నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి..

  • బిఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లిస్తున్న కాంగ్రెస్‌
  • లక్ష్మీ పుత్రుడిని లాగేసుకున్న రేవంత్‌రెడ్డి
  • అదే బాటలో మరో పన్నెండు మంది..?

    (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) 
నీవు నేర్పిన విద్యయే నీరజాక్షి అన్నట్లు, బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటి సీనే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రిపీట్‌ అవుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటి సారిగా జరిగిన ఎన్నికల్లో, ఆ తదుపరి 2018లో జరిగిన ఎన్నికల్లో బి(టి)ఆర్‌ఎస్‌ మంచి మెజార్టీతో అసెంబ్లీ స్థానాలను సాధించుకుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండకూడదన్న సంకల్పంతో బిఆర్‌ఎస్‌ వలసలను ప్రోత్సాహించింది.  మొదట్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీని, తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోని ముఖ్యనాయకులను తమ పార్టీలోకి  లాగేసుకుంది. ఆ రెండు ఎన్నికల అనంతరం ఇక రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌కు తిరుగులేదనిపించుకుంది.  కాని, 2023 ఎన్నికల సంరంభం ప్రారంభమవుతున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ పరిస్థితిలో మార్పు  తీసుకురాగలిగారు. ఆయన ధాటిని బిఆర్‌ఎస్‌ అడ్డుకట్ట వేయలేకపోయింది. దానికి తగినట్లుగా బిఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడడం ప్రారంభమైనాయి.
కాంగ్రెస్‌తోపాటు బిజెపి కూడా బిఆర్‌ఎస్‌పై తీవ్రంగా దాడిచేయడంతో,  రాష్ట్రంలోని ఇతర పార్టీలతో దూరాన్ని పాటిస్త్త్తున్న  బిఆర్‌ఎస్‌ తనపై వొచ్చిన ఆరోపణలను  సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయింది. దానికి తగినట్లు పార్టీలో ప్రజాస్వామ్యానికి తావులేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో అనేక మంది పార్టీని వీడుతూ వొచ్చారు. తీరా ఎన్నికలు వొచ్చేనాటికీ బిఆర్‌ఎస్‌ పోటీ చేసే అభ్యర్ధులను ఎదుర్కునాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈ పరిస్థితిలో అటు అధికారాన్ని జారవిడుచుకున్న బిఆర్‌ఎస్‌, కనీసం పార్లమెంటులో తమ గొంతుకను వినిపించేందుకు మచ్చుకు ఒకరినైనా గెలిపించుకోలేక పోయింది. దాంతో ఇప్పుడా పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిరది. తాజా  శాసనసభ  ఎన్నికల్లో 39 మందిని గెలిపించుకున్నప్పటికీ ఎంతమంది పార్టీని అంటిపెట్టుకుని ఉంటారన్నది ఆ పార్టీ నాయకత్వానికే అంతుపట్టని ప్రశ్నగా మారింది. ఎందుకంటే పార్టీలో సీనియర్‌ నాయకులు, విశ్వాసపాత్రులనుకున్నవారంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. రానున్న అయిదేళ్ళ కాలం ఎలాంటి రాజకీయ పదవులు లేకుండా , పార్టీకి సేవచేసుకుంటూ ఉండే పరిస్థితిలో నాయకులులేరు. తమతోపాటు తమ పిల్లల రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌లోకి బారులు కడుతున్నారు. పార్టీలో సముచిత గౌరావాన్ని పొందిన కె. కేశవరావు, కడియం శ్రీహరి లాంటివారు పార్టీకి గుడ్‌బై చెప్పగా, రాజేంద్రనగర్‌ ఎంఎల్‌ఏ ప్రకాశ్‌గౌడ్‌, భద్రాచలం ఎంఎల్‌ఏ తెల్లం వెంకట్రావ్‌, ఖైరతాబాద్‌ ఎంఎల్‌ఏ దానం నాగేందర్‌, ఎంపి రంజిత్‌రెడ్డితోపాటు గద్వాల విజయలక్ష్మీ, బొంతు రామ్మెహన్‌, గుండు సుధారాణి, పట్నం మహేందర్‌ లాంటి వారంతా పార్టీని వీడినవారిలో ఉన్నారు.
ఇప్పుడు తాజాగా పార్టీ అత్యంత ముఖ్యనేతగా, తెలంగాణ ప్రభుత్వంలో స్పీకర్‌గా పనిచేసిన 74 ఏళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా పార్టీని వీడడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇటీవల కాలంలో తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు పోచారం భాస్కర్‌రెడ్డి(డిసీసీబీ చైర్మన్‌)ని ప్రకటించిన శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కొడుకుతో సహా కాంగ్రెస్‌లో చేరిపోయారు. కెసిఆర్‌ అనుమతితోనే తన వారసుడిని ప్రకటించానని చెప్పుకున్న శ్రీనివాసరెడ్డి పార్టీని వీడుతున్న వారిపైన గతంలో విమర్శించారు కూడా. ‘‘పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, తమ  సేవలు పార్టీకి అవసరమైనప్పుడు పార్టీని విడిచిపెట్టే నాయకుడిని తాను కాదని’ చెప్పుకున్నారు. కాని ఆయన సూచన ప్రాయంగానైనా ఎవరికి తెలుపకుండా అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని బిఆర్‌ఎస్‌ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తానే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తన స్వగృహానికి అహ్వానించి కుమారుడితో సహా కాంగ్రెస్‌ తీర్థం తీసుకోవడంపైన ఆగ్రహించిన బిఆర్‌ఎస్‌ శ్రేణులు  మాజీ ఎంఎల్‌ఏ బాల్కసుమన్‌ సారథ్యంలో నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ పోచారం ఇంటికి తరలి వెళ్ళారు. అయితే అప్పటికే పోచారం కాంగ్రెస్‌ కండువ కప్పుకోవడం జరిగిపోయింది. ఆయన ఇంటిముందు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది.
ఆందోళన చేపట్టినవారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఒకటికాగా, ఇదే సమయంలో ఉప్పల్‌ బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డితో మంతనాలు సాగించడం బిఆర్‌ఎస్‌కు మరో షాకిచ్చినట్లైంది. అయితే ఈ వలసలు ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ దానం నాగేందర్‌ ప్రకటించినట్లు మరో 12 మంది బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ నాయకులు  ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. న్యాయపర ఇబ్బందులు తలెత్తకుండా ఒకేసారి మెజార్టీ శాసనసభ్యులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.  తాను గేట్లు తెరుస్తే బిఆర్‌ఎస్‌లో ఎవరూ మిగులరని అసెంబ్లీ ఎన్నికలకు ముందు  రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లుగానే ఇప్పుడు ఆయన గేట్లను బార్లాగా తెరిచినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ ఆకర్ష్‌ పథకానికి బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలంతా ఆకర్షితులవుతున్నారు. చివరకు మిగిలేది ఆ ముగ్గురే అన్నట్లు కెసిఆర్‌, కెటిఆర్‌, హరీష్‌రావులే మిగులుతారేమో అన్నట్లుగానే వాతావరణం మారుతుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కుని ఉద్యమ పార్టీ ఎలా నిలదొక్కుకుంటుందన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *