దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ

ఆయన కీర్తిని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుంది
పీవీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
పీవీ పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకం : దిల్లీ తెలంగాణ భవన్‌లో పీవీకి డిప్యూటీ సిఎం భట్టి నివాళి

హైదరాబాద్‌/న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం పీవీ నరసింహా రావు 19వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ వద్ద సిఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారని, తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటాడని ఆయన చెప్పిన విషయాన్ని రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.  పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని అన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని, పేదలకు భూములు పంచడానికి ఆయన  బలమైన పునాదులు వేశారని అన్నారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమని సీఎం పేర్కొన్నారు. పీవీ ఘాట్‌, జైపాల్‌ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, పీవీ కుటుంబ సభ్యులు, టీపీపీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు.
పీవీ పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకం : దిల్లీ తెలంగాణ భవన్‌లో పీవీకి డిప్యూటీ సిఎం భట్టి నివాళి
పీవీ పాలనా దక్షత ఇతర రాష్ట్రాలకు ఉదాహరణగా నిలిచిందని, ఆయన పాలనా అనుభవం అందరికీ స్ఫూర్తిదాయకమని, దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న సమయంలో ప్రధానిగా పీవీ కీలక భూమిక పోషించారని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పీవీ నరసింహారావు భారత దేశ ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారని, అలాంటి పీవీ తెలంగాణలో పుట్టడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. చిన్న నాటి నుంచే పీవీకి దేశం అంటే చాలా ప్రేమ అని, అదే విధంగా ఆయనకు అనేక భాషలపై మంచి పట్టుందని ఆయన పేర్కొన్నారు. శనివారం న్యూ దిల్లీలోని  తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో రెసిడెంట్‌ కమిషనర్‌ డా.గౌరవ్‌ ఉప్పల్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యి పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూసంస్కరణల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు పీవీ నరసింహారావు అని అన్నారు. పీవీ ఎన్నో గొప్ప సాహస నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అదే విధంగా పీవీ పాలనా దక్షత అనితర సాధ్యమని ూయన అన్నారు. పీవీ ఆలోచనలను, మార్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భవిష్యత్‌ తరాలు నడుం బిగించడమే, మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అని భట్టి అన్నారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ భవన్‌ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *