జీ హుజూర్ రాజకీయాలు ఇక్కడ నడువవు…
గెలిచిన నాటినుండి ఈటల రూపాయి పని కూడా చేయలేదు
బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి హరీష్ రావు ఫైర్
హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్న మంత్రి
జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్ 10 : తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోనే పోరాటాల గడ్డగా పేరొందిన హుజురాబాద్ గడ్డపై డిసెంబర్ 3న గులాబీ జెండా ఎగురడం ఖాయమని మంత్రి హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్ర వారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరైన హరీష్‌రావు మాట్లాడుతూ…తొమ్మిదిన్నర ఏళ్ల తెలంగాణలో కేసీఆర్ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందజేస్తూన్నారని, ప్రతి ఒక్కరు కారు గుర్తుకు వోటు వేసి మూడవ సారి కెసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో జీ హుజూర్ రాజకీయాలకు తావులేదని, నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, నవంబర్ 30న జరుగబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి వోటు వేసి లక్ష వోట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఉప ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి ఒక్క రూపాయి పని కూడా ఈటల చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లకే గ్యారంటీలేదు..సంక్షేమ పథకాలకు ఏం గ్యారంటీ ఉంటుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమో ఇరగదీస్తామన్న చందంగా ఆరు గ్యారంటీ పథకాలంటూ ఊదరగొడుతున్నారు తప్ప అవి వొచ్చేది లేదు చచ్చేది లేదని చురకలంటించారు. కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలోకి వొచ్చిన తరువాత కటిక చీకట్లోకి ఆ రాష్ట్రం వెళ్లిందని, కటక వేస్తే కరెంట్ వొచ్చే బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తారో..లేక కటిక చీకట్లోకి తీసుకువెళ్లే కాంగ్రెస్‌కు వేస్తారొ ప్రజలు ఆలోచించాలని, కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండు దిల్లీ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తాయని, బిఆర్‌ఎస్ పార్టీ మాత్రం ప్రజల ఆదేశాల అనుసారమే పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ,మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, సహకారసంఘాల వైస్ చైర్మన్ పింగిలి రమేష్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్, పాడి కౌశిక్‌రెడ్డి సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీనికరెడ్డి, ఆయా మండలాల జడ్పిటిసిలు,ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు.




