కాల్పుల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల మృతి
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో దోషులుగా గుర్తింపు
చండీఘడ్,జూలై20: పంజాబ్‌లోని అమృత్‌సర్ కు సపంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు హతమయ్యారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నలుగురు గ్యాంగ్‌స్టర్స్ కు సంబంధమున్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు అధికారులు చెప్పారు. సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధమున్న గ్యాంగ్‌స్టర్స్ జగ్దీప్ సింగ్ రూప, మన్ ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుస్సా అమృత్‌సర్- పాకిస్థాన్ సరిహద్దు అట్టారికి సపంలోని చీతాబక్నా ప్రాంతంలో తలదాచు కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు అక్కడ తనిఖీలు నిర్వహించారు.
పోలీసులను చూసిన గ్యాంగ్‌స్టర్స్ వారిపై కాల్పులు జరపడం ఎన్‌కౌంటర్‌కు దారితీసినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఏకే 47రైఫిల్, పిస్తోలుతో పాటు భారీ సంఖ్యలో బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇప్పటివరకూ మొత్తం 8 మంది షూటర్లను అరెస్ట్ చేశారు. దీపక్ మండి అనే షూటర్ ఇంకా పరారీలో ఉన్నాడు. పంజాబ్‌లోని జవహర్కే అనే గ్రామంలో ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపారు.
రెండు స్కార్పియోలు, ఒక బులేరోలో దాదాపు పది మంది దుండగులు సిద్ధూ మూసేవాలా కారును వెంబడించారు. ఓ కారు వీరిని ఓవర్‌టేక్ చేసి.. ముందుకు వెళ్లి నిలిచింది. మూసేవాలా తన వాహనాన్ని నిలిపిన వెంటనే మూడు ఎస్‌యూవీల్లోంచి పిస్టళ్లు, ఏకే-47తో దిగిన దుండగులు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సిద్ధూ మూసేవాలాను పొట్టనపెట్టుకున్నారు. పంజాబ్‌లో 424 మందికి భద్రత ఉపసంహరించిన మర్నాడే ఈ హత్య జరిగింది. ఉలిక్కిపడిన మాన్ ప్రభుత్వం మళ్లీ తిరిగి అందరికీ భద్రతను పునరుద్ధరించింది.




