26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు
ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దసరా సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సెలవుల కుదింపుపై పుకార్ల నేపథ్యంలో విద్యాశాఖ వివరణ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఇస్తామన్న దసరా సెలవుల్ని కుదించినట్లు వి•డియా వర్గాల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్సీఈఆర్టీ ప్రతిపాదించినట్లు వార్తలు వొచ్చాయి.
అంతేకాకుండా జూలైలో వర్షాల కారణంగా సెప్టెంబర్ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, ఈ సెలవు దినాలను భర్తీ చేసేందుకు దసరా సెలవులను కుదించాలని ఎస్‌సీఈఆర్‌టీ పాఠశాల విద్యాశాఖకు ప్రతపాదనలు చేసినట్లు, నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని ప్రతిపాదించినట్టు వార్తలు వొచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ తోసిపుచ్చింది. ముందుగా ప్రకటించిన మేరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు బుధవారంనాడు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది.




