ముఖాముఖి పోటీ, త్రిముఖ పోటీలతో హడావిడి
ఒకవైపు ప్రచారాలు…మరోవైపు వ్యూహాలు
ఇప్పటికే ప్రచారంలో చాలా ముందున్న బిఆర్‌ఎస్
దిల్లీ పెద్దల వరుస పర్యటనలతో కాంగ్రెస్, బిజెపిల్లోనూ ప్రచారంలో ఊపు
మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్ 19 : ఎన్నికల ప్రచారానికి ఇక మిగిలింది పది రోజులు మాత్రమే. ఇరవై నాలుగు గంటల ముందు బహిరంగ ప్రచారం నిలిపివేయాల్సి ఉండడంతో వాస్తవంగా మిగిలేది ఎనిమిది రోజులు మాత్రమే. ఈ ఎనిమిది రోజుల్లో వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. పోటీపడి ప్రచారం చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 2,290 మంది అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. వీరిలో వివిధ పార్టీలకు చెందినవారు, స్వతంత్రులున్నారు. అంతే కాకుండా పోటీ చేస్తున్నవారిలో 221 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే మహిళలకు అన్ని చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ ఇంకా చట్టరూపం దాల్చకపోయినా, ఆ నినాదాన్ని ఎత్తుకున్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ నిబంధనను మాత్రం ఎక్కడా పాటించలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు త్వరలోనే మోక్షం కల్పిస్తామని కేంద్రంలో అధికారంలోని బిజెపి చెబుతున్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం పదమూడు మంది మహిళలకు మాత్రమే అవకాశం కల్పించింది. అలాగే కాంగ్రెస్ కూడా అంతకు ఒకటి తక్కువగా పన్నెండు మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ కూడా ఎనిమిది మందికి మాత్రమే ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్నిచ్చింది. బిఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్న జనసేన, సిపిఎం ఒక్కో స్థానం మహిళలకు కేటాయించాయి.
వీరంతా వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గడపగడపకు తిరుగుతున్నారు. దాదాపు అన్ని పార్టీలు, అభ్యర్ధులు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నప్పటికీ ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ, మరికొన్ని ప్రాంతాల్లో ద్విముఖ పోటీనే ఎక్కువగా కనిపిస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు రాష్ట్రంలో బిజెపి చాలా దూకుడుగా ముందుకు పోయింది. ఎప్పుడైతే కర్ణాటక ఫలితాలు వెలువడ్డాయో అప్పటి నుండి ఆ దూకుడు చాలా వరకు తగ్గింది. దానికి తోడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. దీంతో రాష్ట్రంలో బిజెపి వర్సెస్ బిఆర్‌ఎస్ అనుకున్నదల్లా, బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. కాంగ్రెస్ మూడవ స్థానం నుండి అనూహ్యంగా రెండవ స్థానాన్ని అక్రమించుకుంది. అయితే రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బిజెపి కేంద్ర నాయకులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని తమ భుజాన వేసుకోవడంతో ఆ పార్టీ తిరిగి పుంజుకోవడం ప్రారంభించింది. దానికి తగినట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అంతటి వాడే రాష్ట్రంలో ఒకటికి నాలుగుసార్లు రావడం కూడా ఆ పార్టీ వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెరుగడానికి కారణమైంది. దాంతో పాటు ఈ ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజార్టీని సాధించినట్లైతే కాబోయే ముఖ్యమంత్రి బిసీ వర్గానికి చెందిన వాడవుతాడన్న విషయాన్ని ఢంకా బజాయించి చెప్పడంతో సమాజంలో అత్యధిక శాతం ఉన్న బిసీలు బిజెపివైపు మొగ్గుతారనుకుంటున్నారు. దానికితోడు తాజాగా రాష్ట్ర రాజధానిలో ఎస్సీ వర్గీకరణపై భారీగా ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా స్యయంగా ప్రధాని అంతటివాడు పాల్గొనడంతో ఈ రెండు సామాజికవర్గాలు బిజెపిని గెలిపిస్తామన్న ధృడమైన విశ్వాసంతో ఆ పార్టీ ఉంది. తాజాగా శనివారం ఆలస్యంగానైనా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షాతో మానిఫెస్టోను విడుదల చేశారు. అందులో ప్రజలను ఆకట్టుకునే పథకాలను పొందుపర్చారు.
కాగా తెలంగాణలో ఎన్నికలకు ఏడాది ముందు నుండే బిజెపి తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాన్న సంకల్పంతో ఉన్నందున మానిఫోస్టోను కూడా ఆ మేరకు రూపొందించింది. బిజెపి రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ ప్రముఖులందరికీ తెలంగాణను గెలిపించే బాధ్యతలను అప్పగించింది. కాంగ్రెస్ కూడా అందుకేమీ తీసిపోలేదు అన్నట్లు కేంద్ర అధినాయకత్వం తెలంగాణలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకా గాంధీలు ఈ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రచారం చేస్తున్నారు. బిజెపి మానిఫెస్టోకన్నా ఒక రోజు ముందే హైదరాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో మానిఫెస్టోను విడుదల చేయించింది. కాగా రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ గాలి వీస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో చూపినా బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తున్నది. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ కూడా లేకపోలేదు. కాగా బిఆర్‌ఎస్ ఆది నుంచీ ప్రజల్లోకి దూసుకుపోతున్నది. కాంగ్రెస్, బిజెపిలాగా దానికి అధిష్టాన వర్గం ఏదీ లేకపోవడంతో అన్నిటికీ తానే అయి కెసిఆర్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒక్క రోజులో మూడు నాలుగు సభల్లో పాల్గొంటున్నాడు. ఆయనకు కుడి ఎడమ అటు అల్లుడు హరీష్‌రావు, ఇటు కొడుకు కెటిఆర్‌తో పాటు కూతురు కవిత కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా కెసిఆర్ ఈసారి ఆలోచించుకుని వోటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. అభ్యర్థులు ఎవరు, వారి వెనుక ఉన్న పార్టీలేమిటి, వాటి విశ్వసనీయత ఏంటన్న విషయాలపైనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మొత్తంమీద ఈ మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా దూసుకుపోతున్నా ఈ నెల 30న ప్రజలు ఎవరిపక్షాన తీర్పు ఇస్తారో చూడాలిమరి.





