దొరల ప్రభుత్వం కాదు…మాది ప్రజల ప్రభుత్వం

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం
సంపదను ప్రజలకు అంకితం
పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఆరు గ్యారంటీల అమలు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సిఎం భట్టి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన మంత్రులు, ఎంఎల్‌ఏలు

ఇహీంపట్నం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తమ ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కోసం అధికారంలోకి వొచ్చిన ప్రజా ప్రభుత్వమని, దొరల ప్రభుత్వం కాదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సంపదను ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్కరికో కాకుండా ప్రజలకు అంకితం చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడమే ప్రజాపాలన ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు. గడిచిన దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఒక్క రేషన్‌ కార్డు కూడా మంజూరు కాలేదని అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిదిధిలోని అబ్దుల్లాపూర్‌ మెట్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంఎల్‌ఏలు ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…రెండు పడక గదుల ఇళ్ల కోసం పేద కుటుంబాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాయన్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికె తమ ప్రభుత్వం ప్రజల చెంతకే వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేపట్టిన కార్యక్రమమే ప్రజాపాలన అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒక వర్గానికి, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం తమది కాదని ఆయన తెలిపారు.

తెలంగాణ బిడ్డలై ఉండి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు 6 గ్యారెంటీలు పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చునని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్షత ప్రదర్శించబోమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలు కచ్చితంగా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలుతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల ఆర్ధిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. ఎన్నికల ముందు ప్రకటించినట్టుగానే అధికారంలోకి వొచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఆచరణాత్మకంగా చాటి చెప్పామన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన గంట వ్యవధిలోపే అదే ప్రాంగణంలో రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడానికి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తున్నామని, దాంతో కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని వివరించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో లబ్ధి జరుగుతున్నదని వెల్లడిరచారు. అభయ హస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కోసం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు చెప్పారు. నేటి నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ పెట్టి దరఖాస్తులను స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రజలు ఎవరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్న ప్రజాపాలన తెలంగాణలో మొదలైందన్నారు. ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్‌ మార్చ్‌ పేరిట తాను పాదయాత్ర చేసిన సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారని వివరించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ, పోలీస్‌ వ్యవస్థలతో పాటు ప్రతి సంస్థ, వ్యవస్థ తన కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగించే బాధ్యతగా ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్య పాలన ఉంటుందన్నారు. నాడు పాదయాత్రలో భాగంగా అబ్దుల్లాపూర్‌ మెట్‌కు వొచ్చిన సందర్భంగా ఇండ్లు లేని పేద ప్రజలు తనను కలిశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడిరచారు. అనంతరం ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్‌ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…ఈ రోజు నుంచి వచ్చే నెల 6 వరకు ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల లబ్ది కోసం ప్రజలు దరఖాస్తులు ఇవ్వొచ్చని, ఒకవేళ అందుబాటులో లేనివారు ఈ వారం రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా వార్డులలో ఉన్న అధికారులకు దరఖాస్తులు అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ పొట్రు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, డిసెంబర్‌ 28 నుండి జనవరి 6 వరకు వారం రోజుల పాటు దరఖాస్తుల స్వీకరించబడునని తెలిపారు.డిసెంబర్‌ 31, జనవరి 1 సెలవు రోజులు మినహా అభయహస్తం 6 గ్యారంటీల కొరకు కుటుంబం నుండి ఒకే దరఖాస్తూ మాత్రమే సమర్పించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి, రసీదు పొందాలని పేర్కొన్నారు.

రేషన్‌ కార్డు ఉంటేనే దరఖాస్తు చేయాలి అనే నిబంధన లేదు, ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ ద్వారా కూడా అప్లయ్‌ చేసుకోవచ్చని వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు, అందజేసే ప్రతి దరఖాస్తును స్వీకరిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు.దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు రశీదు, దరఖాస్తు నంబర్‌ భద్రపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా,పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ హన్మంతు,స్పెషల్‌ ఆఫీసర్‌ శృతి ఓజా, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు,జిల్లా పరిషత్‌ సీఈఓ దిలీప్‌ కుమార్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్‌, సీపీఓ సౌమ్య, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌ రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత రెడ్డి, ఎంపీడీఓ,గ్రామ సర్పంచ్‌కిరణ్‌, ఎంపిపి రేఖ మహేందర్‌, జెడ్పీటీసీ బీంగీ దాస్‌, సంబంధిత అధికారులు, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *