బిఆర్‌ఎస్‌ నుంచి చేజారుతున్న మున్సిపాలిటీలు

చేజిక్కించుకోవడానికి పావులు అధికార కాంగ్రెస్‌ పావులు
అవిశ్వాసాలతో కాపాడలేక ప్రేక్షకపాత్రలో బిఆర్‌ఎస్‌ నేతలు


హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన తరవాత కాంగ్రెస్‌ మెల్లగా పార్టీ పటిష్టానికి కింది స్థాయి నుంచి పావులు కదుపుతున్నది. కింది నుంచి నరక్కుంటూ పెద్ద దెబ్బ వేసేలా చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇందుకు మున్సిపాలిటీల వ్యవహారమే నిదర్శనంగా చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఒక్కో మున్సిపాటిలీ బిఆర్‌ఎస్‌ నుంచి చేజారి కాంగ్రెస్‌ ఖాతాలో పడుతున్నాయి. ఈ పరిణామంలో రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ద్వితీయ శ్రేణి నేతల పదవులు కాపాడలేక పోతున్నారు. వారు పార్టీ మారకుండా ఆపలేకపోతున్నారు. ఫలితంగా బిఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌ బలహీనం అవుతుంది. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఇది బీఆర్‌ఎస్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గత బీఆరెస్‌ ప్రభుత్వం మూడేళ్ల పదవీకాలం అనంతరం చైర్మన్లు, వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టవచ్చన్న నిబంధనను నాలుగేళ్లకు మార్చుతూ మున్సిపల్‌ చట్ట సవరణ చేసింది. అయితే గవర్నర్‌ తమిళిసై దీనిని ఆమోదించలేదు.  కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మున్సిపాల్టీ పాలక వర్గాల్లో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమన్నది. అవిశ్వాస తీర్మానాలకు తెరలేచింది.
మున్సిపాల్టీల్లో కౌన్సిలర్ల బలాబలాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుని అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. గత నాలుగు రోజుల్లో నాలుగైదు పెద్ద మున్సిపాల్టీల్లో అధికారం చేతులు మారింది. రాష్ట్రవ్యాప్తంగా 40కిపైగా మున్సిపాల్టీల్లో చైర్మన్‌, మేయర్లు, వైస్‌ చైర్మన్లపై అవిశ్వాసం ప్రతిపాదించారు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో అప్పటి అధికార బీఆరెస్‌ రాష్ట్రంలోని 128 మున్సిపాల్టీల్లో, 13 కార్పొరేషన్లలో పాలకవర్గాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు బీఆరెస్‌ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. దీంతోపాటు సొంత పార్టీలోని అసమ్మతి కారణంగా బీఆరెస్‌ కౌన్సిలర్లు మెజార్టీగా అవిశ్వాసాలకు మద్దతునిస్తున్నారు. స్థానిక అధికారం చేతుల్లోకి వొస్తూండటంతో మున్సిపాల్టీల్లో అధికార సాధనకు పోటాపోటీ నెలకొంది. దీంతో అవిశ్వాస రాజకీయాలు జోరందుకోగా, అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లతో చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న వారు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. మూడేళ్లపాటు అధికారంలో ఉన్నవారిని చూసి తమకు కూడా అధికారం కావాలన్న లక్ష్యంతో కొందరు కౌన్సిలర్లు ఉన్నారు. మరికొందరు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి మారిపోతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఆరు మున్సిపాల్టీల్లో అవిశ్వాసాలు ప్రతిపాదించారు.
హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథార్టీ పరిధిలో మేడ్చల్‌, దమ్మాయిగూడ, గుండ్లపోచంపల్లి, ఆదిబట్ల, నాగారం, పెద్ద అంబర్‌పేట్‌, జవహర్‌నగర్‌ మున్సిపాల్టీల్లో అవిశ్వాస తీర్మానాలకు నోటీస్‌లు ఇచ్చారు. నల్లగొండ, బెల్లంపల్లి, నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పదవుల్ని కోల్పోయింది. కొన్ని చోట్ల చైర్మన్లే కాంగ్రెస్‌లో చేరిపోయి పదవులు కాపాడుకుంటున్నారు.  చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరిపోవడంతో తాత్కాలికంగా పదవీగండం తప్పింది. జమ్మికుంట, ఇల్లెందు చైర్మన్లపైన, ఆదిబట్ల చైర్‌పర్సన్‌పైన, కామారెడ్డి వైస్‌ చైర్‌ పర్సన్‌పైన అవిశ్వాసం నోటీస్‌లు ఇచ్చారు. కాంగ్రెస్‌లో గెలిచి బీఆరెస్‌లో చేరి చైర్‌ పర్సన్‌ అయిన ఆర్తిక అప్పటి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో విబేధాలతో బీఆరెస్‌ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గీయుడు నిరంజన్‌రెడ్డి ఆమెకు వ్యతిరేకంగా తన మద్దతుదారులతో కలిసి అవిశ్వాసం నోటీస్‌ ఇచ్చారు.
అవిశ్వాసం గండం గట్టేక్కేందుకు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపాల్టీ చైర్మన్‌ అంకం రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఖలీల్‌ అహ్మద్‌లపై పెట్టిన అవిశ్వాసం నాటకీయ ఫక్కీలో చివరి నిమిషంలో రద్దయ్యింది. 12 మంది కౌన్సిలర్లకుగాను 9మంది అవిశ్వాసంపై సంతకాలు చేశారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్‌ సాధించడంతో వోటింగ్‌ పక్రియ ఆఖరి క్షణంలో నిలిచిపోయింది. నల్లగొండ జిల్లా నందికొండ (నాగార్జున సాగర్‌) మున్సిపాల్టీ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం తీర్మానం వోటింగ్‌ సైతం శుక్రవారం జరుగాల్సివున్న హైకోర్టు స్టేతో అదికూడా వోటింగ్‌ రోజునే నిలిచిపోయింది. భువనగిరిలో ఈ నెల 23న అవిశ్వాసంపై వోటింగ్‌ జరుగనుంది. ఇప్పటికే కొంతమంది చైర్మన్లు హైకోర్టు స్టేలతో అవిశ్వాస గండాలను తాత్కాలికంగా అధిగమించిన నేపథ్యంలో మిగతావారు కూడా స్టేల కోసం కోర్టులకు పరుగెత్తుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *