- కేంద్రం ఇండ్లు మంజూరు చేసిన ఇళ్ల లెక్క చెప్పాలె
- రిజిస్ట్రేషన్ల బంద్‌తో ప్రజలకు నానా అవస్థలు
- అన్ని స్కామ్‌లలో కేసీఆర్ కుటుంబానిదే పాత్ర
- నాగోల్ ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
ఎల్బీనగర్, ప్రజాతంత్ర: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం గృహాల కేటాయిస్తుందని..కెసిఆర్ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన గృహాల సంఖ్య లెక్క చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేశారని, కేంద్రం మంజూరు చేసిన ఇండ్లను కూడా కేసీఆర్ కట్టించడం లేదని, కెసిఆర్ సంగతేందో చూడండని ఆయన ప్రజలను కోరారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం మేడ్చల్ జిల్లా, ఎల్పీ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్‌కు నాగోల్ చౌరస్తాలో స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా గజమాలతో సత్కరించారు. గొర్రెపిల్లను బహుకరించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తూ…ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది.
ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తాను సంవత్సరం కాలంగా పాదయాత్ర చేస్తుంటే కెసిఆర్ మాత్రం ప్రజల సమస్యలను గాలికి వొదిలేసి కబ్జాల మీద దృష్టి పెట్టారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేకి వోట్లు వేసి గెలిపించినా… మీకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని, కేసీఆర్ వోట్ల కోసమే…పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్‌లని ప్రజలను ఆశ పెడుతున్నాడని ఆరోపించారు. కెసిఆర్ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించాడో…లెక్క చెప్పమని అడిగితే… ఇప్పటివరకు స్పందించ లేదన్నారు. రెండు సంవత్సరాలుగా ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాడో… లబ్ధిదారుల జాబితా ఇమ్మని తాను లేఖలు రాస్తున్నా కేసీఆర్ నుంచి సమాధానం రాలేదన్నారు. పేదోళ్లకు ఇండ్లు రాకుండా చేస్తున్న మూర్ఖుడు, దుర్మార్గుడు కేసీఆర్ అని ఆరోపించారు.
తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులకు ఇల్లు కట్టిస్తామనీ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో…కెసిఆర్ సంగతేందో చూసే బాధ్యత బిజెపిదని అన్నారు. పాతబస్తీలో ముస్లింలకు హౌస్ టాక్స్ 100 రూపాయలు కూడా వసూలు చేయలేని అసమర్థ ప్రభుత్వం కెసిఆర్‌దని అన్నారు. హిందువులకు సంబంధించిన కరెంటు బిల్లు, నల్లా బిల్లు, హౌస్ టాక్స్ సహా…అన్ని బిల్లులను ముక్కు పిండి మరీ వసూలు చేస్తారని.. పాతబస్తీలో నల్లా బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి బిల్లు మాత్రం వసూలు చేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. మనం కట్టే పైసలను ముఖ్యమంత్రి దోచుకుంటుండగా ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. ఇటీవల వరదలకు సిటీ పరిధిలో చాలా ప్రాంతాలు మునిగిపో యాయని, జీహెచ్‌ఎంసీలో వరదల సమయంలో ఒక్కొక్క ఇంటికి పదివేల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి…కేవలం టిఆర్‌ఎస్ వాళ్లకి మాత్రమే ఇచ్చుకున్నాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాస్ పోర్టుల బ్రోకర్ అని ఆరోపించారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జాలు చేశారని బండి సంజయ్ ఆరోపించారు.




