దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ దక్షిణ భారత దేశంపై వివక్ష చూపి ఎవ్వరూ ఊహించని విధంగా రాజ్య సభ నామినేటెడు పదవుల్లో ఈ ప్రాంతం నలుగురికి స్థానం కల్పించింది. దక్షిణ భారత దేశం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతూ వివక్షత చూపిన బీజేపీకి నేడు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రేమ ఎందుకు వచ్చిందో అని చాలామంది సందేహం . దానికి కారణం లేకపోలేదు.. బీజేపీ దేశంలో దాదాపు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దానిలో ఎక్కువ భాగం ఉత్తర భారత దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలం తక్కువగా ఉంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీల అధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు రావలసిన వాటాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. అది ఏమిటి• అని ప్రశ్నించిన రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష పూరితంగా వ్యవహరిస్తుంది.
దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు రాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు మళ్ళిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా, నవోదయ పాఠశాలలు, నూతన రైల్వే లైన్ లు, రైల్వే కోచ్ ప్యాక్టరీలు, కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, జాతీయ రహదారులు వంటివి మంజూరు చేయకుండా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది.. ఈ అన్యాయంపై మాట్లాడిన వారిపై సిబిఐ, ఈడీ దాడులు నిర్వహిస్తామని బెదిరింపు రాజకీయాలు చేస్తుంది బీజేపీ. నేడు దేశంలో మత రాజకీయాలు తార స్థాయికి చేరాయి. రోజు రోజుకు మత ఘర్షణలు అధికమైనవి. ఈ మధ్య కాలంలో వివాదాస్పద వాఖ్యలు చేసిన నూపూర్ శర్మపై సుప్రీం కోర్టు సీరియస్ కావడం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించడం జరిగింది. బీజేపీ మత విద్వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకోవడం ఆనవాయితీగా మారింది. వారి నోటి నుండి ప్రధానంగా ధర్మం అనే పదం వస్తుంది. ధర్మం అందరికి కావాలి.. ఏ మత సారంశమైన ధర్మ మార్గంలో నడవాలని బోధిస్తుంది కానీ మనం ధర్మాన్ని ఎంత వరకు పాటిస్తున్నాము అనే దానిపై ప్రజల శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలని వివిధ రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. దేశంలో ప్రజలు ఒక మతం వారిని మరొకరు గౌరవించుకుంటూ సోదరభావంతో కలిసి మెలసి జీవిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు రాజకీయంగా అందరిని చైతన్య పరుస్తూ దక్షిణ భారత దేశంపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకించాలి. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి, మరి కొన్ని రాష్ట్రాలలో మెజార్టీ తక్కువ ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని క్రమంగా ఆ పార్టీని బలహీన పరిచి అధిపత్యం చెలాయిస్తూ పేరు పొందిన నాయకులకు ధన ప్రలోభాలకు గురి చేసి పార్టీ సిద్దాంతం కోసం కట్టుబడి పార్టీ మారని నాయకులను బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ బీజేపీ అధికారాన్ని చెలాయిస్తుంది. దీనిపై ప్రాంతీయ పార్టీల నాయకులు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని దశాబ్దాలు దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించిన దేశ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇప్పుడు ఉన్న బీజేపీ మీరు దేశానికి ఏం చేశారు ? ఏం చేయాబోతున్నారు చెప్పండి… అంటే గత పాలకుల వల్లనే దేశం వెనుకబాటుకు గురైంది అంటు ఆరోపణలు చేస్తుంది. ఈనాటికి కూడా దేశ అభివృద్ధిపై బీజేపీకి ఒక స్పష్టత లేదు.
ప్రస్తుత సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాని ఏర్పాటు చేయాలని పోరాడుతున్న వారిలో కేసిఆర్ ఒకరు .. దీంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా గద్దె దించాలని కేసిఆర్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో నిర్వహించారు.పార్టీ ని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలని చూస్తుంది బీజేపీ, ఏ పార్టీ అయిన రాజకీయంగా అభివృద్ధి చెందాలి అనుకోవడం తప్పు లేదు.. కానీ తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలోఎంత పైకాం పంపారు.. మీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలి ? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా ఉండాలి కానీ వివక్షపూరితంగా అభివృద్ధికి అడ్డు పడుతుంది. ఒకటి మాత్రం నిజం కాంగ్రెస్ మాకు తిరుగు లేదని అహంకారముతో విర్ర వీగింది,, అటువంటి పార్టీ నేడు ఇంటికి పరిమితమైంది. రానున్న రోజుల్లో బీజేపీకి కూడా ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని గమనించాలి.
నేడు బీజేపీ చేసే చట్టాలను సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వాలపై వరాల జల్లు కురిపిస్తుంది. వ్యతిరేకించినా ప్రభుత్వాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశంలో ఒక వర్గానికి మాత్రమే మేలు చేస్తూ పేద మధ్యతరగతి వారిని మరింత పేదరికములోకి నెట్టి వేస్తుంది. దానికి కారణాలు లేకపోలేదు.. దక్షిణ భారత దేశంలో ఉన్న సంపదను ఉత్తర భారత దేశానికి తరలిస్తూ అదాని, అంబానీలకు కట్ట పెడుతుంది. దేశంలోని సంపదను మొత్తం కొంత మంది దగ్గరే కేంద్రీకృతం చేస్తుంది. దక్షిణ భారత దేశ ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, దేశంలో ఎప్పుడు నిత్యావసర ధరలు పెరిగిన దక్షిణాది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జాతీయ ప్రధాన పార్టీలు అయినా కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తప్ప దక్షిణ భారత దేశానికి చేసింది ఏమి లేదు పైగా ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రముఖులను అణచి వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయిన దక్షిణ భారత దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు పట్టుదలతో ప్రజల మద్దతుతో అధికారం సాధించుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్న అభివృద్ధిలో మాత్రం రాజీ పడటం లేదు. దక్షిణ భారత దేశం నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన వారు చాలా అరుదుగా కనబడుతారు ప్రస్తుత రాజకీయాల్లో దక్షిణ భారత దేశం వారి ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది . దక్షిణ భారత దేశం నుండి మార్పుకై అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలందరూ కలిసి జాతీయ రాజకీయాలో క్రియా శీల పాత్రకై నిరంతరము కృషి చేయాలి.
మిద్దె సురేష్, 9701209355




