ప్రకృతే ప్రథమ గురువు

   గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం  పట్ల సరైన అవగాహన, ఆచరణను కలిగి వున్నప్పుడే మానవ జీవితాలకు ఒక సార్ధకత లభిస్తుంది. సమాజంలో నెలకొని ఉన్న మతపరమైన ఆధిపత్య, మూఢత్వ సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ప్రధాన భూమికగా నూతన సంస్కృతి, సాంప్రదాయాలను ఏర్పరుచుకొని, ఇప్పటి వరకు యదార్థ జీవన విధానం కోసం పాటుపడిన తత్వవేత్తలను, వారు ప్రవచించిన సిద్ధాంతాలను, సమూహాలను ఆలంబనగా చేసుకొని మానవీయ కోణంలో వాస్తవిక జీవన విధానంతో నవ సమాజ నిర్మాణానికి దారులు వెతుకుదాం.

విశ్వంలో జీవం పుట్టుక, మనుగడకు గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అత్యంత అవసరం. ఈ ఐదింటిని పంచ భూతాలు అని పిలుస్తారు. పంచ భూతాలే సృష్టి మూలాలు. పంచ భూతాల ద్వారా ఏర్పడిన ప్రాణులు, పంచ భూతాల ద్వారా వచ్చిన వాటిని ఆహారంగా స్వీకరిస్తూ కొంతకాలం జీవించి, ఆతర్వాత తిరిగి పంచ భూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశంలోనే కలిసిపోతాయి. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం సర్వంతర్యామి. పంచభూతాలే పదార్థం, పదార్థమే యదార్థం, యదార్ధమైనదే ప్రకృతి. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశాల సమ్మిలితమే ప్రకృతి. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశాల కలయికే మానవ దేహం. అన్ని ప్రాణుల కన్నా మనుష్యులు అత్యంత తెలివైన ప్రాణులు కావడంతో ప్రకృతిలోని అన్నింటిపై ఆధిపత్యం కలిగి పైచేయి సాధించారు. అదేక్రమంలో ప్రకృతి నియమాలను ఉల్లంఘించి మానవులు సృష్టిస్తున్న విధ్వంసానికి నిరంతరం భారీ మూల్యం చెల్లిస్తున్నారు. జీవ చక్రాన్ని అర్థం చేసుకుంటూ, ప్రకృతి నియమాలను పాటిస్తూ ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి ప్రయత్నించాలి.

గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం మరియు వాటి ద్వారా లభించే వాటిని సరైన క్రమంలో సద్వినియోగం చేసుకుంటూ మానవీయ విలువలు పెంపొందించాలి. మానవీయ సంస్కృతిని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. పంచ భూతాల నుండి వచ్చిన మనిషితో సహా మరేవి శాశ్వతం కావు. పంచ భూతాలు మాత్రమే యదార్ధమైనవి, శాశ్వతమైనవి. భూమి ఓర్పుతో ప్రేమను పంచుతుంది. గాలి నిరంతరం కదులుతూ చైతన్యాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అగ్ని సాహసంతో మండుతూ వేడిని, వెలుగునిస్తుంది. ఆకాశం సమానతకు అద్దం పడుతుంది. నీరు స్వచ్ఛతను చాటుతుంది. ఒకప్పుడు మానవులు పంచ భూతాల ప్రకృతితో మమేకమవుతూ, వాటికి అనుగుణంగా తమ జీవన విధానాన్ని కొనసాగించారు. నేటి నాగరిక మానవులు అనాగారికంగా వ్యవహరిస్తూ ప్రకృతిలోని వనరులను ధ్వంసం చేస్తూ విధ్వంస సంస్కృతికి వారసులుగా మారుతున్నారు. తోలి మానవులు ఆహారం లేదా అవసరాల కోసం ఇతర జీవులతో ఘర్షణ (విజాతి ఘర్షణ) పడేవారు. నేటి మానవులలో కొందరు అత్యాశతో కూడిన సంపద, ఆధిపత్యం, అధికారం కోసం సాటి మానవులతో విపరీతమైన ఘర్షణ (సజాతి ఘర్షణ) పడుతున్నారు. సాటి మనుష్యులపై బల ప్రయోగాన్ని, హింసను ప్రయోగిస్తున్నారు. అది పూర్తిగా అనాగరిక చర్య. ఈ ఘర్షణ ఇలాగే కొనసాగితే కాలక్రమేనా మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతుంది.

మన పూర్వీకులు ప్రకృతిలో ఉండే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మొదలైన అంశాల పట్ల ఆసక్తిని కనబరుస్తూ, వాటిని పరిమితంగా వినియోగించుకుంటూ ప్రకృతితో మమేకం అవుతూ జీవించేవారు. మధ్య యుగాలలో ఏర్పడిన మత సంస్కృతి మనుషుల మధ్య విభజన రేఖను గీస్తూ మానవత్వాన్ని మంట కలుపుతుంది. మనిషిని మనిషిగా చూడలేని దౌర్భాగ్యమైన, అతి దారుణమైన సంస్కృతిని పెంచి పోషిస్తుంది. కులం, మతం ఆధారంగా మనుషులను పూర్తిగా వేరు చేయడమే గాక పరస్పరం శత్రువులుగా చిత్రీకరించింది. మతాలు తమ తమ సంస్కృతి, సంప్రదాయాల పేరుతో ప్రజల మధ్య మూర్ఖత్వంతో కూడిన గుడ్డి నమ్మకాలను, అంద విశ్వాసాలను బలంగా రూపొందించి అమలు చేస్తూ మానవులను అసమర్థ జీవన విధానంలోకి నెట్టి వేస్తున్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాలు జరిపిన అవిరాల కృషిని, విజ్ఞానాన్ని సైతం అమాంతం తొక్కి పడుతున్నాయి. ప్రజల మధ్య శాస్త్రీయ, స్నేహ భావజాలాన్ని పెంపొందించకుండా అడ్డుకుంటున్నాయి. మానవ మనుగడకి, సకల జీవరాశులకి అత్యంత అవసరమైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం మొదలైన ప్రకృతి పరమైన యదార్థ అంశాల పట్ల ప్రజలకు అపారమైన అవగాహన, ఆచరణ కలిగించాల్సిన సందర్భాన్ని తోసిపుచ్చి, అన్నింటికి కారణం దేవుడనే తప్పుడు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. మానవులతో సహా సకల ప్రాణుల పుట్టుక, మనుగడ, మరణం తదితర అన్ని అంశాలు గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశంతోనే ముడిపడి ఉన్నాయన్న యదార్థ సంగతిని దాచి పెట్టి, కొంతమంది మనుషులను మహాపురుషులుగా చిత్రీకరించి వారి స్థానంలో విగ్రహాలను ప్రోత్సహించి మూఢ విశ్వాసాలను ప్రజల మనస్సుల్లో నింపారు.

మనిషికి పంచేంద్రియాలు ఎంత ముఖ్యమో సకల జీవరాసులకు గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అంతే అవసరం. ఇవన్నీ పదార్ధ రూపంలో, భౌతిక రూపంలో కనబడుతూ వాస్తవికతను, యదార్ధతను కలిగి ఉన్నాయి. సకల జీవరాసులలో మనుషులు మాత్రమే దైవత్వం అనే భావనను ఏర్పరచుకొని తమ మనుగడ సాగిస్తున్నారు. మనుషులు మినహా మరే ఇతర జీవరాసులు దైవం అనే భావన లేకుండానే జీవిస్తున్నాయి. దైవం అనే చర్చ మానవ మానుగడలో అప్రధానమైనది, కొందరు మానవులు దైవం అనే భావనను కలిగి ఉండి వాస్తవిక జీవన విధానానికి దూరంగా ఉంటూన్నారు. అశాస్త్రీయతను శాస్త్రీయతగా ప్రజలచేత నమ్మిస్తూ, సకల జీవరాసులకు, సమస్త ప్రకృతికి వినాశనకారిగా మారుతున్నారు. ఆధిపత్య పాలకులు, వారి బంధు-మిత్రులు అభివృద్ధి పేరుతో విచ్చలవిడి వనరుల వినియోగంతో ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం కలుషితం చేస్తున్నారు. మానవ జీవితాలను దుర్భరం చేస్తూ, సమాజ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రజలు ప్రకృతి ద్వారా చైతన్యం పొంతూ పాలకులపై వత్తిడి తెవాలి. విధ్వంసంతో కూడిన అనవసర వనరుల వినియోగాన్ని నిలువరించాలి. ప్రకృతి ఆధారిత మానవాభివృద్ధి ప్రణాళికలు రచించాలి. ప్రకృతే ప్రథమ గురువు. ప్రకృతి పాఠాలు నేర్వాలి. మానవీయ విలువలతో నవ సమాజ నిర్మాణానికి పూనుకోవాలి.

అందుకోసం మానవ జీవన సరళిలో ప్రకృతి ఆధారిత మార్పులను ఆహ్వానించాలి. ప్రకృతి నియమాలను నిరంతరం ఆచరించాలి. వాస్తవికత, శాస్త్రీయత, మానవీయ విలువల ఆధారంగా జీవించాలి. దైనందిన జీవితంలో పంచ భూతాల ప్రాధాన్యతను, స్ఫూర్తిని మరువకూడదు. స్వచ్ఛత, సమానత్వం, సాహసం, చైతన్యం, ప్రేమ కలిగి ఉండాలి. గుడ్డిగా దేన్ని నమ్మకూడదు, నిరంతరం పరిశీలించాలి, పరీక్షించాలి, ఫలితాలను సరిచూసుకోవాలి. ఇతరుల ఆహారపు అలవాట్లు, వేష ధారణ, మనోభావాలను గౌరవించాలి. ప్రకృతి, సహజ వనరుల పరిరక్షణకు బద్ధులై ఉండాలి, అత్యాశతో కూడిన అనవసర వినియోగం, విధ్వంసానికి పూనుకోవద్దు. మనుషులను లేదా వ్యక్తులను దైవాలుగా లేదా దైవానికి ప్రతినిధులుగా చూడొద్దు. ఏ రకంగానైనా సాటి మానవుల పట్ల వివక్షత చూపరాదు, మానవుల పట్ల హింస (సజాతి ఘర్షణ)కు పాల్పడరాదు. అమానవీయ విలువలతో కూడిన మానవ జీవన సంస్కృతి, నాగరికతలను భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం అనే పంచ భూతాల సైద్ధాంతిక అవగాహనతో మానవీకరించాలి. భౌతిక, శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామిక విలువలతో ప్రకృతి ఆధారిత మానవ జీవన సంస్కృతి, నాగరికతలను ప్రజల మధ్య నెలకొల్పాలి. ఆచరణాత్మక ఆలోచన, కార్యాచరణ, భావజాల వ్యాప్తితో ప్రజలను చైతన్య పర్చాలి. విశ్వ మానవ శ్రేయస్సు కోసం కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ, లింగ భేదం చూపకుండా ఈ భావజాల వ్యాప్తి మరియు కార్యాచరణలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలి.

గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పట్ల సరైన అవగాహన, ఆచరణను కలిగి వున్నప్పుడే మానవ జీవితాలకు ఒక సార్ధకత లభిస్తుంది. సమాజంలో నెలకొని ఉన్న మతపరమైన ఆధిపత్య, మూఢత్వ సంస్కృతి, సాంప్రదాయాలకు భిన్నంగా గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం ప్రధాన భూమికగా నూతన సంస్కృతి, సాంప్రదాయాలను ఏర్పరుచుకొని, ఇప్పటి వరకు యదార్థ జీవన విధానం కోసం పాటుపడిన తత్వవేత్తలను, వారు ప్రవచించిన సిద్ధాంతాలను, సమూహాలను ఆలంబనగా చేసుకొని మానవీయ కోణంలో వాస్తవిక జీవన విధానంతో నవ సమాజ నిర్మాణానికి దారులు వెతుకుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *