బతుకే ఓ జాతర.
అది, మూన్నాళ్ల ముచ్చట.
రంగు రంగుల హంగులతో
ఆశలు కల్పించేటి ఓ ఆట.
అనుబంధాలు,అన్వేషణలు,
ఇబ్బడి ముబ్బడి సవాళ్ల కలయిక
కష్టసుఖాల కలబోతే జీవితం.
సమాజంలో…
నమ్ముకుని జీవించేవారు కొందరైతే,
ఆషాఢభూతులు మరికొందరు.
ప్రతి ఇంటా, ప్రతి చోటా
ఉంటారీ ఘనులు.
మాటలతో కొందరు,
చేతలతో ఇంకొందరు,
గాలాలు వేస్తారు,శూలాలు దూస్తారు.
అవసరం ఉంటేనే నీ నామ జపం
అది తీరిందంటే ఇక నీవనవసరం.
నిలువెల్లా స్వార్థం ఆవహించగా
కృతజ్ఞత స్థానంలో కృతఘ్నత.
అయినా తప్పదుగా జీవనం.
సాగనీ బతుకు…
సంధించిన బాణంలా,
దూసుకొచ్చే ఉల్కల్లా,
విధిరాతను సైతం ధిక్కరించేలా.
– వేమూరి శ్రీనివాస్, 9912128967, తాడేపల్లిగూడెం




