ప్రజాపాలన దరఖాస్తులతో దశతిరిగేనా..?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వాగ్దానాలతో ప్రజలను మెప్పించి,  అధికారం కైవసం చేసుకుంది.  దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రభుత్వం ఏర్పడిన మూన్నాళ్ళకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో  పది లక్షల వరకు ఉచిత వైద్యం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.  ఎప్పుడు ఎలాంటి విధి విధానాలను ప్రకటించకుండా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.  ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రకటించి అమలుపరచడం మంచిదే,  కానీ విధి విధానాలు లేకపోవడంతో ప్రజలలో అపోహలు ,  అనుమానాలు రేకెత్తుతున్నాయి.  దీంతో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఒక ప్రహసనంగా మారింది.  ప్రజా పాలన దరఖాస్తులలో మహాలక్ష్మి,  రైతు భరోసా,  గృహజ్యోతి,  ఇందిరమ్మ ఇండ్లు,  చేయూత పథకాల కోసం దరఖాస్తులు చేసుకోమని ప్రభుత్వం ప్రకటించింది.  ఈ పథకాలకు తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నవారే అర్హులు అని దరఖాస్తు ఫారం లో ఉన్నది.

ప్రజలు గత 9 సంవత్సరాలుగా రేషన్‌ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు.  గత ప్రభుత్వం రేషన్‌ కార్డులను ఇవ్వలేదు.  ఇప్పటి ప్రభుత్వం కూడా తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.  లేని వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని  ప్రకటించింది.  గతంలో ప్రభుత్వ ఉద్యోగులు,  భూస్వాముల వద్దనే తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి.  నిజమైన లబ్ధిదారులకు తెల్ల రేషన్‌ కార్డులు అందలేదు.  ఇప్పుడు తెల్ల  రేషన్‌ కార్డుల  ఆధారంగా పథకాలు అమలుపరిస్తే అనర్హులకే ఎక్కువగా అందుతాయి,  అర్హులకు  అందే అవకాశం లేకుండా పోతుంది.  మహాలక్ష్మి పథకంలో దరఖాస్తు చేసుకున్న మహిళలు అందరికీ వర్తిస్తుందా ,అన్ని వయసుల  మహిళలు దరఖాస్తు  చేసుకో వచ్చునా   ?  500 గ్యాస్‌  సిలిండర్‌ పథకంలో సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు  ఇస్తారు,  రైతు భరోసా రైతులకు,  కౌలు రైతులకు  కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.  కానీ ఎన్ని ఎకరాలు ఉన్నవారికి ఇది వర్తిస్తుందో తెలుపలేదు,  10 ఎకరాలకు రైతు భరోసా ఇస్తే 20 ఎకరాలు ఉన్నవారికి  10  ఎకరాలకు  రైతు భరోసా ఇస్తారా? ఇవ్వరా?   ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు.

కానీ ప్రజా పాలన దరఖాస్తులో మాత్రం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అని మాత్రమే ఉంది,  ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం మాత్రమే చేస్తారా?   గృహజ్యోతి పథకంలో అద్దె ఇండ్లలో నివసిస్తూ నెలకు 100 యూనిట్లు కూడా వినియోగించని వారికి ఈ పథకం అందుబాటులోకి  రాదు.   మీటర్‌ నెంబరు యజమాని పేరుమీద ఉంటుంది,  కనుక యూనిట్లు వినియోగించని వారికి ఉచితం అంటే అందరికీ వర్తిస్తుంది.   పేద కుటుంబాలలోని సుమారు 40 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి 2500 ఇస్తే వేయి కోట్ల రూపాయలు కావాలి.  రైతుబంధు పథకంలో ఎకరాకు అదనంగా 5000 చొప్పున కోటి 50 లక్షల ఎకరాలకు ఇస్తే 7 వేల 500 కోట్లు,  ఇందిరమ్మ ఇళ్లకు కనీసం 30 లక్షల మందికి 5 లక్షల చొప్పున ఇస్తే లక్ష 50వేల కోట్లు,  93 లక్షల కుటుంబాలకు 500 కు గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తే,  ప్రభుత్వం ఒక సిలిండర్‌ కి 700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 651 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది .  ఇన్ని  కోట్ల రూపాయలు  ప్రభుత్వం  సమకూర్చుకోవడం  సాధ్యమేనా అని  మేధావులను  తోలచి వేస్తున్న ప్రశ్న.  ఇప్పటికైనా ప్రభుత్వం తెల్ల రేషన్‌ కార్డుల విషయంలో స్పష్టమైన విధి విధానాలు తీసుకొని,  ఏ పథకానికి ఎవరు అర్హులో   స్పష్టంగా తెలిపి ప్రజల అపోహలను, అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.  దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఏ పథకానికి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నారో ఒక అంచనా వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.  దరఖాస్తుదారుల అంచనాలకే పరిమితం అవుతుందా,  లేక అమలుకు దారి పడుతుందా వేచి చూడాలి.

 -వేదాంతం హరికుమార్‌
హనుమకొండ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *