోహలు వద్దని, తప్పకుండా నూరుశాతం చేసి తీరతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిమతానికి అనుగుణంగా పని చేస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. తెలంగాణ వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఉద్యోగాలు తదితర సౌకర్యాలన్నీ వస్తాయని అందరూ భావించారని, అది జరగలేదని, అదే సందర్భంలో మీడియాతో సహ ప్రజాస్వామ్యంలో ప్రజల భావ స్వేచ్ఛ విధ్వంసం అయిందని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి శీల భావాలు కలిగిన ఖమ్మంలో మహాసభలు జరగడం అభినందనీయమన్నారు. అంతకుముందు ఉదయం జరిగిన సభలో ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ…జర్నలిజం కత్తి మీద సాము లాంటిదని, నీతి నిజాయితీతో పనిచేసే జర్నలిస్ట్‌లు ఉన్నారని, జర్నలిస్ట్‌లు ప్రజాహితం కోసం పాటుపడాలని, జర్నలిస్ట్‌లు దారి తప్పితే సమాజానికే ప్రమాదమని తుమ్మల హితవు పలికారు. స్వాతంత్ర పోరాటంలో పత్రికల పాత్ర మరువలేనిదని, తెలంగాణలో నిజాం రజాకార్ల దౌర్జన్యాలను పత్రికలు వెలుగులోకి తెచ్చాయని అన్నారు. కొరోనా లాంటి మహమ్మారి విపత్తు వేళ మీడియా సామాజిక బాధ్యత చరిత్రలో నిలిచిపోతుందని తుమ్మల కొనియాడారు.
సోషల్ మీడియా పెను సవాల్‌గా మారిన వేళ విశ్వసనీయతలో పత్రికల స్థానం చెక్కు చెదరలేదని అన్నారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో జర్నలిస్ట్‌లు తనకు ఎంతో సహకరించాని, ఉమ్మడి రాష్ట్రంలో..తెలంగాణలో మంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందని తెలిపారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని పేర్కొన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిష్కారం చేస్తామన్నారు. జర్నలిస్ట్‌ల పట్ల సీఎం రేవంత్ ఎంతో సానుకూలంగా ఉన్నారనీ తుమ్మల తెలిపారు. అనంతరం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..జర్నలిస్టులు గతంలో అనేక ఇబ్బందులు పడ్డారని, ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు చేపడుతుందని తెలిపారు.
అలాగే జర్నలిస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై అనేక దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఈ సభలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు మాజీ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టియుడబ్ల్యూజే (ఐజెయు) రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి రామ్ నారాయణ, నగునూరి శేఖర్, ఐజేయూ ప్రతినిధులు నరేందర్ రెడ్డి, కే సత్యనారాయణ, వివిధ జిల్లాల నుంచి వొచ్చిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జాతీయ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, కార్యవర్గం, తదితరులు పాల్గొన్నారు.





